12కాబట్టి మానవులకు బతికినంత కాలం సంతోషంగా, మంచి జరిగిస్తూ ఉండడం కంటే శ్రేష్ఠమైనదేదీ లేదని నేను గ్రహించాను.
13ప్రతి ఒక్కరూ అన్నపానాలు పుచ్చుకుంటూ తన కష్టార్జితాన్ని అనుభవించడం దేవుడిచ్చే బహుమానమే అని కూడా గ్రహించాను.
14దేవుడు చేసే పనులన్నీ నిత్యమైనవి అని నాకు తెలుసు. దానికి మరి దేనినీ కలపలేము, దానినుండి దేనినీ తీయలేము. మానవులు తనలో భయభక్తులు కలిగి ఉండాలని దేవుడే ఈ విధంగా నియమించాడు.
15గతంలో జరిగిందే ఇప్పుడూ జరుగుతుంది. తరవాత జరగబోయేది కూడా ఇంతకు ముందు జరిగిందే. మానవులు మర్మమైన సంగతులు వెదికేలా దేవుడు చేస్తాడు.
16అంతేగాక ఈ లోకంలో న్యాయతీర్పు జరిగించే స్థలాల్లో, నీతి ఉండాల్సిన స్థలాల్లో నాకు దుష్టత్వం కనిపించింది.
17“మంచివారికీ చెడ్డవారికీ వారి ప్రతి ప్రయత్నానికీ, పనికీ తగిన సమయంలో దేవుడే తీర్పు తీరుస్తాడు” అని నా హృదయంలో అనుకున్నాను.
18తాము జంతువుల్లాటి వారని మానవులు తెలుసుకోవాలని దేవుడు అలా చేస్తున్నాడని నేను అనుకున్నాను.
19ఎందుకంటే జంతువులకు జరుగుతున్నట్టే మనుషులకీ జరుగుతూ ఉంది. ఇద్దరి గతీ ఒక్కటే. జంతువులు చనిపోతాయి, మనుషులూ చనిపోతారు. జీవులన్నిటికీ ఒక్కటే ప్రాణం. జంతువుల కంటే మనుషులకు ఎక్కువేమీ లేదు. అంతా ఆవిరిలాగా నిష్ప్రయోజనం కదా!
20అంతా ఒక్క చోటికే వెళతారు. అంతా మట్టిలోనుండి పుట్టింది, ఆ మట్టిలోకే తిరిగి పోతుంది.