Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - అపొస్తలుల కార్యములు - అపొస్తలుల కార్యములు 5

అపొస్తలుల కార్యములు 5:16-39

Help us?
Click on verse(s) to share them!
16యెరూషలేము చుట్టూ ఉన్న పట్టణాల్లోని ప్రజలు, రోగులనూ దురాత్మల చేత బాధల పాలౌతున్న వారిని తీసుకొచ్చారు. వారంతా బాగుపడ్డారు.
17ప్రధాన యాజకుడూ అతనితో పాటు ఉన్నవారంతా, అంటే సద్దూకయ్యుల తెగ వారంతా అసూయతో నిండిపోయి
18అపొస్తలులను పట్టుకుని పట్టణంలోని చెరసాల్లో వేశారు.
19అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొచ్చి, “మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి
20ఈ జీవాన్ని గూర్చిన మాటలన్నిటినీ ప్రజలకు చెప్పండి” అని వారితో అన్నాడు.
21వారా మాట విని, ఉదయాన్నే దేవాలయానికి వెళ్ళి బోధిస్తూ ఉన్నారు. ప్రధాన యాజకుడూ, అతనితో ఉన్నవారూ వచ్చి, మహాసభ వారిని ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలిపించి వారిని తీసుకు రమ్మని మనుషులను చెరసాలకు పంపారు.
22భటులు అక్కడికి వెళ్ళి, వారు చెరసాలలో కనబడక పోయేసరికి తిరిగి వచ్చి
23“చెరసాల చాలా భద్రంగా మూసి ఉంది. కావలివారు తలుపుల ముందు నిలబడి ఉండడం చూశాం గానీ తలుపులు తీసినప్పుడు లోపల మాకెవరూ కనబడలేదు” అని వారికి చెప్పారు.
24దేవాలయం అధికారీ, ప్రధాన యాజకులూ ఆ మాట విని ‘ఇది ఏమవుతుందో’ అని వారి విషయమై అయోమయంలో పడిపోయారు.
25అప్పుడొకడు వచ్చి, “మీరు జైల్లో వేయించిన మనుషులు దేవాలయంలో నిలబడి ప్రజలకు బోధిస్తూ ఉన్నారు” అని చెప్పాడు.
26అప్పుడు అధికారి సైనికులతో కూడా పోయి, ప్రజలు రాళ్లతో కొడతారేమోనని భయపడి,
27సౌమ్యంగానే వారిని తీసుకుని వచ్చి మహాసభ ముందుంచాడు.
28ప్రధాన యాజకుడు వారితో, “ఈ నామంలో బోధించవద్దని మేము మీకు కచ్చితంగా ఆజ్ఞాపించాము గదా. అయినా మీరు యెరూషలేమును మీ బోధతో నింపి, ఈ వ్యక్తి హత్యానేరాన్ని మా మీదికి తేవాలని చూస్తున్నారు” అని చెప్పాడు.
29అందుకు పేతురు, మిగిలిన అపొస్తలులు ఇలా జవాబిచ్చారు, “మనుషులకు కాక, దేవునికే మేము లోబడాలి గదా.
30మీరు మానుకు వేలాడదీసి చంపిన యేసును మన పితరుల దేవుడు లేపాడు.
31ఇశ్రాయేలుకు హృదయ పరివర్తన, పాప క్షమాపణ దయచేయడానికి దేవుడాయన్ని అధికారిగా, రక్షకునిగా తన కుడి వైపున ఉండే స్థాయికి హెచ్చించాడు.
32మేమూ, దేవుడు తన విధేయులకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మా, ఈ సంగతులకు సాక్షులం.”
33వారీమాట విని తీవ్ర కోపంతో వీరిని చంపాలని చూశారు.
34అప్పుడు అందరి గౌరవం చూరగొన్న ధర్మశాస్త్ర బోధకుడు గమలీయేలు అనే ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి అపొస్తలులను కాసేపు బయట ఉంచమని ఆజ్ఞాపించి వారితో ఇలా అన్నాడు.
35“ఇశ్రాయేలీయులారా, ఈ మనుషులకు మీరేమి చేయాలని చూస్తున్నారో జాగ్రత్త సుమా.
36కొంతకాలం క్రితం థూదా లేచి తాను గొప్పవాడినని చెప్పుకున్నాడు. సుమారు నాలుగు వందల మంది అతనితో కలిశారు. అతడు హతుడయ్యాడు. అతనిని అనుసరించిన వారంతా చెల్లా చెదరై పోయారు.
37అతని తరువాత జనాభా లెక్కలు తీసే రోజుల్లో గలిలయవాడైన యూదా అనేవాడు లేచి, కొంతమందిని తన వైపుకు ఆకర్షించాడు. వాడు కూడా నశించిపోయాడు, వాణ్ణి అనుసరించిన వారంతా చెదరిపోయారు.
38కాబట్టి నేను మీతో చెప్పేది ఏమంటే ఈ మనుషుల జోలికి వెళ్ళకుండా వారిని విడిచిపెట్టండి. ఈ ఆలోచన గానీ వారి పని గానీ మనుషుల వలన కలిగినదైతే, అది వ్యర్థమై పోతుంది.
39దేవుని వలన కలిగినదైతే వారిని మీరు ఓడించలేరు. మీరొకవేళ దేవునితో పోరాడే వారవుతారేమో సుమా.”

Read అపొస్తలుల కార్యములు 5అపొస్తలుల కార్యములు 5
Compare అపొస్తలుల కార్యములు 5:16-39అపొస్తలుల కార్యములు 5:16-39