40మా పూర్వీకులకు నీవు దయ చేసిన దేశంలో ప్రజలు జీవించినంత కాలం, వారు ఈ విధంగా నీవంటే భయభక్తులు కలిగి ఉండేలా చెయ్యి. మానవులందరి హృదయాలూ నీకు మాత్రమే తెలుసు.
41నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల సంబంధులు కాని పరదేశులు నీ పేరును బట్టి దూర దేశం నుండి వచ్చి
42నీ గొప్ప పేరును గురించి, నీ బాహుబలం గురించి, నీవు ఎత్తిన నీ చేతి శక్తిని గురించి వింటారు. వారు వచ్చి ఈ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తే
43నీ నివాసమైన ఆకాశం నుండి నీవు విని, పరదేశులు నిన్ను వేడుకొన్న విధంగా సమస్తం అనుగ్రహించు. అప్పుడు లోకంలోని ప్రజలంతా నీ పేరును తెలుసుకుని, నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల్లాగానే నీలో భయభక్తులు కలిగి, నేను కట్టించిన ఈ మందిరానికి నీ పేరు పెట్టామని తెలుసుకుంటారు.
44నీ ప్రజలు తమ శత్రువులతో యుద్ధం చేయడానికి నీవు పంపించే ఏ స్థలానికైనా బయలు దేరినప్పుడు, నీవు కోరుకొన్న పట్టణం వైపుకూ నీ నామ ఘనత కోసం నేను కట్టించిన ఈ మందిరం వైపుకూ తిరిగి యెహోవావైన నీకు ప్రార్థన చేస్తే,
45ఆకాశం నుండి నీవు వారి ప్రార్థన విన్నపాలను విని, వారికి సహాయం చెయ్యి.
46పాపం చేయనివాడు ఒక్కడూ లేడు, వారు నీకు విరోధంగా పాపం చేసినపుడు, నీవు వారి మీద కోపగించుకుని వారిని శత్రువుల చేతికి అప్పగించినప్పుడు, వారు వీరిని దూరమైనా, దగ్గరైనా ఆ శత్రువుల దేశానికి చెరగా తీసుకుపోయినప్పుడు,
47వారు చెరగా వెళ్ళిన దేశంలో తాము చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకుని, ‘మేము దుర్మార్గంగా ప్రవర్తించి పాపం చేశాము’ అని చింతించి, పశ్చాత్తాపపడి నీకు విన్నపం చేస్తే,
48వారు చెరలో ఉన్న దేశం నుండి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో నీ వైపు తిరిగి, నీవు వారి పూర్వీకులకు దయచేసిన దేశం వైపూ, నీవు కోరుకున్న పట్టణం వైపూ నీ నామఘనత కోసం నేను కట్టించిన ఈ మందిరం వైపూ తిరిగి నీకు ప్రార్థన చేస్తే,
49నీ నివాసమైన ఆకాశం నుండి నీవు వారి ప్రార్థన విన్నపాలు విని వారి పని జరిగించు.
50నీకు వ్యతిరేకంగా పాపం చేసిన నీ ప్రజలు ఏ తప్పుల విషయంలో దోషులయ్యారో ఆ తప్పులు క్షమించి, నీ ప్రజలను చెరగొనిపోయిన వారికి వారి పట్ల కనికరం పుట్టించు.
51వారు నీవెన్నుకున్న నీ ప్రజలు. ఇనుప కొలిమి నుండి తప్పించినట్టుగా నీవు ఐగుప్తు దేశంలోనుండి తప్పించిన నీ ప్రజలు.
52కాబట్టి నీ దాసుడినైన నేనూ, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులూ చేసే విన్నపం మీద దృష్టి ఉంచి, వారు ఏ విషయాల్లో నిన్ను వేడుకుంటారో వాటిని ఆలకించు.
