6పగటి వెలుగులా నీ న్యాయవర్తననూ, మధ్యాహ్నపు వెలుగులా నీ నిర్దోషత్వాన్నీ ఆయన చూపిస్తాడు.
7యెహోవా ఎదుట మౌనంగా ఉండు. సహనంతో ఆయన కోసం వేచి ఉండు. దుర్మార్గాలు చేసి ఎవరన్నా విజయం సాధిస్తే చింతించకు. ఎవరన్నా కుట్రలు చేస్తే విచారించకు.
8కోపపడకు. నిరుత్సాహపడకు. చింతపడకు. దానివల్ల సమస్యలు కలుగుతాయి.
9దుర్మార్గకార్యాలు చేసే వాళ్ళు నిర్మూలం అవుతారు. కానీ యెహోవా కోసం వేచి చూసే వాళ్ళు దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు.
10ఇక కొద్ది కాలంలోగా దుర్మార్గుడు లేకుండా పోతాడు. అతడున్న స్థలాన్ని నువ్వు ఎంత వెదికినా అతడు కనిపించడు.
11నమ్రత గలవాళ్ళు భూమిని స్వాధీనం చేసుకుంటారు. గొప్ప సమృద్ధి కలిగి సంతోషిస్తారు.
12దుష్టుడు ధర్మాత్ముడికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తాడు. వాడు అతనికి విరోధంగా పళ్ళు కొరుకుతాడు.
13వాళ్ళ సమయం అయిపోవచ్చింది కాబట్టి ప్రభువు వాళ్ళను చూసి నవ్వుతాడు.
14అణచివేతకి గురైన వాళ్ళనీ పేదలనీ నిరుత్సాహపరచడానికీ, నిజాయితీగా ఉండేవాళ్ళనీ చంపడానికీ దుష్టులు తమ కత్తులు దూశారు. తమ విల్లును వంచారు.
15వాళ్ళ కత్తులు వాళ్ళ గుండెల్నే చీల్చివేస్తాయి. వాళ్ళ విల్లులు విరిగిపోతాయి.
16దుష్టుల దగ్గర ఉన్న సమృద్ధి కంటే ధర్మాత్ముడి దగ్గర ఉన్న కొంచెమే శ్రేష్ఠమైనది.