1ఆయన వారితో, “నేను మీతో కచ్చితంగా చెప్తున్నాను. ఇక్కడ నిలుచున్న వారిలో కొంతమంది దేవుని రాజ్యం శక్తితో రావడం చూస్తారు. దానికంటే ముందు వారు మరణించరు” అని అన్నాడు.
2ఆరు రోజుల తరవాత యేసు పేతురు, యాకోబు, యోహానులను తీసుకుని ఏకాంతంగా ఒక ఎతైన కొండ మీదికి వెళ్ళాడు. అక్కడ వారి ముందు యేసు రూపాంతరం చెందాడు.
3ఆయన వస్త్రాలు ధగధగా మెరవసాగాయి. ప్రపంచంలో ఏ చాకలీ ఉతకలేనంత తెల్లగా మారిపోయాయి.
4అప్పుడు ఏలీయా, మోషేలు అక్కడ ప్రత్యక్షమై యేసుతో మాటలాడడం శిష్యులు చూశారు.
5పేతురు యేసుతో, “రబ్బీ! మనం ఇక్కడే ఉండడం మంచిది. మేము మూడు పాకలు వేస్తాం, ఒకటి నీకు, ఒకటి మోషేకి, ఒకటి ఏలీయాకి” అన్నాడు.
6తానేమి అంటున్నాడో అతనికి తెలియలేదు. ఆ శిష్యులంతా తీవ్రమైన భయానికి లోనయ్యారు.
7అప్పుడు ఒక మేఘం వచ్చి వారిని కప్పివేసింది. ఆ మేఘం నుండి ఒక స్వరం ఇలా వినిపించింది. “ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన మాట వినండి.”
8వెంటనే వారు తమ చుట్టూ చూశారు, యేసు తప్ప మరెవ్వరూ వారికి కనిపించలేదు.
9వారు కొండ దిగి వస్తూ ఉండగా యేసు, “మనుష్య కుమారుడు చనిపోయి తిరిగి బతికే వరకూ మీరు చూసిన ఈ దృశ్యాన్ని ఎవ్వరికీ చెప్పకండి” అని ఆజ్ఞాపించాడు.
10అందువల్ల వారు ఆ విషయం తమలోనే దాచుకుని, “చనిపోయి తిరిగి బ్రతకడం” గురించి తమలో తాము చర్చించుకున్నారు.
11అప్పుడు వారు, “ఏలీయా మొదట రావాలని ధర్మశాస్త్ర పండితులు ఎందుకు అంటున్నారు?” అని ఆయనను అడిగారు.
12యేసు జవాబు చెబుతూ, “ఏలీయా మొదట వచ్చి అన్నిటినీ సరిచేస్తాడన్న మాట నిజమే. కాని, మనుష్య కుమారుడు అనేక బాధలు అనుభవిస్తాడనీ తిరస్కారానికి గురి అవుతాడనీ లేఖనాల్లో ఎందుకు రాసి ఉంది?
13నేను మీతో చెప్పేదేమంటే, ఏలీయా వచ్చాడు, అతని గురించి రాసి ఉన్న ప్రకారం ప్రజలు తమకు ఇష్టం వచ్చినట్టు అతనికి చేశారు” అన్నాడు.
14మిగిలిన శిష్యుల దగ్గరికి ఆయన రాగానే వారి చుట్టూ పెద్ద జనసమూహం ఉండడం, కొందరు ధర్మశాస్త్ర పండితులు వారితో వాదిస్తుండడం చూశాడు.
15ఆ ప్రజలు యేసును చూసిన వెంటనే ఆశ్చర్యానందానికి లోనయ్యారు. వారంతా ఆయన దగ్గరికి పరుగెత్తి వచ్చి ఆయనకు నమస్కరించారు.
16యేసు, “దేనిని గురించి వారితో వాదిస్తున్నారు?” అని వారిని అడిగాడు.
17ఆ ప్రజల్లో ఒకడు ఆయనతో, “బోధకుడా! దయ్యం పట్టి మూగవాడైన నా కుమారుణ్ణి మీ దగ్గరికి తీసుకు వచ్చాను.
