Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - 1 తిమోతి పత్రిక

1 తిమోతి పత్రిక 2

Help us?
Click on verse(s) to share them!
1మనం సంపూర్ణ భక్తి, గౌరవాలతో, ప్రశాంతంగా, సుఖంగా బతకడానికై, మనుషులందరి కోసం,
2రాజుల కోసం, అధికారంలో ఉన్న వారందరి కోసం, విన్నపాలూ ప్రార్థనలు, ఇతరుల కోసం విన్నపాలు చేస్తూ కృతజ్ఞతలు చెల్లించాలని అన్నిటికంటే ముఖ్యంగా కోరుతున్నాను.
3ఇది మన రక్షకుడైన దేవుని దృష్టిలో మంచిది, సమ్మతమైనది.
4మానవులంతా రక్షణ పొంది సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు.
5దేవుడొక్కడే, దేవునికీ మనిషికీ మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు అనే మానవుడు.
6ఈయన అందరి కోసం విమోచన వెలగా తనను తానే సమర్పించుకున్నాడు. సరైన సమయంలో దేవుడు దీన్ని ధృవీకరించాడు.
7దీన్ని గూర్చి ప్రకటించేవానిగా అపొస్తలునిగా దేవుడు నన్ను నియమించాడు. నిజం చెబుతున్నాను. అబద్ధమాడడం లేదు. నేను యూదులు కాని వారికి విశ్వాస సత్యాలను బోధించేవాణ్ణి.
8అందుచేత అన్ని స్థలాల్లోనూ పురుషులు ఆగ్రహం, తర్కవితర్కాలు లేకుండా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని కోరుతున్నాను.
9అలాగే స్త్రీలు కూడా నిరాడంబరమైన, సక్రమమైన వస్త్రాలు ధరించుకోవాలి గానీ జడలతో బంగారంతో ముత్యాలతో చాలా ఖరీదైన వస్త్రాలతో కాకుండా
10భక్తిపరులమని చెప్పుకొనే స్త్రీలకు తగినట్టుగా మంచి పనులతో తమను తాము అలంకరించుకోవాలి.
11స్త్రీలు మౌనంగా ఉండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి.
12ఉపదేశించడానికీ, పురుషుని మీద అధికారం చేయడానికీ స్త్రీకి అనుమతినివ్వను. స్త్రీ మౌనంగా ఉండవలసిందే.
13ఎందుకంటే దేవుడు మొదట ఆదామును తరువాత హవ్వను గదా సృష్టించాడు?
14ఆదాము మోసపోలేదు, స్త్రీయే మోసపోయి అపరాధి అయింది.
15అయినా స్త్రీలు వివేకవతులై, విశ్వాసం, ప్రేమ, పరిశుద్ధతల్లో నిలకడగా ఉంటే ప్రసవం ద్వారా దేవుడు వారిని కాపాడతాడు.