Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - 1 రాజులు - 1 రాజులు 18

1 రాజులు 18:6-36

Help us?
Click on verse(s) to share them!
6కాబట్టి వాళ్ళు నీళ్ళ కోసం దేశమంతా తిరగి చూడడానికి బృందాలుగా వెళ్ళారు. అహాబు ఒక్కడే ఒక వైపూ ఓబద్యా మరొక వైపూ వెళ్ళారు.
7ఓబద్యా దారిలో వెళుతుంటే అనుకోకుండా ఏలీయా ఎదురు పడ్డాడు. ఓబద్యా అతన్ని గుర్తు పట్టి సాష్టాంగ నమస్కారం చేసి “మీరు నా యజమాని ఏలీయా గదా” అని అడిగాడు.
8అతడు “నేనే. నీవు నీ యజమాని దగ్గరికి వెళ్లి, ‘ఏలీయా ఇక్కడున్నాడు’ అని చెప్పు” అన్నాడు.
9అందుకు ఓబద్యా “అహాబు నన్ను చంపేసేలా మీ దాసుడినైన నన్ను అతనికి అప్పగిస్తావా ఏమిటి? నేనేం పాపం చేశాను?
10నీ దేవుడు యెహోవా ప్రాణం తోడు, నిన్ను పట్టుకోవాలని నా యజమాని వార్తాహరులను పంపించని దేశం గానీ రాజ్యం గానీ లేదు. ‘ఏలీయా ఇక్కడ లేడు’ అని ఆ దేశం గానీ రాజ్యం గానీ అంటే వారితో అలా ప్రమాణం చేయించుకునేవాడు.
11నీవు నీ యజమాని దగ్గరికి వెళ్లి, ‘ఏలీయా ఇక్కడున్నాడు’ అని చెప్పమని నాకు చెబుతున్నావే!
12నేను నీ దగ్గరనుండి వెళ్ళిన వెంటనే యెహోవా ఆత్మ, నాకు తెలియని ప్రదేశానికి నిన్ను తీసుకుపోతాడు. అప్పుడు నేను వెళ్లి అహాబుకు కబురు చెప్పిన తరువాత నీవు అతనికి కనబడకపోతే అతడు నన్ను చంపేస్తాడు. కాబట్టి అలా ఆజ్ఞాపించవద్దు. నీ దాసుడనైన నేను చిన్నప్పటి నుంచి యెహోవాపట్ల భయభక్తులు గలిగిన వాణ్ణి.
13యెజెబెలు యెహోవా ప్రవక్తలను చంపేస్తుంటే నేనేం చేశానో నీకు తెలియదా? నేను యెహోవా ప్రవక్తల్లో వందమందిని, గుహకు యాభై మంది చొప్పున దాచి, భోజనం పెట్టి వారిని పోషించాను.
14ఇప్పుడు ఏలీయా ఇక్కడున్నాడని నీ యజమానికి చెప్పు అంటున్నావే, అహాబు నన్ను చంపేస్తాడు” అని మనవి చేశాడు.
15అప్పుడు ఏలీయా “ఎవరి సన్నిధిలో నేను నిలుచున్నానో దూతల సైన్యాల అధిపతి అయిన యెహోవా జీవం తోడు, కచ్చితంగా ఈ రోజు నేను అహాబును కలుసుకుంటాను” అన్నాడు.
16కాబట్టి ఓబద్యా అహాబును కలుసుకుని ఈ విషయం తెలియచేశాడు. వెంటనే ఏలీయాను కలుసుకోడానికి అహాబు బయలుదేరాడు.
17అహాబు ఏలీయాను చూడగానే “ఇశ్రాయేలు ప్రజా కంటకుడా, నువ్వేనా” అన్నాడు.
18ఏలీయా “ఇశ్రాయేలు ప్రజలను కష్ట పెట్టేది నేను కాదు, నువ్వూ నీ తండ్రి వంశం వాళ్ళు. మీరు యెహోవా ఆజ్ఞలను పాటించకుండా బయలు విగ్రహాలను అనుసరించారు.
19అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారందరినీ యెజెబెలు పోషిస్తున్న బయలు దేవుడి ప్రవక్తలు 450 మందినీ అషేరాదేవి ప్రవక్తలు 400 మందినీ నా దగ్గరికి కర్మెలు పర్వతానికి పిలిపించు” అన్నాడు.
20అహాబు ఇశ్రాయేలు వారందరి దగ్గరికి వార్తాహరులను పంపి, ప్రవక్తలను కర్మెలు పర్వతం దగ్గరికి సమకూర్చాడు.
21ఏలీయా ప్రజలందరి దగ్గరికి వచ్చి “ఎంతకాలం మీరు రెండు అభిప్రాయాల మధ్య తడబడుతూ ఉంటారు? యెహోవా దేవుడైతే ఆయన్ని అనుసరించండి, బయలు దేవుడైతే వాణ్ణి అనుసరించండి” అని చెప్పాడు. ప్రజలు అతనికి జవాబుగా ఒక మాట కూడా పలకలేదు.
22అప్పుడు ఏలీయా “యెహోవా ప్రవక్తల్లో నేను ఒక్కడినే మిగిలాను. అయితే, బయలు ప్రవక్తలు 450 మంది ఉన్నారు.
