25పర్వతాలు స్థిరం కాక ముందు, కొండలు ఉనికిలోకి రాకముందు నేను పుట్టాను.
26ఆయన ఇంకా భూమినీ, మైదానాలనూ చేయకముందే, నేలపై మట్టిని సిద్ధం చేయకముందే నేను పుట్టాను.
27ఆయన ఆకాశాలను స్థిరపరచి, జలాగాథాలకు పరిమితులు నిర్ణయించినప్పుడు నేను అక్కడే ఉన్నాను.
28ఆయన ఆకాశాన్ని స్థిరపరచినప్పుడు, జలధారలకు పరిథి ఉంచినప్పుడు నేను ఉన్నాను.
29భూమికి పునాదులు వేసినప్పుడు, సముద్ర జలాలు తమ సరిహద్దులు దాటకుండా సముద్రాలకు పొలిమేరలు ఏర్పరచినప్పుడు నేను ఉన్నాను.
30నేను ఆయనతోనే ఉన్నాను. ఆయన ముఖ్యమైన శిల్పకారుణ్ణి నేనే. నిరంతరం ఆయన నన్ను గూర్చి ఆనందించాడు. ఆయన సన్నిధిలో నేను నిత్యమూ ఆనందిస్తున్నాను.
31ఆయన సృష్టించిన లోకాన్నిబట్టి, భూమిని బట్టి నాకు సంతోషం కలుగుతుంది. భూమిపై ఉన్న మానవ జాతిని చూసి ఆనందిస్తున్నాను.
32కుమారులారా, నా మాట శ్రద్ధగా వినండి. నేను చెప్పే మార్గాలు అనుసరించే వాళ్ళు ధన్యులు.
33నా ఉపదేశాలను నిర్యక్షం చేయకుండా వాటిని పాటించి వివేకంతో నడుచుకోండి.
34నా ఉపదేశం వినేవాళ్ళు ధన్యులు. ప్రతిరోజూ నా గుమ్మం దగ్గర కనిపెట్టుకుని నా గుమ్మం తలుపుల దగ్గర నా కోసం కాచుకుని నా ఉపదేశం వినేవారు ధన్యులు.