1కుమారా, నేను బోధించే జ్ఞానవాక్కులు విను. నా తెలివి గల మాటలు శ్రద్ధగా ఆలకించు.
2అప్పుడు నువ్వు జ్ఞానయుక్తంగా నడుచుకుంటావు. నీ తెలివితేటలను బట్టి నీ నోరు మాట్లాడుతుంది.
3వ్యభిచారిణి పెదవుల నుండి తేనెలాంటి మాటలు వెలువడతాయి. దాని నోటి మాటలు నూనె కంటే మృదువుగా ఉంటాయి.
4చివరికి ఆమె వసనాభి కాయలాగా ఉంటుంది. రెండంచుల కత్తి వలే ఉంటుంది.
5దాని ప్రవర్తన మరణంలో పడిపోవడానికి దారితీస్తుంది. దాని మార్గం సూటిగా పాతాళానికి చేరుస్తుంది.
6జీవమార్గం గురించి వ్యభిచారిణి ఎంతమాత్రం ఆలోచించదు. ఆమె ఎటు వెళ్తుందో ఆమెకే తెలియక అటూ ఇటూ సంచరిస్తుంది.
7కుమారులారా, నేను చెప్పే బోధ ఆలకించండి. నేను చెప్పే ఉపదేశం నుండి పక్కకు మళ్ళుకోవద్దు.
8వ్యభిచారిణి నివసించే స్థలాల నుండి నీ అడుగులు దూరం చేసుకో. ఆమె యింటి వాకిలి వైపు పోవద్దు.
9నువ్వు గనుక వ్యభిచారిణి దగ్గరికి వెళ్లిన పక్షంలో నీ ప్రతిష్ట నవ్వుల పాలౌతుంది. నీ జీవిత కాలమంతా దుష్టుల చేతిల్లోకి వెళ్తుంది.
10అన్యులు నీ ఆస్తిని అనుభవిస్తారు. నీ కష్టార్జితమంతా పరుల ఇల్లు చేరుతుంది.