Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - 1 పేతురు పత్రిక

1 పేతురు పత్రిక 2

Help us?
Click on verse(s) to share them!
1ప్రభువు దయగల వాడని మీరు రుచి చూశారు కాబట్టి
2అన్ని రకాల దుష్టత్వం, మోసం, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మానండి.
3కొత్తగా పుట్టిన బిడ్డల్లా, స్వచ్ఛమైన ఆత్మ సంబంధమైన పాలను ఆశించండి. దాని ద్వారా మీరు రక్షణలో ఎదుగుతారు.
4మనుషులు తిరస్కరించినా, దేవుడు ఎన్నుకున్నదీ విలువైనదీ, సజీవమైన రాయి అయిన ప్రభువు దగ్గరికి రండి.
5ఆధ్యాత్మిక గృహంగా కట్టడానికి వాడే సజీవమైన రాళ్ల లాగా మీరున్నారు. దాని వలన, యేసు క్రీస్తు ద్వారా దేవునికి అంగీకారమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి పరిశుద్ధ యాజకులుగా ఉండగలరు.
6ఎందుకంటే లేఖనంలో ఇలా రాసి ఉంది, “నేను సీయోనులో మూల రాయి వేస్తున్నాను. అది విలువైనదీ ఎన్నిక అయినదీ ప్రాముఖ్యమైనదీ. ఆయనను నమ్మేవారెవరూ సిగ్గు పడరు.”
7కాబట్టి విశ్వసిస్తున్న మీకు ఇది గౌరవప్రదమైనది. అయితే విశ్వసించని వారికి, “ఇల్లు కట్టే వారు నిరాకరించిన రాయి, మూలకు తలరాయి అయింది.”
8అది “అడ్డురాయి, అడ్డుబండ” అయింది. వారు వాక్యానికి అవిధేయులై తొట్రుపడుతున్నారు. దాని కోసమే దేవుడు వారిని నియమించాడు.
9చీకటిలో నుంచి అద్భుతమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన ఆయన ఉత్తమ గుణాలను మీరు ప్రకటించాలి. అందుకోసం మీరు ఎన్నికైన వంశంగా రాచరిక యాజక బృందంగా, పరిశుద్ధ జనాంగంగా, దేవుని ఆస్తి అయిన ప్రజగా ఉన్నారు.
10ఒకప్పుడు మీరు ప్రజ కాదు. కానీ ఇప్పుడు దేవుని ప్రజ. పూర్వం మీరు కనికరానికి నోచుకోలేదు. అయితే ఇప్పుడు కనికరం పొందారు.
11ప్రియులారా, మీరీ లోకంలో పరదేశులుగా, బాటసారులుగా ఉన్నారు. కాబట్టి మీ ఆత్మకు విరోధంగా పోరాటం చేసే శరీర దురాశలు విసర్జించాలని వేడుకుంటున్నాను.
12యూదేతరులు మిమ్మల్ని దుర్మార్గులని దూషిస్తూ ఉంటే, వారు మీ మంచి పనులు చూసి, దేవుడు దర్శించే రోజున ఆయనను మహిమ పరచేలా, వారి మధ్య మీ మంచి ప్రవర్తన చూపించండి.
13ప్రతి మానవ అధికారానికీ ప్రభువును బట్టి లోబడి ఉండండి.
14రాజు అందరికీ అధిపతి అనీ, అధికారులు దుర్మార్గులను శిక్షించడానికీ, మంచి వారిని మెచ్చుకోడానికీ ఆయన పంపిన వారనీ వారికి లోబడి ఉండండి.
15ఎందుకంటే మీరు ఈ విధంగా మంచి చేస్తూ తెలివి తక్కువగా మాట్లాడే బుద్ధిహీనుల నోరు మూయించడం దేవుని చిత్తం.
16స్వేచ్ఛ పొందిన వారుగా దుర్మార్గాన్ని కప్పి పెట్టడానికి మీ స్వేచ్ఛను వినియోగించక, దేవుని సేవకులుగా ఉండండి.
17అందరినీ గౌరవించండి. తోటి సోదరులను ప్రేమించండి, దేవునికి భయపడండి, రాజును గౌరవించండి.
18సేవకులారా, మంచివాళ్ళూ సాత్వికులయిన యజమానులకు మాత్రమే కాక వక్ర బుద్ధి గల వారికి కూడా పూర్తి మర్యాదతో లోబడి ఉండండి.

19ఎవరయినా దేవుని గురించిన మనస్సాక్షిని బట్టి అన్యాయాన్ని అనుభవిస్తూ బాధ సహిస్తుంటే అది గొప్ప విషయం.
20మీరు పాపం చేసి శిక్ష అనుభవిస్తూ సహిస్తుంటే అదేమి గొప్ప? మేలు చేసి బాధలకు గురి అయి సహిస్తుంటే అది దేవుని దృష్టిలో మెచ్చుకోదగినది.
21దీనికోసమే దేవుడు మిమ్మల్ని పిలిచాడు. క్రీస్తు కూడా మీకోసం బాధపడి, మీరు తన అడుగు జాడల్లో నడవాలని మీకు ఆదర్శాన్ని ఉంచి వెళ్ళి పోయాడు.
22ఆయన ఎలాంటి పాపం చేయలేదు. ఆయన నోటిలో ఎలాంటి కపటమూ కనబడలేదు.
23ఆయనను దూషించినా తిరిగి దూషించ లేదు. ఆయన బాధపడినా తిరిగి బెదిరింపక, న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు.
24మనకు పాపాల్లో ఇక ఎలాంటి భాగమూ ఉండకుండాా నీతి కోసం బతకడానికి స్వయంగా ఆయనే తన దేహంలో మన పాపాలను మాను మీద భరించాడు. ఆయన పొందిన గాయాల వలన మీరు బాగుపడ్డారు.
25మీరు తప్పిపోయిన గొర్రెల్లాగా తిరుగుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు మీ కాపరి, మీ ఆత్మల సంరక్షకుని దగ్గరికి తిరిగి వచ్చారు.