Text copied!
Bibles in Telugu

కీర్తన 68:1-17 in Telugu

Help us?

కీర్తన 68:1-17 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 ప్రధాన సంగీతకారుని కోసం. దావీదు కీర్తన. దేవుడు లేస్తాడు గాక, ఆయన శత్రువులు చెదరిపోతారు గాక. ఆయనను ద్వేషించేవారు ఆయన సన్నిధి నుండి పారిపోతారు గాక.
2 పొగను చెదరగొట్టినట్టు నువ్వు వారిని చెదరగొట్టు. అగ్నికి మైనం కరిగిపోయేలా దుర్మార్గులు దేవుని సన్నిధిలో కరిగి నశించిపోతారు గాక.
3 నీతిమంతులు సంతోషిస్తారు గాక. వారు దేవుని సన్నిధిలో సంతోషించి బహుగా ఆనందిస్తారు గాక.
4 దేవుని గూర్చి పాడండి. ఆయన నామాన్ని బట్టి స్తోత్రగానం చేయండి. యొర్దాను నదీ లోయ ప్రాంతంలో స్వారీ చేసే దేవుని కోసం, ఒక రాజమార్గం ఏర్పాటు చేయండి. ఆయన పేరు యెహోవా. ఆయన ఎదుట పండగ చేసుకోండి.
5 తన పరిశుద్ధాలయంలో ఉన్న దేవుడు, తండ్రి లేని వారికి తండ్రిగా, వితంతువులకు సహాయకుడిగా ఉన్నాడు.
6 దేవుడు ఒంటరి వారిని కుటుంబాలుగా చేస్తాడు. ఆయన బంధకాల్లో ఉన్న వారిని విడిపించి వారిని వృద్ధి చెందిస్తాడు. తిరుగుబాటు చేసే వారి భూములు బీడులైపోతాయి.
7 దేవా, నీవు నీ ప్రజలకు ముందుగా బయలుదేరినప్పుడు అరణ్యంలో ప్రయాణించినప్పుడు
8 దేవుని సన్నిధిలో ఆయన సీనాయి కొండకు వచ్చినపుడు, ఇశ్రాయేలు దేవుని సన్నిధిలో భూమి వణికింది, ఆకాశాలు వర్షించాయి.
9 దేవా, నీ వారసత్వం మీద వర్షం సమృద్ధిగా కురిపించావు. అది అలసి ఉన్నప్పుడు నువ్వు దాన్ని బలపరచావు.
10 నీ ప్రజలు దానిలో నివసిస్తారు. దేవా, నీ మంచితనంతో పేదలను అనుగ్రహించావు.
11 ప్రభువు ఆజ్ఞాపించాడు. గొప్ప సైన్యం దాన్ని ప్రకటించింది.
12 సైన్యాలున్న రాజులు పారిపోతారు. వారు పారిపోతారు. ఇళ్ళలో ఉండే స్త్రీలు దోపుడు సొమ్ము పంచుకుంటారు.
13 గువ్వలను వెండితో కప్పినట్టు, వాటి రెక్కలకు పచ్చని బంగారు పూత పూసినట్టు ఉన్న సొమ్ము వారు పంచుకుంటారు. గొర్రెల దొడ్లలో మీలో కొందరు ఎందుకు పడుకుని ఉండిపోయారు?
14 సర్వశక్తుడు అక్కడి రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను కొండ మీద మంచు కురిసినట్టు కనిపించింది.
15 బాషాను చాలా ఉన్నతమైన పర్వతం. అది అనేక శిఖరాలు ఉన్న పర్వతం.
16 శిఖరాలున్న పర్వతాల్లారా, దేవుడు తన నివాసంగా ఏర్పాటు చేసిన పర్వతాన్ని ఎందుకు అంత అసూయగా చూస్తున్నారు? యెహోవా శాశ్వతంగా దానిలో నివసిస్తాడు.
17 దేవుని రథాలు వేలాదిగా ఉన్నాయి. సీనాయి కొండపై ఉన్నట్టుగా యెహోవా వాటి మధ్య తన పరిశుద్ధ సన్నిధిలో ఉన్నాడు.
కీర్తన 68 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019