6యెహోవా దూత వాళ్ళను తరుముతుంటే వాళ్ళు వెళ్ళే దారి చీకటిగానూ జారుడుగానూ ఉంటుంది గాక!
7కారణం లేకుండానే వాళ్ళు నన్ను పట్టుకోడానికి వల వేశారు. కారణం లేకుండానే వాళ్ళు నా ప్రాణం తీయాలని నా కోసం గుంట తవ్వారు.
8వాడి పైకి వాడికి తెలియకుండా వాణ్ణి విస్మయానికి గురి చేస్తూ నాశనం రానీ. వాళ్ళు వేసిన వలలో వాళ్ళనే పడనీ. తమ స్వనాశనం కోసం వాళ్ళనే దానిలో పడనీ.
9అయితే నేను యెహోవాలో ఆనందిస్తూ ఉంటాను. ఆయన ఇచ్చే రక్షణలో సంతోషిస్తూ ఉంటాను.
10అప్పుడు నా శక్తి అంతటితో నేనిలా అంటాను. యెహోవా, నువ్వు అణచివేతకు గురైన వాళ్ళను బలవంతుల చేతిలో నుండీ, పేదలనూ, అవసరార్థులనూ దోచుకునే వాళ్ళ చేతిలో నుండీ విడిపిస్తావు. నీలాటి వారెవరు?
11అధర్మపరులైన సాక్షులు బయల్దేరుతున్నారు. వాళ్ళు నాపై అసత్య నిందలు వేస్తున్నారు.
12నేను వాళ్లకు చేసిన మంచికి బదులుగా వాళ్ళు నాకు చెడు చేస్తున్నారు. నాకు విచారంగా ఉంది.
13అయితే వాళ్ళు వ్యాధితో ఉన్నప్పుడు నేను గోనె గుడ్డ ధరించాను. నా తల వాల్చి వాళ్ళ కోసం ఉపవాసం ఉన్నాను.