23మాకు రెండు ఎద్దులు ఇవ్వండి. వాళ్ళు వాటిలో ఒక దాన్ని కోరుకుని దాన్ని ముక్కలు చేసి, కింద నిప్పు పెట్టకుండా కట్టెల మీద ఉంచాలి. రెండవ ఎద్దును నేను సిద్ధం చేసి, కింద నిప్పు పెట్టకుండా దాన్ని కట్టెల మీద పెడతాను.
24తరువాత మీరు మీ దేవుడు పేరును బట్టి ప్రార్థన చేయండి. నేను యెహోవా పేరును బట్టి ప్రార్థన చేస్తాను. ఏ దేవుడు కట్టెలు కాల్చి జవాబిస్తాడో ఆయనే దేవుడు” అన్నాడు. ప్రజలంతా “ఆ మాట బాగుంది” అని జవాబిచ్చారు.
25అప్పుడు ఏలీయా, బయలు ప్రవక్తలను పిలిచి “మీరు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరే మొదట ఒక ఎద్దును సిద్ధం చేసి మీ దేవుడి పేర ప్రార్థన చేయండి. అయితే కింద నిప్పు పెట్టొద్దు” అన్నాడు.
26వారు తమకిచ్చిన ఎద్దును తీసుకు సిద్ధం చేసి, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ “బయలు దేవుడా, మా ప్రార్థన విను” అంటూ బయలు పేరున ప్రార్థన చేశారు గాని వారికి ఒక్క మాట కూడా జవాబిచ్చేవాడు ఎవడూ లేకపోయారు. వాళ్ళు తాము చేసిన బలిపీఠం దగ్గర చిందులు తొక్కడం మొదలు పెట్టారు.
27మధ్యాహ్నమైనప్పుడు ఏలీయా “వాడు దేవుడు గదా! పెద్దగా కేకలేయండి. వాడు ఒకవేళ పరధ్యానంలో ఉన్నాడేమో! మూత్రవిసర్జనకు వెళ్లాడేమో, ప్రయాణంలో ఉన్నాడేమో! ఒకవేళ నిద్రపోతుంటే లేపాలేమో” అని గేలి చేశాడు.
28వారింకా పెద్దగా కేకలేస్తూ రక్తం కారేంత వరకూ తమ అలవాటు ప్రకారం కత్తులతో బాణాలతో తమ దేహాలను కోసుకుంటున్నారు.
29ఈ విధంగా మధ్యాహ్నం నుంచి సాయంత్ర బలి అర్పణ సమయం వరకూ వారు కేకలు వేశారు గానీ వాళ్ళకి ఏ జవాబూ రాలేదు. ఏ దేవుడూ వారి కేకలను పట్టించుకోలేదు.
30అప్పుడు ఏలీయా “నా దగ్గరికి రండి” అని ప్రజలతో చెప్పాడు. వారంతా అతని దగ్గరికి వచ్చారు. అతడు పాడైపోయి ఉన్న యెహోవా బలిపీఠాన్ని మరమ్మతు చేశాడు.
31“నీ పేరు ఇశ్రాయేలు” అని యెహోవా వాగ్దానం పొందిన యాకోబు వంశపు గోత్రాల లెక్క ప్రకారం ఏలీయా పన్నెండు పెద్ద రాళ్లను తీసుకున్నాడు.
32ఆ రాళ్లతో యెహోవా పేరున ఒక బలిపీఠం కట్టించి, దాని చుట్టూ 20 లీటర్ల నీళ్ళు పట్టేంత లోతుగా కందకమొకటి తవ్వించాడు.
33కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దును ముక్కలు చేసి ఆ కట్టెల మీద ఉంచాడు. ప్రజలు చూస్తూ ఉంటే “మీరు నాలుగు తొట్ల నిండా నీళ్లు నింపి, దహనబలి పశుమాంసం మీదా కట్టెల మీదా పోయండి” అన్నాడు.
34తరువాత “రెండవ సారి అలాగే చేయండి” అని చెప్పాడు. వారు రెండవ సారి కూడా ఆలాగే చేశారు. “మూడవ సారి కూడా చేయండి” అన్నాడు. వారు మూడవ సారి కూడా అలా చేశారు.
35అప్పుడు ఆ నీళ్లు బలిపీఠం చుట్టూ పొర్లి పారాయి. అతడు కందకాన్ని నీళ్లతో నింపాడు.
36సాయంత్ర బలి అర్పణ అర్పించే సమయానికి ఏలీయా ప్రవక్త బలిపీఠం దగ్గరికి వచ్చి “యెహోవా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనీ నేను నీ సేవకుడనై ఉన్నాననీ నేనిదంతా నీ మాట ప్రకారమే చేశాననీ ఈ రోజు చూపించు.

Read 1 రాజులు 181 రాజులు 18
Compare 1 రాజులు 18:6-361 రాజులు 18:6-36