23పాపం నుంచి నేను దూరంగా ఉన్నాను. ఆయన దృష్టిలో నేను యథార్ధంగా ఉన్నాను.
24కాబట్టి, నేను నిర్దోషిగా ఉన్న కారణంగా, తన దృష్టిలో నా చేతులు పరిశుభ్రంగా ఉన్న కారణంగా యెహోవా నన్ను పునరుద్ధరించాడు.
25నిర్దోషుల పట్ల నిన్ను నువ్వు నిర్దోషివిగా కనపరచుకుంటావు. నమ్మదగిన వాళ్ళ పట్ల నువ్వు నమ్మదగిన వాడివిగా కనపరచుకుంటావు.
26స్వచ్ఛంగా ఉన్నవాళ్ళ పట్ల నిన్ను నువ్వు స్వచ్ఛంగా కనపరచుకుంటావు. అయితే వక్రబుద్ధి గలవాళ్ళ పట్ల వికటంగా ఉంటావు.
27బాధపడే వాళ్ళను నువ్వు రక్షిస్తావు. కాని, గర్వంతో కళ్ళు నెత్తికెక్కిన వాళ్ళను కిందకు అణిచి వేస్తావు!
28నా దీపానికి వెలుగును ఇచ్చేవాడివి నువ్వే. నా దేవుడైన యెహోవా నా చీకటిని వెలుగుగా చేస్తాడు.
29నీవల్ల నేను అడ్డంకులను అధిగమించగలను. నా దేవుని వల్ల అడ్డుగోడలు దూకగలను.
30దేవుని విషయమైతే, ఆయన పరిపూర్ణుడు. యెహోవా వాక్కు స్వచ్ఛమైనది. ఆయనలో ఆశ్రయం పొందిన వాళ్లకు ఆయన ఒక డాలు.