11శుద్ధ హృదయాన్ని ప్రేమిస్తూ ఇంపైన మాటలు పలికే వాడికి రాజు స్నేహితుడౌతాడు.
12జ్ఞానం గలవాడిపై యెహోవా చూపు నిలుపుకుని అతణ్ణి కాపాడతాడు. విశ్వాస ఘాతకుల మాటలు ఆయన కొట్టి పారేస్తాడు.
13సోమరి “బయట సింహం ఉంది, బయటికి వెళ్తే చచ్చిపోతాను” అంటాడు.
14వేశ్య నోరు లోతైన గొయ్యి. యెహోవా శాపాన్ని మూటగట్టుకున్నవాడు దానిలో పడతాడు.
15పిల్లవాడి హృదయంలో మూఢత్వం సహజంగానే ఉంటుంది. బెత్తంతో విధించే శిక్ష దాన్ని వాడిలోనుండి తోలివేస్తుంది.
16తన ఆస్తిపాస్తులు పెంచుకోవాలని పేదలను పీడించే వారికి, ధనవంతులకే ఇచ్చే వాడికి నష్టమే కలుగుతుంది.
17శ్రద్ధగా జ్ఞానుల ఉపదేశం ఆలకించు. నేనిచ్చే తెలివిని పొందడానికి మనసు లగ్నం చెయ్యి.
18నీ అంతరంగంలో వాటిని నిలుపుకోవడం, అవన్నీ నీ పెదవులపై ఉండడం ఎంతో రమ్యం.
19నీవు యెహోవాను ఆశ్రయించేలా నీకు, అవును, నీకే గదా నేను ఈ రోజున వీటిని ఉపదేశించాను?
20వివేకం, విచక్షణ గల శ్రేష్ఠమైన సూక్తులు నేను నీకోసం రాయలేదా?
21నిన్ను పంపేవారికి నీవు యథార్థంగా జవాబులిచ్చేలా, నమ్మదగిన సత్యవాక్కులు నీకు నేర్పించ లేదా?
22పేదవాడు గదా అని పేదవాణ్ణి దోచుకోవద్దు. పట్టణ ద్వారాల దగ్గర నిస్సహాయులను నలగ గొట్టవద్దు.
23యెహోవా వారి పక్షంగా వాదిస్తాడు. వారిని దోచుకొనేవారి ప్రాణాలు ఆయన దోచుకుంటాడు.