Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - లేవీ - లేవీ 7

లేవీ 7:20-38

Help us?
Click on verse(s) to share them!
20యెహోవాకు అర్పించే శాంతిబలి పశువు మాంసాన్ని ఎవరైనా అపవిత్రుడిగా ఉండి కొంచెం తిన్నా అలాంటి వాడు ప్రజల్లో లేకుండా పోవాలి.
21మనుష్యుల అపవిత్రతనైనా, ఏదన్నా జంతువు అపవిత్రతనైనా, లేదా అపవిత్రమైన, అసహ్యకరమైన వస్తువునైనా తాకి దాని తరువాత ఎవరైనా యెహోవాకి అర్పించే శాంతిబలి పశువు మాంసం తింటే అలాంటి వాడు ప్రజల్లో లేకుండా పోవాలి.”
22ఇంకా యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పాడు.
23“నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు ఇలా చెప్పు, ఎద్దు కొవ్వును గానీ, గొర్రె కొవ్వును గానీ, మేక కొవ్వును గానీ మీరు తిన కూడదు.
24అర్పణం కాకుండా సాధారణంగా చనిపోయిన పశువు కొవ్వునూ, అడవి మృగాలు చీల్చి వేసిన పశువు కొవ్వునూ ఇతర విషయాలకు ఉపయోగించవచ్చు గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు.
25యెహోవాకి దహనబలిగా ప్రజలు అర్పించే పశువుల కొవ్వుని తినేవాడు ప్రజల్లో లేకుండా పోవాలి.
26అలాగే పక్షి రక్తం గానీ, జంతువు రక్తం గానీ మీ ఇళ్ళల్లో తినకూడదు.
27ఎవడు రక్తాన్ని తింటాడో వాడు ప్రజల్లో లేకుండా పోవాలి.”
28ఇంకా యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పాడు.
29“నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు ఇలా చెప్పు, యెహోవాకి శాంతిబలి పశువును అర్పించే వాడు దానిలో ఒక భాగాన్ని ప్రత్యేకంగా యెహోవా సమక్షంలోకి తీసుకురావాలి.
30యెహోవాకు దహనబలిగా అర్పించే వాటిని అతడు స్వయంగా తీసుకు రావాలి. అతడు రొమ్ము భాగాన్నీ, దానితో ఉన్న కొవ్వునీ తీసుకురావాలి. యెహోవా సమక్షంలో అర్పణగా పైకెత్తి కదిలించడానికి రొమ్ము భాగాన్ని తీసుకుని రావాలి.
31యాజకుడు బలిపీఠం పైన ఆ కొవ్వుని దహించాలి. కానీ రొమ్ము భాగం అహరోనుకీ అతని వారసులకీ చెందుతుంది.
32శాంతిబలి పశువుల కుడి తొడ భాగాన్ని యాజకుడికి ఇవ్వాలి.
33అహరోను వారసుల్లో శాంతిబలి పశువు రక్తాన్నీ, కొవ్వునూ అర్పించే యాజకుడికి ఆ పశువు కుడి తొడ భాగం చెందుతుంది.
34ఎందుకంటే నా ఎదుట పైకి లేపి కదిలించిన రొమ్ము భాగాన్నీ, తొడనూ నేను స్వీకరించాను. వాటిని నేను యాజకుడైన అహరోనుకీ, అతని వారసులకీ ఇచ్చాను. ఇశ్రాయేలు ప్రజలు అర్పించే శాంతి బలులన్నిటిలో ఇవి వారి వంతుగా ఉంటాయి. ఇది నా ప్రజలైన ఇశ్రాయేల్ వారు అనుసరించవలసిన శాశ్వత నియమం.
35ఇది యాజకులుగా యెహోవాకి సేవ చేయడానికి వీరిని మోషే నియమించిన రోజు నుండి అహరోనుకూ అతని వారసులకూ యెహోవాకు అర్పించే దహనబలుల్లో ఏర్పాటైన వాటా.
36వారిని యాజకులుగా యెహోవా అభిషేకం చేసిన రోజున వారికి ఇశ్రాయేలు ప్రజలు ఇవ్వాలని యెహోవా ఖాయం చేసిన వాటా. ఇది అన్ని తరాల్లో వారి వాటాగా ఉంటుంది.”
37ఇవి దహనబలిని గూర్చీ, అపరాధం కోసం చేసే బలిని గూర్చీ, నైవేద్య అర్పణ బలిని గూర్చీ, పాపం కోసం చేసే బలిని గూర్చీ, ప్రతిష్టార్పణ బలిని గూర్చీ, శాంతిబలిని గూర్చీ వివరించే చట్టం.
38ఈ ఆజ్ఞలను యెహోవా సీనాయి పర్వతం పైన మోషేకి ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకు సీనాయి అరణ్యంలో యెహోవాకు అర్పణలు చెల్లించాలని ఆదేశించాడు.

Read లేవీ 7లేవీ 7
Compare లేవీ 7:20-38లేవీ 7:20-38