Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - యోహాను - యోహాను 21

యోహాను 21:9-22

Help us?
Click on verse(s) to share them!
9ఒడ్డుకి రాగానే వారికి అక్కడ నిప్పులూ, వాటి పైన ఉన్న చేపలూ రొట్టే కనిపించాయి.
10అప్పుడు యేసు, “ఇప్పుడు మీరు పట్టిన చేపల్లో కొన్ని తీసుకుని రండి” అని వారికి చెప్పాడు.
11సీమోను పేతురు పడవ ఎక్కి వలను ఒడ్డుకి లాగాడు. దాంట్లో 153 పెద్ద చేపలున్నాయి. అన్ని చేపలు పడినా వల మాత్రం పిగిలి పోలేదు.
12అప్పుడు యేసు, “రండి, భోజనం చేయండి” అని వారిని పిలిచాడు. అప్పటికి ఆయన ప్రభువని వారికి తెలిసి పోయింది కాబట్టి, “నువ్వు ఎవరు” అని అడిగే సాహసం ఎవరూ చేయలేదు.
13యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచి పెట్టాడు. అలాగే చేపలు కూడా ఇచ్చాడు.
14యేసు చనిపోయి సజీవుడిగా లేచిన తరవాత శిష్యులకి ప్రత్యక్షం కావడం ఇది మూడోసారి.
15వారంతా భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి, “యోహాను కొడుకువైన సీమోనూ, వీళ్ళకంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?” అని ప్రశ్నించాడు. అతడు, “అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అన్నాడు. దానికి యేసు, “నా గొర్రెలను మేపు” అని అతనితో చెప్పాడు.
16మరోసారి ఆయన, “యోహాను కొడుకువైన సీమోనూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?” అని అతణ్ణి అడిగాడు. అతడు, “అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అన్నాడు. దానికి యేసు, “నా గొర్రెలకు కాపరిగా ఉండు” అన్నాడు.
17ఆయన మూడోసారి, “యోహాను కొడుకువైన సీమోనూ, నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగాడు. ఇలా ‘నన్ను ప్రేమిస్తున్నావా’ అని మూడోసారి తనను అడిగినందుకు పేతురు ఇబ్బంది పడి, “ప్రభూ నీకు అన్నీ తెలుసు. నిన్ను ప్రేమిస్తున్నానని నీకు బాగా తెలుసు” అన్నాడు. అప్పుడు యేసు, “నా గొర్రెలను మేపు.
18నువ్వు యువకుడిగా ఉన్నప్పుడు నీ అంతట నువ్వే నీ నడుం కట్టుకుని నీకిష్టమైన స్థలాలకు తిరిగే వాడివి. కచ్చితంగా నీకు చెబుతున్నాను. నువ్వు ముసలి వాడివి అయినప్పుడు నువ్వు నీ చేతులు చాపుతావు. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టం లేని చోటికి నిన్ను మోసుకు పోతాడు” అని అతనితో చెప్పాడు.
19దేవుని మహిమ కోసం అతడు ఎలాంటి మరణం పొందుతాడో దాన్ని సూచిస్తూ ఆయన ఈ మాటలు చెప్పాడు. ఇలా చెప్పి ఆయన, “నన్ను అనుసరించు” అని అతనితో అన్నాడు.
20పేతురు వెనక్కి తిరిగి యేసు ప్రేమించిన వాడూ, పస్కా పండగ సందర్భంలో భోజన సమయంలో ఆయన పక్కనే కూర్చుని ఆయన ఛాతీని ఆనుకుంటూ, “ప్రభూ నిన్ను పట్టిచ్చేది ఎవరు” అని అడిగిన శిష్యుడు తమ వెనకే రావడం చూశాడు.
21పేతురు అతణ్ణి చూసి, “ప్రభూ, మరి ఇతడి విషయం ఏమవుతుంది?” అని ఆయనను అడిగాడు.
22దానికి యేసు, “నేను వచ్చే వరకూ అతడు జీవించి ఉండడం నాకిష్టమైతే నీకేమిటి? నువ్వు నన్ను అనుసరించు” అన్నాడు.

Read యోహాను 21యోహాను 21
Compare యోహాను 21:9-22యోహాను 21:9-22