3ఎద్దుకు తన యజమాని తెలుసు. తన మేత తొట్టి గాడిదకు తెలుసు. కాని, ఇశ్రాయేలుకు తెలియదు. ఇశ్రాయేలుకు అర్థం కాదు.”
4ఓ పాపిష్టి జాతీ, దోషం కింద మగ్గిపోతున్న జనమా, దుష్టుల సంతానమా, అవినీతి చేసే పిల్లలారా మీకు బాధ. వాళ్ళు యెహోవాను విడిచిపెట్టారు. ఇశ్రాయేలీయుల పవిత్ర దేవుణ్ణి అలక్ష్యం చేశారు. ఆయనతో తెగతెంపులు చేసుకున్నారు.
5మీకు ఇంకా దెబ్బలు ఎందుకు తగులుతున్నాయి? మీరు ఇంకా ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు? మీ తల అంతా గాయమే. మీ గుండె నిండా బలహీనతే.
6అరి కాలు నుంచి తల వరకు పుండు పడని భాగం లేదు. ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, మానని పుళ్ళు. అవి నయం కాలేదు. వాటిని ఎవరూ కడగలేదు, కట్టు కట్టలేదు, నూనెతో చికిత్స చెయ్యలేదు.