2విషయాన్ని గోప్యంగా ఉంచడం దేవునికి ఘనత. సంగతిని పరిశోధించడం రాజులకు ఘనత.
3ఆకాశాల ఎత్తు, భూమి లోతు, రాజుల అభిప్రాయం అగమ్యగోచరం.
4వెండిలోని కల్మషం తీసేస్తే లోహకారుడు తన పనితనంతో వస్తువు తయారు చేస్తాడు.
5రాజు సముఖం నుండి దుష్టులను తొలగించ గలిగితే అతని సింహాసనం నీతిమూలంగా స్థిరం అవుతుంది.
6రాజు ఎదుట నీ గొప్ప చెప్పుకోకు. గొప్పవారికి కేటాయించిన చోట ఉండవద్దు.
7నీవు గమనించి చూసిన ప్రధాని ఎదుట ఎవరైనా నిన్ను తగ్గించడం కంటే “ఈ పైచోటికి రా” అని అతడు నీతో చెప్పడం మంచిది కదా.
8అనాలోచితంగా న్యాయ స్థానానికి పోవద్దు. చివరికి నీ పొరుగువాడు నిన్ను అవమాన పరచి “ఇక నువ్వేమి చేస్తావు?” అని నీతో అంటాడు కదా.
9నీ పొరుగువాడితో నీవు వాదులాడ వచ్చు గానీ ఎదుటి వ్యక్తి గుట్టు నలుగురిలో రట్టు చెయ్యవద్దు.
10అలా చేస్తే వినేవాడు నిన్ను అవమానపరుస్తాడేమో. ఆ విధంగా నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికి మాసిపోదు.
11సమయోచితంగా పలికిన మాట వెండి పళ్ళెంలో పొదిగిన బంగారు పండ్ల వంటిది.
12బంగారు చెవిపోగులు ఎలాటివో స్వర్ణాభరణాలు ఎలాటివో వినే వాడి చెవికి జ్ఞానం గల ఉపదేశకుడు అలాటి వాడు.
13నమ్మకమైన దూత తనను పంపిన వారిపాలిట కోతకాలపు మంచు చల్లదనం వంటి చల్లదనం గలవాడు. వాడు తన యజమానుల హృదయానికి ఆహ్లాదం కలిగిస్తాడు.