Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - హెబ్రీ పత్రిక

హెబ్రీ పత్రిక 11

Help us?
Click on verse(s) to share them!
1విశ్వాసం అంటే ఒక వ్యక్తి నమ్మకంగా ఎదురు చూసే వాటిని గూర్చిన నిశ్చయత. కంటికి కనిపించని వాటి ఉనికి గూర్చిన నమ్మకం.
2మన పూర్వీకులు తమ విశ్వాసాన్ని బట్టి దేవుని ఆమోదం పొందారు.
3విశ్వం దేవుని వాక్కు మూలంగా కలిగిందని విశ్వాసం ద్వారానే అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి కనిపించే వాటి సృష్టి కనిపించే వాటి వల్ల జరగలేదని విశ్వాసం చేతనే అర్థం చేసుకుంటున్నాం.
4విశ్వాసం ద్వారా హేబెలు కయీను కంటే శ్రేష్ఠమైన బలిని దేవునికి అర్పించాడు. దీని వల్లనే అతణ్ణి నీతిమంతుడని పొగడడం జరిగింది. అతడు తెచ్చిన కానుకలను బట్టి దేవుడతణ్ణి మెచ్చుకున్నాడు. దాని వల్ల హేబెలు చనిపోయినా ఇప్పటికీ మాట్లాడుతున్నాడు.
5విశ్వాసాన్ని బట్టి దేవుడు హనోకును మరణం చూడకుండా తీసుకు వెళ్ళాడు. “దేవుడు తీసుకువెళ్ళాడు కనుక అతడు కనిపించలేదు.” దేవుడు తీసుకువెళ్ళక ముందు అతడు దేవుణ్ణి సంతోషపెట్టాడని అతని గురించి చెప్పారు.
6విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపెట్టడం అసాధ్యం. ఎందుకంటే దేవుని దగ్గరికి వచ్చేవారు ఆయన ఉన్నాడనీ, తనను వెదికే వారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడనీ నమ్మాలి.
7విశ్వాసాన్ని బట్టి నోవహు అప్పటివరకూ తాను చూడని సంగతులను గూర్చి దేవుడు హెచ్చరించినప్పుడు దేవుని పట్ల పూజ్య భావంతో తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఓడను నిర్మించాడు. ఇలా చేయడం ద్వారా నోవహు లోకంపై నేరం మోపాడు. విశ్వాసం ద్వారా వచ్చే నీతికి వారసుడయ్యాడు.
8దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు అతడు విశ్వాసాన్ని బట్టి ఆ పిలుపుకు విధేయత చూపాడు. తాను వారసత్వంగా పొందబోయే స్థలానికి ప్రయాణమై వెళ్ళాడు. తాను ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే ప్రయాణం అయ్యాడు.
9విశ్వాసాన్ని బట్టి అతడు వాగ్దాన భూమిలో పరదేశిగా నివసించాడు. అతడు తనతోబాటు అదే వాగ్దానానికి వారసులైన ఇస్సాకు, యాకోబు అనే వారితో గుడారాల్లో నివసించాడు.
10ఎందుకంటే ఏ పట్టణానికి, దేవుడే రూప శిల్పిగా నిర్మాణకుడుగా ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కోసం అబ్రాహాము ఎదురు చూస్తూ ఉన్నాడు.
11విశ్వాసాన్ని బట్టి అబ్రాహామూ, శారా ఎంతో వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తమకు కుమారుడు కలుగుతాడని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని భావించారు కనుక శారా గర్భం ధరించడానికి శక్తి పొందింది.
12అందుచేత చావుకు దగ్గరైన ఈ వ్యక్తి నుండి లెక్క లేనంత మంది వారసులు పుట్టుకొచ్చారు. వారు ఆకాశంలో నక్షత్రాల్లాగా సముద్ర తీరంలో ఇసుక రేణువుల్లాగా విస్తరించారు.
13వీరంతా వాగ్దానాలు పొందకుండానే విశ్వాసంలో చనిపోయారు. కానీ దూరం నుండి వాటిని వీళ్ళు చూశారు. వాటికి స్వాగతం పలికారు. ఈ భూమి మీద తాము పరదేశులమనీ, అపరిచితులమనీ ఒప్పుకున్నారు.
14ఇలాంటి విషయాలు చెబుతున్న వారు తాము తమ స్వదేశాన్ని వెదుకుతున్నామని స్పష్టం చేస్తున్నారు.
15ఒకవేళ వారు తాము విడిచి వచ్చిన దేశాన్ని గూర్చి ఆలోచిస్తున్నట్టయితే తిరిగి ఆ దేశానికే వెళ్ళడానికి వారికి అవకాశం ఉంది.
16కానీ వారు మరింత శ్రేష్ఠమైన దేశాన్ని అంటే పరలోక సంబంధమైన దేశాన్ని కోరుకుంటున్నారు. వారి కోసం ఒక నగరాన్ని సిద్ధం చేసిన దేవుడు, తాను వారి దేవుడినని చెప్పుకోడానికి సిగ్గు పడడు.
17విశ్వాసాన్ని బట్టి అబ్రాహాము తీవ్ర పరీక్ష ఎదుర్కొని ఇస్సాకును బలిగా అర్పించటానికి సిద్ధం అయ్యాడు.
18“ఇస్సాకు నుండే నీకు వారసులు వస్తారు” అని ఈ ఇస్సాకును గూర్చి దేవుడు చెప్పాడు.