18ఆ దయ్యం వాడి మీదికి వచ్చినప్పుడెల్లా అతన్ని కింద పడేస్తుంది. అతని నోటి వెంట నురగ కారుతుంది, పళ్ళు కొరుకుతాడు, శరీరమంతా బిగిసిపోతుంది. ఈ దయ్యాన్ని వదిలించమని మీ శిష్యులను అడిగాను. కాని, వారు చేయలేకపోయారు” అన్నాడు.
19అందుకు యేసు, “విశ్వాసం లేని తరమా! నేనెంత కాలం మీతో ఉంటాను? ఎంత కాలం మిమ్మల్ని భరించాలి? ఆ పిల్లవాడిని నా దగ్గరికి తీసుకుని రండి” అన్నాడు.
20వారు తీసుకు వచ్చారు. ఆ దయ్యం యేసును చూసిన వెంటనే ఆ పిల్లవాడిని విలవిల లాడించింది. వాడు నేల మీద పడి గిల గిలా కొట్టుకుంటూ నురగ కక్కుతున్నాడు.
21యేసు వాడి తండ్రితో, “ఇతనికి ఇది ఎంత కాలం నుండి ఉంది?” అని అడిగాడు. ఆ తండ్రి, “వాడి బాల్యం నుండి.
22ఈ దయ్యం అతన్ని చంపాలని ఎన్నోసార్లు నిప్పుల్లో, నీళ్ళలో పడేసింది. నీవేమైనా చేయగలిగితే కనికరించి సహాయం చెయ్యి” అని వేడుకున్నాడు.
23యేసు అతనితో, “నీవు నమ్మగలిగితే, నమ్మిన వ్యక్తికి అన్నీ సాధ్యమే” అన్నాడు.
24వెంటనే ఆ పిల్లవాడి తండ్రి, “నేను నమ్ముతున్నాను. నాలో అపనమ్మకం లేకుండా సహాయం చెయ్యి” అన్నాడు.
25యేసు జనసమూహం తన దగ్గరికి పరుగెత్తుకుంటూ రావడం చూసి ఆ దయ్యాన్ని గద్దించి, “మూగ చెవిటి దయ్యమా! ఇతనిలో నుండి బయటకు రా! ఇంకెప్పుడూ ఇతనిలో ప్రవేశించవద్దని నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను” అన్నాడు.
26ఆ దయ్యం పెద్ద కేకలు పెట్టి, ఆ పిల్లవాణ్ణి విలవిలలాడించి అతనిలో నుండి బయటకు వచ్చింది. ఆ పిల్లవాడు శవంలా పడి ఉండడం వల్ల చాలా మంది అతడు చనిపోయాడనుకున్నారు.
27కాని, యేసు అతని చెయ్యి పట్టుకుని లేవనెత్తాడు. ఆ పిల్లవాడు లేచి నిలబడ్డాడు.
28యేసు ఇంట్లోకి వచ్చిన తరవాత ఇతరులెవ్వరూ లేనప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “ఆ దయ్యాన్ని మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం?” అని అడిగారు.
29ఆయన వారితో, “ఈ రకమైన దయ్యాన్ని ప్రార్థన వల్ల మాత్రమే వెళ్ళగొట్టగలం” అని జవాబు చెప్పాడు.
30వారు అక్కడ నుండి బయలుదేరి గలిలయ ప్రాంతం మీదుగా దాటిపోయారు. ఆ సంగతి ఎవరికీ తెలియకూడదని యేసు ఆశించాడు.
31ఆయన వాళ్లతో, “మనుష్య కుమారుణ్ణి శత్రువుల చేతికి అప్పగిస్తారు. వారు ఆయనను చంపుతారు. మూడు రోజుల తరువాత ఆయన తిరిగి బతికి వస్తాడు” అని అన్నాడు.
32కానీ యేసు చెప్పింది శిష్యులు గ్రహించలేదు. దాని గురించి యేసును అడగడానికి వారు భయపడ్డారు.
