Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - లేవీ - లేవీ 13

లేవీ 13:2-25

Help us?
Click on verse(s) to share them!
2“ఒక వ్యక్తి చర్మం పైన వాపు గానీ, ఎండిన పొక్కు గానీ, నిగనిగలాడే మచ్చ గానీ ఉండి అది చర్మ వ్యాధిగా మారితే అతణ్ణి ప్రధాన యాజకుడైన అహరోను దగ్గరికి గానీ, యాజకులైన అతని కొడుకుల దగ్గరికి గానీ తీసుకు రావాలి.
3అప్పుడు ఆ యాజకుడు అతని చర్మంపై ఉన్న వ్యాధిని పరీక్ష చేస్తాడు. వ్యాధి మచ్చ ఉన్న ప్రాంతంపైన వెంట్రుకలు తెల్లగా మారి, ఆ మచ్చ చర్మంలో లోతుగా ఉన్నట్టు కన్పిస్తే అది అంటువ్యాధి. యాజకుడు అతణ్ణి పరీక్ష చేసిన తరువాత అతణ్ణి అశుద్ధుడని నిర్థారించాలి.
4ఒకవేళ నిగనిగలాడే మచ్చ చర్మం పైన తెల్లగా కన్పించి, అది లోతుగా లేకుండా, అక్కడి చర్మం పై వెంట్రుకలు తెల్లగా మారకుండా ఉంటే యాజకుడు ఆ వ్యక్తిని ఏడు రోజులు వేరుగా, ఒంటరిగా ఉంచాలి.
5ఏడో రోజు యాజకుడు అతణ్ణి తిరిగి పరీక్షించాలి. తన దృష్టిలో వ్యాధి ముదరకుండా, ఆ మచ్చ వ్యాపించకుండా ఉందేమో చూడాలి. ఆ మచ్చ చర్మంపై వ్యాపించకుండా ఉంటే యాజకుడు మరో ఏడు రోజులు అతణ్ణి వేరుగా ఉంచాలి.
6ఏడో రోజు యాజకుడు అతణ్ణి రెండోసారి పరీక్షించాలి. వ్యాధి తగ్గి ఆ మచ్చ చర్మం పైన వ్యాపించకుండా ఉంటే అతణ్ణి శుద్ధుడని ప్రకటించాలి. అది పొక్కు మాత్రమే. అతడు తన బట్టలు ఉతుక్కోవాలి. అప్పుడు శుద్ధుడుగా ఉంటాడు.
7అయితే అతడు తన శుద్ధి కోసం యాజకుడికి కన్పించిన తరువాత ఆ మచ్చ చర్మంపైన వ్యాపిస్తే యాజకుడికి మరో సారి కనిపించాలి.
8అప్పుడు ఆ మచ్చ చర్మం పైన ఇంకా వ్యాపించి ఉంటే యాజకుడు అతణ్ణి అశుద్ధుడని నిర్థారించాలి.
9ఎవరికైనా చర్మంపైన పొడలా కన్పిస్తే అతణ్ణి యాజకుడి దగ్గరకి తీసుకురావాలి.
10యాజకుడు ఏదన్నా వాపు చర్మంపైన తెల్లగా కన్పిస్తుందేమో చూడాలి. అక్కడి వెంట్రుకలు తెల్లగా మారి, ఆ వాపు రేగి పుండులా కన్పిస్తుందేమో చూడాలి.
11ఈ సూచనలు కన్పిస్తే అది తీవ్రమైన చర్మవ్యాధి. యాజకుడు అతణ్ణి అశుద్ధుడని నిర్థారించాలి. అతడు అప్పటికే అశుద్ధుడు కాబట్టి అతణ్ణి వేరుగా ఉంచకూడదు.
