34అప్పుడు ఆయన, “ఈ రోజు నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు బొంకిన తరువాతనే కోడి కూస్తుందని నీకు చెబుతున్నాను” అన్నాడు.
35ఇంకా ఆయన “నేను డబ్బు సంచీ, చెప్పులూ లేకుండా మిమ్మల్ని పంపినప్పుడు మీకేమన్నా తక్కువయిందా?” అని అడిగాడు. దానికి వారు, “ఏమీ తక్కువ కాలేదు” అన్నారు.
36ఆయన, “కానీ ఇప్పుడు సంచీ జోలే ఉన్నవాడు వాటిని తీసుకువెళ్ళాలి. కత్తి లేని వాడు తన పైబట్ట అమ్మి కత్తి కొనుక్కోవాలి.
37‘ఆయనను అక్రమాలు చేసేవారిలో ఒకడిగా ఎంచారు’ అని రాసి ఉన్న లేఖనం నా విషయంలో నెరవేరాలి. నన్ను గురించిన విషయాలన్నీ తప్పక నెరవేరతాయని మీతో చెబుతున్నాను” అన్నాడు.
38శిష్యులు, “ప్రభూ ఇక్కడ రెండు కత్తులున్నాయి” అన్నారు. ఆయన, “చాలు” అన్నాడు.
39భోజనం అయ్యాక ఆయన బయల్దేరి తన అలవాటు ప్రకారం ఒలీవ కొండకు వెళ్ళాడు. ఆయన శిష్యులు కూడా ఆయనతో వెళ్ళారు.
40వారు అక్కడికి చేరుకున్న తరువాత ఆయన వారితో, “మీరు విషమ పరీక్షలో పడకుండా ప్రార్థన చేయండి” అన్నాడు.