Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - 2 తెస్సలోనిక పత్రిక

2 తెస్సలోనిక పత్రిక 3

Help us?
Click on verse(s) to share them!
1ఇక ఇతర విషయాలకు వస్తే సోదరులారా, మీ మధ్య జరుగుతూ ఉన్నట్టే ప్రభువు వాక్కు వేగంగా వ్యాపించి ఘనత పొందేలా,
2మేము దుష్టుల, దుర్మార్గుల బారి నుండి తప్పించుకునేలా మా కోసం ప్రార్థించండి. ఎందుకంటే విశ్వాసం అందరికీ లేదు.
3అయితే ప్రభువు నమ్మదగినవాడు. ఆయన మిమ్మల్ని స్థిరపరచి దుష్టుడి నుండి కాపాడతాడు.
4మేము మీకు ఆదేశించిన వాటిని మీరు చేస్తున్నారనీ ఇక ముందు కూడా చేస్తారనీ మీ విషయమై ప్రభువులో నమ్మకం మాకుంది.
5దేవుని ప్రేమా క్రీస్తు సహనమూ మీకు కలిగేలా ప్రభువు మీ హృదయాలను నడిపిస్తాడు గాక!
6సాటి విశ్వాసులారా, మేము ఉపదేశించిన సత్యాల ప్రకారం చేయకుండా సోమరులుగా బ్రతుకుతున్న వారి నుండి తొలగి పోవాలని మన ప్రభు యేసు క్రీస్తు పేర మీకు ఆదేశిస్తున్నాం.
7మా ఆదర్శాన్ని అనుసరించి ఎలా నడుచుకోవాలో మీకు తెలుసు. మేము మీ మధ్య సోమరులుగా ప్రవర్తించలేదు.
8ఎవరి దగ్గరా ఉచితంగా ఆహారం భుజించలేదు. మేము మీలో ఎవరికీ భారంగా ఉండరాదని రాత్రింబగళ్ళు ప్రయాసపడ్డాం, కష్టపడి పని చేశాం.
9మీరు మమ్మల్ని అనుకరించడం కోసం, ఆదర్శంగా ఉండాలనే ఇలా చేశాం కానీ మాకు మీ దగ్గర హక్కు లేదని కాదు.
10అలాగే మేము మీ దగ్గర ఉన్నప్పుడు, “పని చేయకుండా ఎవడూ భోజనం చేయకూడదు” అని ఆజ్ఞాపించాం కదా!
11మీలో కొంతమంది ఏ పనీ చేయకుండా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటూ సోమరుల్లా తిరుగుతున్నారని మేము వింటున్నాం.
12అలాంటి వారు ప్రశాంతంగా పని చేసుకుంటూ సొంతంగా సంపాదించుకున్న ఆహారాన్ని భుజించాలని మన ప్రభు యేసు క్రీస్తు పేర వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరిస్తున్నాం.
13సోదరులారా, మీరైతే యోగ్యమైన పనులు చేయడంలో నిరుత్సాహపడవద్దు.
14ఈ పత్రికలో మేము చెప్పిన ఆదేశాలకు ఎవరైనా లోబడకపోతే వాణ్ణి కనిపెట్టి ఉండండి. అతనికి సిగ్గు కలిగేలా అతనితో కలిసి ఉండవద్దు.
15అయితే అతణ్ణి శత్రువుగా భావించకండి. సోదరుడిగా భావించి బుద్ధి చెప్పండి.
16శాంతి ప్రదాత అయిన ప్రభువు తానే ఎప్పుడూ అన్ని పరిస్థితుల్లో, అన్ని విధాలా మీకు శాంతిని అనుగ్రహించు గాక! ప్రభువు మీకందరికీ తోడై ఉండు గాక!
17నేను పౌలును, నా చేతి రాతతో మీకు అభివందనం రాస్తున్నాను. నేను రాసే ప్రతి పత్రికలోనూ ఇలాగే రాస్తాను.
18మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకందరికీ తోడై ఉండు గాక!