Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - ఆది

ఆది 45

Help us?
Click on verse(s) to share them!
1అప్పుడు యోసేపు తన దగ్గర నిలబడ్డ పరివారం ఎదుట తమాయించుకోలేక “అందరినీ నా దగ్గరనుంచి బయటికి పంపేయండి” అని బిగ్గరగా చెప్పాడు. యోసేపు తన అన్నలకు తనను తాను తెలియజేసుకున్నప్పుడు అతని దగ్గర ఎవరూ లేరు.
2అతడు పెద్దగా ఏడవగా ఐగుప్తీయులు విన్నారు. ఫరో ఇంటివారు ఆ ఏడుపు విన్నారు.
3అప్పుడు యోసేపు “నేను యోసేపును. నా తండ్రి ఇంకా బతికే ఉన్నాడా?” అని అడిగినప్పుడు, అతని సోదరులు అతని సమక్షంలో కంగారుపడి అతనికి జవాబు ఇవ్వలేకపోయారు.
4అప్పుడు యోసేపు “నా దగ్గరికి రండి” అని తన సోదరులతో చెబితే, వారు అతని దగ్గరికి వచ్చారు. అప్పుడతడు “ఐగుప్తుకు వెళ్లిపోయేలా మీరు అమ్మేసిన మీ తమ్ముడు యోసేపును నేనే.
5అయినా, నన్నిక్కడకు మీరు అమ్మేసినందుకు దుఃఖపడవద్దు. మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. ప్రాణరక్షణ కోసం దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు.
6రెండేళ్ళ నుంచి దేశంలో కరువు ఉంది. ఇంకా ఐదేళ్ళు దున్నడం గానీ పంటకోత గానీ ఉండదు.
7మిమ్మల్ని రక్షించి, భూమి మీద మిమ్మల్ని శేషంగా నిలపడానికీ ప్రాణాలతో కాపాడడానికీ దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు.
8కాబట్టి నన్ను దేవుడే పంపాడు. మీరు కాదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగా అతని ఇంటివారందరికి ప్రభువుగా ఐగుప్తు దేశమంతటి మీదా అధికారిగా నియమించాడు.
9మీరు త్వరగా నా తండ్రి దగ్గరికి వెళ్ళి అతనితో ‘నీ కొడుకు యోసేపు ఇలా చెబుతున్నాడు-దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటి మీదా అధిపతిగా నియమించాడు, నా దగ్గరికి రండి. ఆలస్యం చేయవద్దు.
10నువ్వు గోషెను ప్రాంతంలో నివసిస్తావు. అప్పుడు నువ్వూ నీ పిల్లలూ నీ పిల్లల పిల్లలూ నీ గొర్రెల మందలూ నీ పశువులూ నీకు కలిగిన సమస్తమూ నాకు దగ్గరగా ఉంటాయి.
11ఇంకా ఐదేళ్ళు కరువు ఉంటుంది, కాబట్టి నీకూ నీ ఇంటి వారికీ నీకు కలిగినదానంతటికీ పేదరికం రాకుండా అక్కడ నిన్ను పోషిస్తాను’ అన్నాడని చెప్పండి.
12ఇదిగో మీతో మాట్లాడేది నా నోరే అని మీ కళ్ళూ నా తమ్ముడు బెన్యామీను కళ్ళూ చూస్తున్నాయి.
13ఐగుప్తులో నాకున్న వైభవాన్నీ మీరు చూసిన సమస్తాన్నీ మా నాన్నకు తెలియచేసి త్వరగా మా నాన్నను ఇక్కడికి తీసుకు రండి” అని తన సోదరులతో చెప్పాడు.
14తన తమ్ముడు బెన్యామీను మెడను కౌగలించుకుని ఏడ్చాడు. బెన్యామీను అతణ్ణి కౌగలించుకుని ఏడ్చాడు.
15అతడు తన సోదరులందరిని ముద్దు పెట్టుకుని వారిని హత్తుకుని ఏడ్చిన తరువాత అతని సోదరులు అతనితో మాట్లాడారు.
16“యోసేపు సోదరులు వచ్చారు” అనే సంగతి ఫరో ఇంట్లో వినబడింది. అది ఫరోకు, అతని సేవకులకు చాలా ఇష్టమయింది.
17అప్పుడు ఫరో యోసేపుతో ఇలా అన్నాడు “నీ సోదరులతో ఇలా చెప్పు, ‘మీరిలా చేయండి. మీ పశువుల మీద బరువులు కట్టి కనాను దేశానికి వెళ్ళి
18మీ తండ్రినీ మీ ఇంటివారిని వెంట బెట్టుకుని నా దగ్గరికి రండి, ఐగుప్తు దేశంలోని మంచి వస్తువులను మీకిస్తాను. ఈ దేశపు సారాన్ని మీరు అనుభవిస్తారు.

19మీకు ఆజ్ఞ ఇస్తున్నాను, ఇలా చేయండి. మీ పిల్లల కోసం, మీ భార్యల కోసం ఐగుప్తులో నుండి బండ్లను తీసుకుపోయి మీ తండ్రిని వెంటబెట్టుకుని రండి.
20ఐగుప్తు దేశమంతటిలో ఉన్న మంచి వస్తువులు మీవే అవుతాయి కాబట్టి మీ సామగ్రిని లక్ష్యపెట్టవద్దు’” అన్నాడు.
21ఇశ్రాయేలు కుమారులు అలాగే చేశారు. యోసేపు ఫరో మాట ప్రకారం వారికి బండ్లు ఇప్పించాడు. ప్రయాణానికి భోజన పదార్ధాలు ఇప్పించాడు.
22అతడు వారికి రెండేసి జతల బట్టలు ఇచ్చాడు, బెన్యామీనుకు 300 షెకెల్ ల వెండి, ఐదు జతల బట్టలు ఇచ్చాడు.
23అతడు తన తండ్రి కోసం వీటిని పంపించాడు, ఐగుప్తులోని శ్రేష్ఠమైన వాటిని మోస్తున్న పది గాడిదలనూ ప్రయాణానికి తన తండ్రి కోసం ఆహారం, ఇతర ధాన్యం, వేర్వేరు తినే సరుకులు మోస్తున్న పది ఆడ గాడిదలనూ పంపించాడు.
24అప్పుడతడు తన సోదరులను సాగనంపి వారు బయలుదేరుతుంటే “దారిలో పోట్లాడుకోవద్దు” అని వారితో చెప్పాడు.
25వారు ఐగుప్తునుండి బయలు దేరి కనాను దేశానికి తమ తండ్రి అయిన యాకోబు దగ్గరికి వచ్చి
26“యోసేపు ఇంకా బతికే ఉన్నాడు. ఐగుప్తు దేశమంతటి మీదా అధిపతిగా ఉన్నాడు” అని అతనికి తెలియచేశారు. అయితే అతడు వారి మాట నమ్మలేక పోయాడు. అతని హృదయం విస్మయం చెందింది.
27అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నీ అతనితో చెప్పారు. తనను తీసుకు వెళ్ళడానికి యోసేపు పంపిన బండ్లు చూసి, వారి తండ్రి యాకోబు ప్రాణం తెప్పరిల్లింది.
28అప్పుడు ఇశ్రాయేలు “ఇంతే చాలు. నా కొడుకు యోసేపు బతికే ఉన్నాడు, నేను చావక ముందు వెళ్ళి అతన్ని చూస్తాను” అన్నాడు.