2యెహోవా అతణ్ణి భద్రపరచి సజీవంగా ఉంచుతాడు. భూమి మీద అతణ్ణి ఆశీర్వదిస్తాడు. అతని శత్రువులు కోరుకున్నట్టుగా అతణ్ణి వాళ్ళకి స్వాధీనం చేయడు.
3జబ్బు చేసి పడకపై ఉన్నప్పుడు యెహోవా అతణ్ణి పరామర్శిస్తాడు. వ్యాధి పడకను నువ్వు స్వస్థత పడకగా మారుస్తావు.
4నేనిలా అన్నాను. యెహోవా, నీకు విరోధంగా నేను పాపం చేశాను. నన్ను కనికరించు. నా హృదయాన్ని బాగుచెయ్యి.
5నా శత్రువులు నాకు వ్యతిరేకంగా చెడ్డ మాటలు అంటారు, వాడు ఎప్పుడు చచ్చిపోతాడు? వాడి పేరు ఎప్పుడు మాసిపోతుంది? అంటారు.
6నా శత్రువు నన్ను చూడటానికి వస్తే నా గురించి పనికిమాలిన మాటలు చెప్తాడు. వాడి హృదయం నా నాశనం చూడ్డానికి సిద్ధపడి ఉంటుంది. వాడు బయటకు వెళ్లి ఇతరులకు ఆ సంగతి చెప్తాడు.