19దేవుడు ఇస్సాకును చనిపోయిన వారిలో నుండి లేపగలిగే సమర్ధుడని అబ్రాహాము భావించాడు. అలంకారికంగా చెప్పాలంటే చనిపోయిన వాణ్ణి తిరిగి పొందాడు.
20విశ్వాసాన్ని బట్టి ఇస్సాకు భవిష్యత్తులో జరగబోయే సంగతుల విషయమై యాకోబునూ, ఏశావునూ ఆశీర్వదించాడు.
21విశ్వాసాన్ని బట్టి యాకోబు తాను చనిపోయే ముందు యోసేపు ఇద్దరు కుమారులను ఒక్కొక్కరుగా ఆశీర్వదించాడు. యాకోబు తన చేతికర్ర పైన ఆనుకుని దేవుణ్ణి ఆరాధించాడు.
22విశ్వాసాన్ని బట్టి యోసేపు తన అంతిమ సమయంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి స్వదేశానికి ప్రయాణం కావాల్సిన విషయం గూర్చి మాట్లాడాడు. తన ఎముకలను వారితో తీసుకువెళ్ళాలని ఆజ్ఞాపించాడు.
23విశ్వాసాన్ని బట్టి మోషే తల్లిదండ్రులు అతడు పుట్టినప్పుడు ఆ పసివాడు అందంగా ఉండడం చూసి అతణ్ణి మూడు నెలలు దాచి పెట్టారు. రాజు ఆదేశాలకు వారు భయపడలేదు.
24విశ్వాసాన్ని బట్టి మోషే పెద్దవాడయ్యాక ఫరో కుమార్తెకు కొడుకును అనిపించుకోడానికి నిరాకరించాడు.
25కొద్ది కాలం పాపంలోని సుఖాలు అనుభవించడానికి బదులు దేవుని ప్రజలతో హింసలు అనుభవించడం మంచిదని తలంచాడు.
26ఐగుప్తులోని సంపదల కంటే క్రీస్తును అనుసరించడం వల్ల కలిగే అవమానంలో గొప్ప ఐశ్వర్యం ఉందని భావించాడు. ఎందుకంటే తన దృష్టిని భవిష్యత్తులో కలగబోయే బహుమానంపై ఉంచాడు.
27విశ్వాసాన్ని బట్టి మోషే ఐగుప్తును విడిచి పెట్టాడు. కంటికి కనిపించని దేవుణ్ణి చూస్తూ సహించాడు కనుక అతడు రాజు ఆగ్రహానికి జడియలేదు.
28విశ్వాసాన్ని బట్టి అతడు పస్కా, రక్త ప్రోక్షణ ఆచరించాడు. దానివలన ప్రథమ సంతానాన్ని హతమార్చడానికి బయల్దేరిన వినాశకుడు ఇశ్రాయేలీయుల ప్రథమ సంతానాన్ని ముట్టుకోలేదు.
29విశ్వాసాన్ని బట్టి పొడినేల మీద నడిచినట్టుగా వారు ఎర్ర సముద్రంలో నడిచి వెళ్ళారు. ఐగుప్తీయులు కూడా అలాగే వెళ్ళాలని చూశారు గానీ సముద్రం వారిని మింగివేసింది.
30విశ్వాసాన్ని బట్టి ఏడు రోజులు యెరికో గోడల చుట్టూ తిరిగాక అవి కూలిపోయాయి.
31విశ్వాసాన్ని బట్టి రాహాబు అనే వేశ్య గూఢచారులకు ఆశ్రయం ఇచ్చి కాపాడింది కనుక అవిధేయులతో బాటు నశించలేదు.
32ఇంకా ఏమి చెప్పను? గిద్యోను, బారాకు, సమ్సోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అనే వారిని గురించి, ఇంకా ప్రవక్తలను గురించి చెప్పాలంటే సమయం చాలదు.
33విశ్వాసం ద్వారా వీళ్ళు రాజ్యాలు స్వాధీనం చేసుకున్నారు, న్యాయాన్ని జరిగించారు, వాగ్దానాలు పొందారు. సింహాల నోళ్ళు మూయించారు.
34అగ్నికున్న బలాన్ని చల్లార్చారు. కత్తి పోటులను తప్పించుకున్నారు. వ్యాధుల్లో స్వస్థత పొందారు. యుద్ధ సమయంలో బలవంతులయ్యారు. విదేశీ సైన్యాలను తరిమి కొట్టారు.
35స్త్రీలు చనిపోయిన తమ వారిని బతికించుకున్నారు. ఇతరులు చిత్రహింసలు అనుభవించారు. వీళ్ళు మరింత మెరుగైన పునరుజ్జీవం కోసం విడుదల కావాలని కోరుకోలేదు.
36ఇంకా కొందరు వెక్కిరింతలనూ, కొరడా దెబ్బలనూ సహించారు. నిజమే, సంకెళ్లనూ ఖైదునూ సైతం సహించారు.

37వీళ్ళను రాళ్ళతో కొట్టారు, రంపాలతో కోశారు. కత్తులతో చంపారు. వీళ్ళు గొర్రెల, మేకల చర్మాలు కట్టుకుని తిరిగారు. అనాథల్లాగా వేదన పడ్డవారుగా ఉన్నారు. అవమానాలకు గురి అయ్యారు.
38అడవుల్లో పర్వతాల పైనా గుహల్లో భూమి కింద సొరంగాల్లో తిరుగుతూ ఉన్నారు. వీళ్ళకి ఈ లోకం యోగ్యమైనది కాదు.
39వీళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవుడు వీళ్ళందరినీ స్వీకరించాడు. కానీ ఆయన వాగ్దానం చేసింది వారు పొందలేదు.
40మనం లేకుండా వారు పరిపూర్ణులు కాకుండా దేవుడు మనకోసం మరింత మెరుగైన దాన్ని ముందే సిద్ధం చేశాడు.