Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - యెహో - యెహో 22

యెహో 22:11-27

Help us?
Click on verse(s) to share them!
11అప్పుడు రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థగోత్రపు వారు ఇశ్రాయేలీయుల సరిహద్దు దగ్గర యొర్దాను ప్రదేశంలో కనాను ప్రాంతం ఎదురుగా బలిపీఠం కట్టారని ఇశ్రాయేలీయులకు సమాచారం వచ్చింది.
12ఇశ్రాయేలీయులు ఆ మాట విన్నప్పుడు సమాజమంతా వారితో యుధ్ధం చేయడానికి షిలోహులో పోగయ్యారు.
13ఇశ్రాయేలీయులు గిలాదులో ఉన్న రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థ గోత్రపువారి దగ్గరికి యాజకుడు ఎలియాజరు కుమారుడు ఫీనెహాసును పంపించారు.
14అతనితో ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటిలో ప్రతిదానికీ ఒకరి చొప్పున పదిమంది ప్రముఖులను పంపించారు. వారంతా ఇశ్రాయేలీయులకు ప్రతినిధులు, తమ పూర్వీకుల కుటుంబాలకు నాయకులు.
15వారు గిలాదు ప్రాంతంలో ఉన్న రూబేను, గాదు, మనష్షే అర్థ గోత్రం వారితో ఇలా అన్నారు,
16“యెహోవా సర్వసమాజం వారు ఇలా అంటున్నారు, ‘ఈ రోజు యెహోవాను అనుసరించడం మాని, మీ కోసం బలిపీఠం కట్టుకుని ఇశ్రాయేలీయుల దేవుని మీద మీరెందుకు తిరుగుబాటు చేస్తున్నారు?
17పెయోరు పర్వతంలో మనం చేసిన దోషం మనకు సరిపోదా? దానివల్ల యెహోవా సమాజంలో తెగులు పుట్టింది. ఇంకా మనం దానినుండి శుద్ధులం కాలేదు.
18ఈ రోజు మీరు కూడా యెహోవాను అనుసరించడం మానివేస్తారా? మీరు కూడా ఈ రోజు యెహోవా మీద తిరుగుబాటు చేస్తే రేపు ఆయన ఇశ్రాయేలు సమాజమంతటి మీదా కోపిస్తాడు.
19మీ స్వాధీనమైన ప్రదేశం అపవిత్రమైనది అయితే యెహోవా ప్రత్యక్షపు గుడారం ఉండే ప్రదేశానికి వచ్చి మా మధ్య స్వాస్థ్యం తీసుకోండి. మన దేవుడైన యెహోవా బలిపీఠం గాక వేరొక బలిపీఠం కట్టి యెహోవా మీదా, మామీదా తిరగబడవద్దు.
20జెరహు కుమారుడు ఆకాను ప్రతిష్ఠితమైన దానివిషయంలో ద్రోహం చేసినందు వలన ఇశ్రాయేలీయుల సమాజమంతటి మీదికి ఉగ్రత రాలేదా? తన దోషానికి అతడొక్కడే నాశనం కాలేదు కదా.’”
21అప్పుడు రూబేను, గాదు, మనష్షే అర్థగోత్రం వారు ఇశ్రాయేలీయుల కుటుంబాల నాయకులకు ఇలా జవాబిచ్చారు,
22“యెహోవాయే గొప్ప దేవుడు! యెహోవాయే గొప్ప దేవుడు! ఆ సంగతి ఆయనకు తెలుసు, ఇశ్రాయేలీయులు కూడా తెలుసుకోవాలి. ద్రోహం చేతగానీ యెహోవా మీద తిరుగుబాటు చేతగానీ మేము ఈ పని చేసి ఉంటే ఈ రోజున మమ్మల్ని బతకనివ్వవద్దు.
23యెహోవాను అనుసరించకుండా దహనబలి గానీ నైవేద్యం గానీ సమాధాన బలులు గానీ దానిమీద అర్పించడానికి మేము ఈ బలిపీఠాన్ని కట్టి ఉంటే యెహోవాయే మమ్మల్ని శిక్షిస్తాడు గాక!
24రాబోయే కాలంలో మీ పిల్లలు మా పిల్లలతో, ‘ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాతో మీకేమి సంబంధం?
25మీకు మాకు మధ్య యెహోవా యొర్దాను నదిని సరిహద్దుగా చేశాడు. రూబేనీయులారా, గాదీయులారా, మీకు యెహోవాతో సంబంధం లేదు’ అంటారేమో అని భయపడి మేమిలా చేశాం. మీ పిల్లలు మా పిల్లలను యెహోవాను సేవించకుండా చేస్తారేమో.
26కాబట్టి మేము, ‘మనం బలిపీఠం కట్టుకుందాం. అది దహనబలులకూ మరి ఎలాటి బలులకూ కాదు.
27మన దహనబలులూ బలులతో సమాధాన బలులతో మనం యెహోవాకు సేవచేయాలనీ, యెహోవా దగ్గర మీకు పాలు ఏదీ లేదు అనే మాట మీ పిల్లలు మా పిల్లలతో ఎన్నడూ చెప్పకుండా అది మాకు మీకు, మన తరవాతి తరాల వారి మధ్య సాక్షిగా ఉంటుంది’ అనుకున్నాము.”

Read యెహో 22యెహో 22
Compare యెహో 22:11-27యెహో 22:11-27