53ప్రభూ, యెహోవా, నీవు మా పూర్వీకులను ఐగుప్తులో నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసుడైన మోషే ద్వారా ప్రమాణం చేసినట్టు లోకంలోని ప్రజలందరిలో నుండి వారిని నీ స్వాస్థ్యంగా ప్రత్యేకించుకున్నావు కదా.”
54సొలొమోను ఈ విధంగా ప్రార్థించడం, విన్నపాలు చేయడం ముగించి ఆకాశం వైపు తన చేతులు చాపి, యెహోవా బలిపీఠం ఎదుట మోకాళ్ళపై నుండి లేచి నిలబడ్డాడు.
55అప్పుడు అతడు పెద్ద స్వరంతో ఇశ్రాయేలీయుల సమాజాన్ని ఈ విధంగా దీవించాడు,
56“తాను చేసిన వాగ్దానాలన్నిటినీ నెరవేర్చి తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తుతి కలుగు గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానాల్లో ఒక్క మాటైనా విఫలం కాలేదు.
57కాబట్టి మన దేవుడు యెహోవా మనలను విడిచి పెట్టకుండా మన పూర్వీకులకు తోడుగా ఉన్నట్టు మనకు కూడా తోడుగా ఉండి
58తన మార్గాలన్నిటినీ అనుసరించి నడుచుకొనేలా, తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను, కట్టడలను, విధులను పాటించేలా, మన హృదయాలను తన వైపు తిప్పుకుంటాడు గాక.
59ఆయన తన దాసుడినైన నా కార్యాన్ని, తన ప్రజలైన ఇశ్రాయేలీయుల కార్యాన్ని అనుదిన అవసరత ప్రకారం, జరిగించేలా నేను యెహోవా ఎదుట వేడుకొన్న ఈ మాటలు రాత్రీ పగలూ మన దేవుడు యెహోవా సన్నిధిలో ఉంటాయి గాక.
60అప్పుడు లోకం లోని ప్రజలంతా యెహోవాయే దేవుడనీ, ఆయన తప్ప వేరే దేవుడు లేడనీ తెలుసుకుంటారు.
61కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకోడానికి, ఈ రోజున ఉన్నట్టు ఆయన చేసిన నిర్ణయాలను పాటించడానికి, మీ హృదయం మీ దేవుడు యెహోవా విషయంలో యథార్థంగా ఉండుగాక.”
62అప్పుడు రాజు, అతనితో కూడ ఇశ్రాయేలీయులంతా యెహోవా సన్నిధిలో బలులు అర్పిస్తుండగా
63సొలొమోను 22,000 ఎద్దులను, 1, 20,000 గొర్రెలను, యెహోవాకు సమాధాన బలులుగా అర్పించాడు. ఈ విధంగా రాజు, ఇశ్రాయేలీయులంతా కలిసి యెహోవా మందిరాన్ని ప్రతిష్టించారు.
64ఆ రోజు ఆ దహనబలులు, నైవేద్యాలు, సమాధాన బలి పశువుల కొవ్వుని అర్పించడానికి యెహోవా సన్నిధిలో ఉన్న ఇత్తడి బలిపీఠం సరిపోలేదు. కాబట్టి రాజు యెహోవా మందిరం ఎదుట ఉన్న ఆవరణ మధ్య ఉన్న స్థలాన్ని ప్రతిష్ఠించి అక్కడ దహన బలులు నైవేద్యాలు, సమాధానబలి పశువుల కొవ్వు అర్పించాడు.
65ఆ సమయంలో సొలొమోను, అతనితో కూడ ఇశ్రాయేలీయులంతా హమాతు పట్టంకు పోయే దారి మొదలు ఐగుప్తు నది వరకూ ఉన్న ప్రాంతాలన్నిటి నుండి వచ్చిన ఆ మహా జన సమూహం రెండు వారాలు, అంటే 14 రోజులు యెహోవా సన్నిధిలో పండగ చేశారు.