Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - యెహో - యెహో 7

యెహో 7:1-15

Help us?
Click on verse(s) to share them!
1శాపానికి గురైన దాన్ని నాశనం చేసే విషయంలో ఇశ్రాయేలీయులు అపనమ్మకంగా ప్రవర్తించారు. యూదాగోత్రంలో జెరహు మునిమనుమడు, జబ్ది మనుమడు, కర్మీ కుమారుడు, ఆకాను నాశనం చేయాల్సిన వస్తువుల్లో కొన్నిటిని సొంతానికి తీసుకున్నాడు. కాబట్టి యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపగించాడు.
2యెహోషువ “మీరు వెళ్లి దేశాన్ని వేగు చూడండి” అని చెప్పి బేతేలుకు తూర్పున బేతావెను దగ్గర ఉన్న హాయి అనే పట్టణానికి యెరికో నుండి గూఢచారులను పంపాడు.
3వారు వెళ్లి, హాయి పట్టణాన్ని వేగు చూసి యెహోషువ దగ్గరికి తిరిగి వచ్చి “ప్రజలందరినీ పంపించకు, రెండు మూడు వేలమంది వెళ్లి హాయిని పట్టుకోవచ్చు, అందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్లనక్కరలేదు, హాయి ప్రజలు కొద్దిమందే ఉన్నారు” అన్నారు.
4కాబట్టి సుమారు మూడు వేలమంది సైనికులు అక్కడికి వెళ్ళారు గాని వారు హాయి ప్రజల ముందు నిలవలేక పారిపోయారు.
5హాయి ప్రజలు వారిలో ముప్ఫై ఆరుగురిని చంపేశారు. అదీ కాకుండా వారి పట్టణ ద్వారం దగ్గర నుండి షేబారీము వరకూ తరిమి మోరాదులో వారిని చంపేశారు. కాబట్టి ఇశ్రాయేలీయుల గుండెలు కరిగి నీరైపోయాయి.
6యెహోషువ తన బట్టలు చింపుకున్నాడు. అతడూ ఇశ్రాయేలీయుల పెద్దలూ సాయంకాలం వరకూ యెహోవా మందసం ముందు నేలమీద ముఖాలు మోపి తలల మీద దుమ్మెత్తి పోసుకొంటూ
7“అయ్యో, ప్రభూ, యెహోవా, మమ్మల్ని నాశనం చేయడానికీ అమోరీయుల చేతికి అప్పగించడానికీ ఈ ప్రజలను యొర్దాను నదిని ఎందుకు దాటించావు? మేము యొర్దాను అవతల నివసించడమే మేలు కదా.
8ప్రభూ, కనికరించు, ఇశ్రాయేలీయులు తమ శత్రువులను ఎదుర్కోలేక వెన్ను చూపినందుకు నేనేమి చెప్పాలి?
9కనానీయులు, ఈ దేశ ప్రజలంతా ఇది విని, మమ్మల్ని చుట్టుముట్టి మా పేరు భూమి మీద ఉండకుండాా తుడిచి పెట్టేస్తారు. అప్పుడు ఘనమైన నీ నామం కోసం నువ్వు ఏం చేస్తావు” అని ప్రార్థించారు.
10అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా అన్నాడు “లే, ఎందుకు ఇక్కడ నేల మీద ముఖం మోపుకున్నావు?
11ఇశ్రాయేలీయులు పాపం చేశారు. నేను వారితో చేసిన నిబంధనను ఉల్లంఘించారు. శపితమైన దాన్ని కొంత దొంగిలించి, తమ సామానులో దాన్ని పెట్టుకున్నారు. ఆ పాపాన్ని కప్పిపుచ్చారు.
12కాబట్టి ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ముందు నిలవలేరు. వారు తమకు తామే నాశనానికి గురయ్యారు కాబట్టి తమ శత్రువులకు వెన్నుచూపించారు. శాపగ్రస్తమైన వాటిని మీ మధ్య ఉండకుండాా నిర్మూలం చేస్తే తప్ప నేను మీతో ఉండను.
13నీవు వెళ్లి వారితో ఇలా చెప్పు, ‘రేపు ఉదయం మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా చెప్పేదేమంటే, ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైనదొకటి ఉంది, మీరు దాన్ని మీ మధ్య ఉండకుండా నిర్మూలం చేసేవరకూ మీ శత్రువుల ముందు మీరు నిలబడలేరు.’
14ఉదయాన యెహోవా సూచించిన ప్రకారం మీ గోత్రాలు, వంశాలు, కుటుంబాల వారీగా పురుషులు ఒక్కొక్కరు వరుసగా యెహోవా దగ్గరికి రావాలి.
15అప్పుడు శాపానికి గురైనది ఎవరి దగ్గర దొరుకుతుందో అతన్నీ అతని వాళ్ళందరినీ అగ్నితో కాల్చివేయాలి. ఎందుకంటే అతడు యెహోవా నిబంధన మీరి ఇశ్రాయేలులో దుష్కార్యం చేశాడు” అని చెప్పాడు.

Read యెహో 7యెహో 7
Compare యెహో 7:1-15యెహో 7:1-15