19దుర్మార్గులతో కలసి దోచుకున్న సొమ్ము పంచుకోవడం కంటే, వినయంతో దీన మనస్కులతో ఉండడం మంచిది.
20ఉపదేశం శ్రద్ధగా ఆలకించే వారికి మేలు కలుగుతుంది. యెహోవాను ఆశ్రయం కోరేవాడు ధన్యుడు.
21హృదయంలో జ్ఞానం నిండి ఉన్నవాడు వివేకవంతుడు. మధురమైన మాటలు విద్యాభివృద్ది కలిగిస్తాయి.
22తెలివిగల వారికి వారి జ్ఞానం జీవం కలిగించే ఊట వంటిది. మూఢులకు వారి మూర్ఖత్వమే శిక్షగా మారుతుంది.
23జ్ఞాని హృదయం వాడికి తెలివి బోధిస్తుంది. వాడి పెదాలకు నమ్రత జోడిస్తుంది.
24మధురమైన మాటలు కమ్మని తేనె వంటివి. అవి ప్రాణానికి మాధుర్యం, ఎముకలకు ఆరోగ్యం.
25ఒకడు నడిచే బాట వాడి దృష్టికి యథార్థం అనిపిస్తుంది. చివరకూ అది మరణానికి నడిపిస్తుంది.
26కూలివాడి ఆకలే వాడి చేత అని చేయిస్తుంది. వాడి క్షుద్బాధ వాడు పనిచేసేలా తొందరపెడుతుంది.
27దుష్టులు కీడు కలిగించడం కోసం కారణాలు వెతుకుతారు. వారి పెదాల మీద కోపాగ్ని రగులుతూ ఉంటుంది.
28మూర్ఖుడు కలహాలు కల్పిస్తాడు. చాడీలు చెప్పేవాడు మిత్రులను విడదీస్తాడు.
29దౌర్జన్యం చేసేవాడు తన పొరుగువాణ్ణి మచ్చిక చేసుకుంటాడు. చెడు మార్గంలో అతణ్ణి నడిపిస్తాడు.
30కళ్ళు మూస్తూ పెదవులు బిగబట్టేవారు, కుయుక్తులు పన్నేవారు కీడు కలిగించే వారు.