5నా ప్రియుడి కోసం తలుపు తీయడానికి నేను లేచాను. నా చేతుల నుంచి బోళం కారుతూ ఉంది. నా వేళ్ళకున్న బోళం తడి తలుపు గడియపై కారింది.
6నా ప్రియునికి తలుపు తీశాను. కానీ అతడు వెళ్లిపోయాడు. నేను కుంగిపోయాను. నీరుగారిపోయాను. నేనతని కోసం వెతికినా కనబడలేదు. నేనతన్ని పిలిచినా అతడు పలకలేదు.
7పట్టణంలో గస్తీ తిరిగేవారు నాకు ఎదురుపడ్డారు. వాళ్ళు నన్ను కొట్టి గాయపర్చారు. ప్రాకారం మీద ఉన్న కావలివారు నా పైట చెంగు లాగేసుకున్నారు.
8(యువతి పట్టణ స్త్రీలతో మాట్లాడుతూ ఉంది) యెరూషలేము ఆడపడుచులారా, నా ప్రియుడు మీకు కనిపిస్తే, అతనిపట్ల ప్రేమతో నేను సొమ్మసిల్లి పోతున్నానని అతనికి చెప్పమని మిమ్మల్ని బతిమాలుతున్నాను.
9(పట్టణ స్త్రీలు యువతితో మాట్లాడుతూ ఉన్నారు.) జగదేక సుందరీ, వేరే ప్రియుల కంటే నీ ప్రియుడి విశేషమేంటి? నువ్వు మాచేత ఇలా ప్రమాణం చేయించుకోడానికి వేరే ప్రియుల కంటే నీ ప్రియుడు ఏవిధంగా గొప్ప?
10(యువతి పట్టణ స్త్రీలతో మాట్లాడుతూ ఉంది) నా ప్రియుడు చూడ చక్కని వాడు. ఎర్రని వాడు. పదివేలమందిలో ప్రత్యేకమైన వాడు.
11అతని తల మేలిమి బంగారం. అతనిది ఉంగరాల జుట్టు, కాకి నలుపు.
12అతని కళ్ళు నదీతీరాన ఎగిరే గువ్వల్లాంటివి. అవి పాలతో కడిగి, రత్నాలు పొదిగినట్టుగా ఉన్నాయి.
13అతని చెక్కిళ్ళు సుగంధమొక్కల తోటలా, కమ్మని సువాసన ఇస్తున్నాయి. అతని పెదవులు లిల్లీ పువ్వుల్లా, బోళం ఊరుతున్నట్టుగా ఉన్నాయి.
14అతని చేతులు, రత్నాలు పొదిగిన బంగారు కడ్డీలు. అతని ఉదరం పచ్చలు పొదిగిన ఏనుగు దంతం.