2నాలుగవ భాగం (యువతి మాట్లాడుతూ ఉంది) నేను నిద్ర పోయాను గానీ నా మనస్సు కల కంటోంది. నా ప్రియుడు తలుపు తడుతూ పిలుస్తున్న శబ్దం “నా సోదరీ, ప్రియతమా, నా పావురమా, నిష్కళంకితా, తలుపు తియ్యి. నా తల మంచుకు తడిసింది. నా జుట్టు రాత్రి మంచుకు తడిసింది.”
3(యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది.) నేను బట్టలు తీసేశాను. మళ్ళీ వాటిని వేసుకోవాలా? కాళ్ళు కడుక్కున్నాను. మళ్ళీ మురికి చేసుకోవాలా?
4తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి పెట్టగానే నా గుండె అతని కోసం కొట్టుకుంది.
5నా ప్రియుడి కోసం తలుపు తీయడానికి నేను లేచాను. నా చేతుల నుంచి బోళం కారుతూ ఉంది. నా వేళ్ళకున్న బోళం తడి తలుపు గడియపై కారింది.
6నా ప్రియునికి తలుపు తీశాను. కానీ అతడు వెళ్లిపోయాడు. నేను కుంగిపోయాను. నీరుగారిపోయాను. నేనతని కోసం వెతికినా కనబడలేదు. నేనతన్ని పిలిచినా అతడు పలకలేదు.
7పట్టణంలో గస్తీ తిరిగేవారు నాకు ఎదురుపడ్డారు. వాళ్ళు నన్ను కొట్టి గాయపర్చారు. ప్రాకారం మీద ఉన్న కావలివారు నా పైట చెంగు లాగేసుకున్నారు.