2యెహోవా నా ఆశ్రయశిల, నా కోట, నన్ను రక్షించేవాడు, ఆయన నా దేవుడు, నా ఆశ్రయశిల. నేను ఆయనలో ఆశ్రయం పొందుతాను. ఆయన నా డాలు, నా రక్షణ కొమ్ము, నా బలమైన పట్టు.
3స్తుతికి అర్హుడైన యెహోవాకు నేను నివేదన చేస్తాను, నేను నా శత్రువులనుంచి రక్షణ పొందుతాను.
4మరణ పాశాలు నన్ను చుట్టుకున్నాయి, దుర్మార్గులు వరద ప్రవాహంలా నా మీద పడి నన్ను అణిచివేస్తున్నారు
5పాతాళ పాశాలు నన్ను చుట్టుముట్టాయి. మరణపు ఉచ్చులు నన్ను చిక్కించుకున్నాయి.
6నా బాధలో నేను యెహోవాకు మొరపెట్టాను. నాకు సహాయం చెయ్యమని దేవునికి ప్రార్థన చేశాను. ఆయన తన ఆలయంలోనుంచి నా స్వరం విన్నాడు, నా నివేదన ఆయన సన్నిధిలో ఆయన చెవిన పడింది.
7అప్పుడు భూమి కంపించి వణికింది. దేవుడు కోపంగా ఉన్నాడు గనక పర్వతాల పునాదులు కూడా కదిలి వణికాయి.