6అరి కాలు నుంచి తల వరకు పుండు పడని భాగం లేదు. ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, మానని పుళ్ళు. అవి నయం కాలేదు. వాటిని ఎవరూ కడగలేదు, కట్టు కట్టలేదు, నూనెతో చికిత్స చెయ్యలేదు.
7మీ దేశం పాడైపోయింది. మీ పట్టణాలు మంటల్లో కాలిపోయాయి. మీ కళ్ళముందే పరాయివారు మీ పంటలు దోచుకుంటున్నారు. తమ కంట పడినవన్నీ నాశనం చేస్తున్నారు.
8సీయోను కుమార్తె ద్రాక్షతోటలో ఒక గుడిసెలాగా, దోసపాదుల్లో ఒక పాకలాగా, ముట్టడి వేసిన పట్టణంలాగా మిగిలిపోయింది.
9జాతులకు ప్రభువైన యెహోవా కొంత శేషం మన కోసం ఉంచకపోతే, మనం సొదొమలాగా ఉండేవాళ్ళం. మనం గొమొర్రాతో సమానంగా ఉండేవాళ్ళం.
10సొదొమ పాలకులారా, యెహోవా మాట వినండి. గొమొర్రా ప్రజలారా, మన దేవుని ధర్మశాస్త్రం ఆలకించండి.
11“యెహోవా ఇలా అంటున్నాడు. విస్తారమైన మీ బలులు నాకెందుకు?” “దహనబలులుగా అర్పించిన పాట్టేళ్లు, బలిసిన దూడల కొవ్వు నాకు వెగటు పుట్టించాయి. దున్నపోతుల రక్తం, గొర్రె పిల్లల రక్తం, మేకపోతుల రక్తం అంటే నాకు ఇష్టం లేదు.
12మీరు నా సన్నిధిలో నన్ను కలుసుకోడానికి వస్తున్నప్పుడు, నా ప్రాంగణాలు తొక్కమని మిమ్మల్ని ఎవరడిగారు?
13అర్థం లేని అర్పణలు మీరు ఇక తీసుకు రావొద్దు. ధూపార్పణ నాకు అసహ్యం. అమావాస్య, విశ్రాంతి దినాలు, సమాజ కూటాలు జరుగుతున్నాయి కాని, మీ దుర్మార్గ సమావేశాలు నేను సహించలేను.
14మీ అమావాస్య ఉత్సవాలు, నియామక ఉత్సవాలు నాకు అసహ్యం. అవి నాకు బాధాకరం. వాటిని సహించలేక విసిగిపోయాను.
15మీరు మీ చేతులు ప్రార్థనలో చాపినప్పుడు మిమ్మల్ని చూడకుండా నా కళ్ళు కప్పేసుకుంటాను. మీరు ఎంత ప్రార్థన చేసినా నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి.
16మిమ్మల్ని కడుగుకోండి. శుద్ధి చేసుకోండి. మీ దుష్టక్రియలు నాకు కనిపించకుండా వాటిని తీసివేయండి. మీ దుష్టత్వం మానండి.”
17మంచి చెయ్యడం నేర్చుకోండి. న్యాయం కోరుకోండి. పీడిత ప్రజలకు సాయం చెయ్యండి. తండ్రిలేని వారికి న్యాయం చెయ్యండి. వితంతువు పక్షాన నిలబడండి.
18యెహోవా ఇలా అంటున్నాడు. “రండి మనం కలిసి ఒక నిర్ణయానికి వద్దాం.” “మీ పాపాలు రక్తంలా ఎర్రగా ఉన్నా, అవి మంచులా తెల్లగా అవుతాయి. కెంపులా ఎర్రగా ఉన్నా, అవి గొర్రెబొచ్చులా తెల్లగా ఔతాయి.
19మీరు ఇష్టపడి నాకు లోబడితే, మీరు ఈ దేశం అందించే మంచి పదార్ధాలు అనుభవిస్తారు.