3నగర ప్రధాన ద్వారం దగ్గర, ఇంటి గుమ్మాల దగ్గర, పట్టణపు కేంద్రాల దగ్గర నిలబడి జ్ఞానం బిగ్గరగా ఇలా ప్రకటిస్తూ ఉంది.
4“మనుషులారా, ఈ మాటలు మీకోసమే. మనుషులైన మీకే నా మాటలు వినిపిస్తున్నాను.
5జ్ఞానం లేని మనుషులారా, జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోండి. బుద్ధిహీనులారా, బుద్ధి అంటే ఎలాంటిదో ఆలోచించి గ్రహించండి.
6వినండి, నేను అతి ప్రాముఖ్యమైన విషయాలు చెబుతాను. నా పెదవులు యథార్థమైన మాటలు మాట్లాడతాయి.
7నేను నిజమైన మాటలు చెబుతాను. చెడుతనం అంటే నాకు అసహ్యం.
8న్యాయమైన మాటలే నేను చెబుతాను. నేను చెప్పే మాటల్లో కపటం, మూర్ఖత్వం ఏమీ ఉండదు.
9నా మాటలన్నీ వివేకం గలవాడికి తేటగా అర్థం అవుతాయి. తెలివి గలవాడు న్యాయం గ్రహిస్తాడు.
10వెండి కోసం, స్వచ్ఛమైన బంగారం కోసం ఆశ పడకుండా నా ఉపదేశం అంగీకరించి, తెలివితేటలు సంపాదించుకోండి.
11విలువైన ముత్యాల కంటే జ్ఞానం శ్రేష్ఠమైనది. జ్ఞానంతో అత్యంత విలువైన ధన సంపదలు సాటిరావు.
12నాలో జ్ఞానం, వివేకం నివసిస్తున్నాయి. మంచి చెడ్డలు ఏమిటో నేను గ్రహించగలను.
13దుష్టత్వాన్ని అసహ్యించుకోవడం అంటే యెహోవాపట్ల భయభక్తులు గలిగి ఉండడమే. గర్వం, అహంకారం, దుర్మార్గం, కుటిలమైన మాటలు నాకు హేయం.
14అమితమైన జ్ఞానం, వివేకంతో కూడిన ఆలోచనలు నేనే అనుగ్రహిస్తాను. జ్ఞానానికి బల ప్రభావాలకు ఆధారం నేనే.
15నా మూలంగా రాజులు పరిపాలిస్తారు. అధికారులు న్యాయమైన చట్టాలు నియమిస్తారు.
16నా మూలంగా ఘనత వహించిన న్యాయాధిపతులంతా న్యాయం జరిగిస్తారు. లోకంలోని అధికారులు పాలన సాగిస్తారు.
17నన్ను ప్రేమించే వాళ్ళను నేను ప్రేమిస్తున్నాను. నన్ను జాగ్రత్తగా వెదికే వాళ్ళు నన్ను కనుక్కుంటారు.
18ఐశ్వర్యం, ప్రతిష్ఠ, నీతి న్యాయాలు, విస్తారమైన సంపదలు నా నుండి వస్తాయి.
19నా వల్ల కలిగే ఫలం బంగారం కంటే, మేలిమి బంగారం కంటే విలువైనది. నాణ్యమైన వెండి కంటే నా ద్వారా కలిగే సమృద్ధి ప్రయోజనకరమైనది.
20నేను నడిచే మార్గంలో నీతి, న్యాయాలు ఉన్నాయి.