33వారు కపెర్నహూము చేరారు. అందరూ ఇంట్లో చేరాక యేసు వారితో, “దారిలో మీరు దేని గురించి చర్చించుకుంటున్నారు?” అని అడిగాడు.
34అందరూ మౌనంగా ఉండిపోయారు. ఎందుకంటే దారిలో వారు తమలో ఎవరు గొప్ప, అని వాదించుకున్నారు.
35యేసు కూర్చుని పన్నెండు మందిని పిలిచి, “మీలో ఎవడైనా ముఖ్యుడుగా ఉండాలంటే అతడు అందరికన్నా చివరివాడై అందరికీ సేవకుడై ఉండాలి” అని వారితో అన్నాడు.
36అప్పుడాయన ఒక చిన్న బిడ్డను తీసుకుని వారి మధ్య నిలబెట్టాడు. ఆ బిడ్డను ఎత్తుకుని ఇలా అన్నాడు,
37“నా పేరిట ఇలాంటి చిన్నవారిలో ఒకరిని ఎవరైనా స్వీకరిస్తే నన్ను స్వీకరించినట్టే. నన్ను స్వీకరించేవారు నన్ను కాదు, నన్ను పంపిన ఆయనను కూడా స్వీకరిస్తున్నారు.”
38యోహాను ఆయనతో, “బోధకా! ఒకడు నీ పేరట దయ్యాలను వెళ్ళగొట్టడం చూశాం. అతడు మనవాడు కాదు. అందువల్ల అతన్ని అడ్డగించాం” అన్నాడు.
39అయితే యేసు, “అతనిని ఆపకండి. నా పేరట అద్భుతం చేసే వాడెవడూ నా గురించి అంత తేలికగా చెడు మాట్లాడలేడు.
40మనకు వ్యతిరేకంగా లేని వాడు మన పక్షంగా ఉన్నవాడే.
41మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, మీరు క్రీస్తుకు చెందిన వారని గుర్తించి నా పేరట ఒక గిన్నెడు నీళ్ళు ఎవరైనా మీకు తాగడానికి ఇస్తే అతడు తప్పక దాని ఫలం పొందుతాడు.
42“కాని, నన్ను నమ్ముకున్న ఇలాంటి ఒక చిన్నబిడ్డకి ఎవరైనా అడ్డుబండగా ఉంటే అతని మెడకు పెద్ద తిరగలి రాయి కట్టి, అతన్ని సముద్రంలో పడవేయడం అతనికి మేలు.
43మీరు పాపం చేయడానికి మీ చెయ్యి కారణమైతే దాన్ని నరికివేయండి! రెండు చేతులుండి, నరకంలోని ఆరని అగ్నిలోకి పోవడం కంటే ఒక చెయ్యి లేకుండా నిత్యజీవంలో ప్రవేశించడం మీకు మేలు.
45ఒకవేళ మీరు పాపం చేయడానికి మీ కాలు కారణమైతే దాన్ని నరికివేయండి. రెండు కాళ్ళు ఉండి నరకంలో ఆరని అగ్నిలోకి పోవడం కంటే ఒక కాలు లేకుండా నిత్యజీవంలో ప్రవేశించడం మీకు మేలు.
47అలాగే మీరు పాపం చేయడానికి మీ కన్ను కారణమైతే దాన్ని పీకి పారవేయండి. రెండు కళ్ళు ఉండి నరకంలో పడడం కంటే ఒకే కన్నుతో దేవుని రాజ్యంలో ప్రవేశించడం మీకు మేలు.
48నరకంలో వారి పురుగు చావదు, అగ్ని ఆరదు.
49ప్రతి ఒక్కరూ మంటల మూలంగా ఉప్పు సారం పొందుతారు.
50ఉప్పు మంచిదే కాని దానిలో ఉన్న ఉప్పదనం పోతే ఆ స్వభావం తిరిగి ఎలా వస్తుంది? మీలో ఉప్పదనం కలిగి ఉండండి, ఒకరితో ఒకరు సామరస్యంగా ఉండండి” అని చెప్పాడు.