15మంచి బుద్ధి కలిగి ఉంటే దయాగుణం అలవడుతుంది. నమ్మకద్రోహుల మార్గం కష్టాల కడలి.
16వివేకం గలవారు తెలివిగా తమ పనులు జరిగిస్తారు. బుద్ధిహీనులు తమ మూర్ఖత్వాన్ని బయటపెట్టుకుంటారు.
17దుర్మార్గుడైన ప్రతినిధి కష్టాల పాలవుతాడు. సమర్ధుడైన రాయబారి తన వారికి క్షేమం కలిగిస్తాడు.
18క్రమశిక్షణను లక్ష్యపెట్టని వాడికి అవమానం, దరిద్రం దాపురిస్తాయి. మందలింపును శిరసావహించేవాడు గౌరవం పొందుతాడు.
19కోరిక నెరవేరితే ప్రాణానికి ఊరట కలుగుతుంది. చెడుతనాన్ని విడిచి పెట్టడం మూర్ఖులకు ఏవగింపు.
20జ్ఞానులతో స్నేహం చేసే వారు జ్ఞానం సంపాదించుకుంటారు. మూర్ఖులతో స్నేహం చేసేవాడు నాశనమైపోతాడు.
21కీడు పాపులను వెంటాడుతుంది. నీతిమంతులకు ప్రతిఫలంగా మేలు కలుగుతుంది.
22న్యాయవంతుడు తన మనుమలకు ఆస్తి సమకూరుస్తాడు. పాపాత్ముల సంపాదన నీతిమంతుల వశం అవుతుంది.
23పేదవాళ్ళు సేద్యం చేసిన భూమి విస్తారంగా పండుతుంది. అక్రమ క్రియలు జరిగించిన వాళ్ళు నాశనమైపోతారు.
24బెత్తం వాడకుండా తన కుమారుణ్ణి క్రమశిక్షణలో పెట్టకుండా ఉన్న తండ్రి అతనికి శత్రువు వంటివాడు. ప్రేమించే తండ్రి తన కుమారుణ్ణి తప్పకుండా శిక్షిస్తాడు.