12ఆ చర్మ వ్యాధి మరింత తీవ్రమై ఆ వ్యక్తి తలనుండి కాలి వరకూ వ్యాపిస్తే, అలా యాజకుడికి కూడా అనిపిస్తే, అప్పుడు యాజకుడు వ్యాధి ఆ వ్యక్తి శరీరమంతా వ్యాపించిందేమో పరీక్ష చేయాలి.
13ఆ చర్మ వ్యాధి అతని శరీరమంతా వ్యాపిస్తే యాజకుడు అతణ్ణి శుద్ధుడని ప్రకటించాలి. ఒళ్ళంతా తెల్లబారితే అతడు శుద్ధుడు.
14ఒకవేళ అతని ఒంటిపై చర్మం రేగి పుండు అయితే అతడు అశుద్ధుడు.
15యాజకుడు చర్మంపై పచ్చి పుండు చూసి అతణ్ణి అశుద్ధుడని నిర్థారించాలి. ఎందుకంటే రేగిన చర్మం, పచ్చి పుండు అశుద్ధమే. అది అంటువ్యాధి.
16అయితే ఒకవేళ ఆ పుండు ఎండిపోయి చర్మం తిరిగి తెల్లగా కన్పిస్తే ఆ వ్యక్తి యాజకుడి దగ్గరికి వెళ్ళాలి.
17యాజకుడు అతని చర్మం తెల్లగా మారిందేమో చూస్తాడు. అది తెల్లబారితే ఆ వ్యక్తి శుద్ధుడని ప్రకటిస్తాడు.
18ఒక వ్యక్తి చర్మం పైన పుండు వచ్చి అది మానిపోతే
19ఆ పుండు ఉన్న ప్రాంతంలో తెల్లని వాపుగానీ, నిగనిగలాడే మచ్చ గానీ, తెలుపుతో కూడిన ఎర్రని మచ్చ గానీ కన్పిస్తే దాన్ని యాజకుడికి చూపించాలి.
20ఆ మచ్చ చర్మంలో లోతుగా ఉండి ఆ ప్రాంతంలో వెంట్రుకలు తెల్లగా కన్పిస్తున్నాయో లేదో యాజకుడు పరీక్షిస్తాడు. ఒకవేళ అలా ఉంటే అతణ్ణి అశుద్ధుడని ప్రకటించాలి. పుండు ఉన్నచోటే అది కన్పిస్తే అది అంటురోగం.
21యాజకుడు పరీక్షించినప్పుడు ఆ మచ్చపైన వెంట్రుకలు తెల్లగా మారకుండా, అది చర్మం పైన లోతుగా కాకుండా మానిపోతున్నట్టు కన్పిస్తే అతణ్ణి ఏడు రోజులపాటు వేరుగా, ఒంటరిగా ఉంచాలి.
22తరువాత అది చర్మం అంతటా వ్యాపిస్తే యాజకుడు అతణ్ణి అశుద్ధుడని నిర్థారించాలి. అది ఒక అంటు వ్యాధి.
23నిగనిగలాడే మచ్చ అలాగే ఉండిపోయి వ్యాపించకుండా ఉంటే అది పుండు మానిన మచ్చ. యాజకుడు అతణ్ణి శుద్ధుడని ప్రకటించాలి.
24చర్మంపైన కాలిన గాయమై ఆ కాలిన చోట నిగనిగలాడే తెల్లని మచ్చ కానీ, తెలుపుతో కూడిన ఎర్రని మచ్చగానీ ఉంటే యాజకుడు దాన్ని పరీక్షించాలి.
25ఆ మచ్చ చర్మంలో లోతుగా ఉండి ఆ ప్రాంతంలో వెంట్రుకలు తెల్లగా కన్పిస్తున్నాయో లేదో యాజకుడు పరీక్షిస్తాడు. అలా ఉంటే అది అంటువ్యాధి. అది కాలిన గాయంలోనుండి బయటకు వచ్చింది. అప్పుడు యాజకుడు ఆ వ్యక్తిని అశుద్ధుడని నిర్థారించాలి. అది అంటువ్యాధి.

Read లేవీ 13లేవీ 13
Compare లేవీ 13:2-25లేవీ 13:2-25