22“ఇశ్రాయేలు ప్రజలారా, ఈ మాటలు వినండి, దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతాలూ మహత్కార్యాలూ సూచకక్రియలూ మీ మధ్య చేయించి, ఆయనను తన దృష్టికి యోగ్యుడుగా కనపరిచాడు. ఇది మీకే తెలుసు.
23దేవుని స్థిరమైన ప్రణాళికనూ ఆయనకున్న భవిష్య జ్ఞానాన్నీ అనుసరించి ఆయనను అప్పగించడం జరిగింది. ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపారు.
24మరణం ఆయనను బంధించి ఉంచడం అసాధ్యం కాబట్టి దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపాడు.
25“ఆయన గూర్చి దావీదు ఇలా అన్నాడు, ‘నేనెప్పుడూ నా ఎదుట ప్రభువును చూస్తున్నాను, ఆయన నా కుడి పక్కనే ఉన్నాడు కాబట్టి ఏదీ నన్ను కదల్చదు.
26నా హృదయం ఉల్లాసంగా ఉంది. నా నాలుక ఆనందించింది. నా శరీరం కూడా ఆశాభావంతో నిశ్చింతగా ఉంటుంది.
27ఎందుకంటే నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనియ్యవు.
28నాకు జీవమార్గాలు తెలిపావు. నీ ముఖదర్శనంతో నన్ను ఉల్లాసంతో నింపుతావు.’
29“సోదరులారా, పూర్వికుడైన దావీదును గురించి మీతో నేను ధైర్యంగా మాట్లాడగలను. అతడు చనిపోయి సమాధి అయ్యాడు.
30అతని సమాధి ఇప్పటికీ మన మధ్య ఉంది. అతడు ప్రవక్త కాబట్టి ‘అతని గర్భఫలం నుంచి ఒకడిని అతని సింహాసనం మీద కూర్చోబెడతాను’ అని “దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా శపథం చేసిన సంగతి అతనికి తెలుసు.
31క్రీస్తు పాతాళంలో నిలిచి ఉండి పోలేదనీ, ఆయన శరీరం కుళ్ళి పోలేదనీ దావీదు ముందే తెలుసుకుని ఆయన పునరుత్థానాన్ని గూర్చి చెప్పాడు.
32“ఈ యేసును దేవుడు లేపాడు. దీనికి మేమంతా సాక్షులం.