5మూర్ఖుల పాటలు వినడం కంటే జ్ఞానుల గద్దింపు వినడం మేలు.
6ఎందుకంటే మూర్ఖుల నవ్వు బాన కింద చిటపట శబ్దం చేసే చితుకుల మంటలాంటిది. ఇది కూడా నిష్ప్రయోజనం.
7జ్ఞానులు అన్యాయం చేస్తే వారి బుద్ధి చెడిపోయినట్టే. లంచం మనసును చెడగొడుతుంది.
8ఒక పని ప్రారంభం కంటే దాని ముగింపు ప్రాముఖ్యం. అహంకారి కంటే శాంతమూర్తి గొప్పవాడు.
9కోపించడానికి తొందరపడవద్దు. మూర్ఖుల హృదయాల్లో కోపం నిలిచి ఉంటుంది.
10“ఇప్పటి రోజుల కంటే గతించిన రోజులు ఎందుకు మంచివి” అని అడగొద్దు. అది తెలివైన ప్రశ్న కాదు.
11జ్ఞానం మనం వారసత్వంగా పొందిన ఆస్తితో సమానం. భూమి పైన జీవించే వారందరికీ అది ఉపయోగకరం.
12జ్ఞానం, డబ్బు, ఈ రెండూ భద్రతనిచ్చేవే. అయితే జ్ఞానంతో లాభం ఏమిటంటే తనను కలిగి ఉన్నవారికి అది జీవాన్నిస్తుంది.
13దేవుడు చేసిన పనులను గమనించు. ఆయన వంకరగా చేసినదాన్ని ఎవడైనా తిన్నగా చేయగలడా?