1నీతిమంతులు, జ్ఞానులు, వారు చేసే పనులు అన్నీ పరిశీలించి చూసి అవన్నీ దేవుని చేతిలో ఉన్నాయని నేను గ్రహించాను. ప్రేమించడం, ద్వేషించడం అనేవి మనుషుల చేతిలో లేవని, అది వారి వలన కాదనీ నేను తెలుసుకున్నాను.
2జరిగేవి అన్నీ, అందరికీ ఒకే విధంగా జరుగుతాయి. నీతిమంతులకు, దుష్టులకు, మంచివారికి, చెడ్డవారికి, పవిత్రులకు, అపవిత్రులకు, బలులర్పించే వారికి, అర్పించని వారికి, అందరికీ ఒకే విధంగా జరుగుతుంది. మంచివారికెలాగో దుర్మార్గులకూ అలాగే జరుగుతుంది. ఒట్టు పెట్టుకొనేవాడు ఎలా చనిపోతున్నాడో ఒట్టు పెట్టుకోడానికి భయపడేవాడూ అలాగే చనిపోతున్నాడు.
3అందరికీ ఒకే విధంగా జరగడం అనేది సూర్యుని కింద జరిగే వాటన్నిటిలో బహు దుఃఖకరం. మనుషుల హృదయం చెడుతనంతో నిండిపోయింది. వారు బతికినంత కాలం వారి హృదయంలో మూర్ఖత్వం ఉంటుంది. ఆ తరువాత వారు చనిపోతారు. ఇది కూడా దుఃఖకరం.
4చచ్చిన సింహం కంటే బతికి ఉన్న కుక్క మేలు అన్నట్టు జీవించి ఉన్నవారితో కలిసి మెలిసి ఉండే వారికి ఇంకా ఆశ ఉంటుంది.
5బతికి ఉన్న వారికి తాము చనిపోతామని తెలుసు. అదే చనిపోయిన వారికి ఏమీ తెలియదు. వారిని అందరూ మరచిపోయారు. వారికి ఇక లాభం ఏమీ లేదు.