Text copied!
Bibles in Telugu

2 రాజులు 10:8-19 in Telugu

Help us?

2 రాజులు 10:8-19 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 ఒక వార్తాహరుడు యెహూ దగ్గరికి వచ్చి “వారు రాకుమారుల తలలు తీసుకు వచ్చారు” అని చెప్పాడు. అతడు “వాటిని ఉదయం వరకూ పట్టణ ద్వారం దగ్గర రెండు కుప్పలుగా వేయండి” అన్నాడు.
9 ఉదయం అతడు బయటకు వచ్చి అక్కడ నిలబడి ఉన్న మనుషులను చూసి “మీరంతా నిర్దోషులు. నేను నా రాజు పై కుట్ర చేసి అతణ్ణి చంపేశాను. అయితే వీళ్ళనెవరు చంపారు?
10 తన సేవకుడు ఏలీయా ద్వారా యెహోవా అహాబు కుటుంబాన్ని గురించి పలికిన మాటలను ఆయన నెరవేర్చాడు. యెహోవా అహాబు కుటుంబాన్ని గురించి పలికిన మాటల్లో ఏ ఒక్కటీ వ్యర్థంగా పోదని మీరు తెలుసుకోవాలి.”
11 ఈ విధంగా యెహూ యెజ్రెయేలులో ఉన్న అహాబు కుటుంబ సభ్యులందర్నీ, అతనితో సంబంధం ఉన్న ప్రముఖమైన వ్యక్తులనూ, అతనికి సన్నిహితమైన స్నేహితులనూ, అతని పూజారులు అందర్నీ చంపివేశాడు. అలాంటి వారు ఇక ఒక్కరు కూడా లేకుండా చేశాడు.
12 ఇది జరిగాక అతడు షోమ్రోను పట్టణానికి ప్రయాణమయ్యాడు. దారిలో అతడు గొర్రెల బొచ్చు కత్తెర వేసే ఇంటికి దగ్గరలో ఉన్నప్పుడు
13 యూదా రాజు అహజ్యా అన్నదమ్ములు ఎదురయ్యారు. యెహూ వాళ్ళను “మీరు ఎవరు?” అని అడిగాడు. వారు “మేము అహజ్యా అన్నదమ్ములం. మేము రాజు గారి పిల్లలనూ, రాణి యెజెబెలు పిల్లలనూ పలకరించడానికి వెళ్తున్నాం” అని చెప్పారు.
14 అతడు “వాళ్ళను ప్రాణాలతో పట్టుకోండి” అని తన వాళ్ళను ఆదేశించాడు. దాంతో వారు అందర్నీ సజీవంగా పట్టుకుని నలభై రెండు మందిని గొర్రెల బొచ్చు కత్తెర వేసే ఇంటికి దగ్గరలో ఉన్న ఒక బావి దగ్గర చంపారు. వాళ్ళలో ఒక్కణ్ణి కూడా ప్రాణాలతో వదిలిపెట్టలేదు.
15 అక్కడనుండి యెహూ ముందుకు వెళ్ళాడు. తనను కలుసుకోడానికి వస్తున్న రేకాబు కొడుకు యెహోనాదాబుని చూశాడు. అతనితో మంచీ చెడూ మాట్లాడి “నా హృదయం నీ విషయంలో నిజాయితీగా ఉన్నట్టు నీ హృదయం నా విషయంలో ఉందా?” అని అడిగాడు. దానికి యెహోనాదాబు “ఉంది” అన్నాడు. యెహూ “ఆలాగైతే నా చేతిలో నీ చెయ్యి వేయి” అన్నాడు. యెహోనాదాబు యెహూ చేతిలో తన చెయ్యి వేశాడు. యెహూ అతణ్ణి తన రథం మీద ఎక్కించుకున్నాడు.
16 యెహూ అతనితో “యెహోవా కోసం నాకు ఎంత ఉత్సాహం ఉందో చూద్దువుగాని రా” అన్నాడు. తన రథంలో అతణ్ణి కూర్చోబెట్టాడు.
17 అతడు షోమ్రోను చేరుకుని అక్కడ అహాబుకు చెందిన మిగిలిన రాజవంశీకులందర్నీ చంపివేశాడు. యెహోవా ఏలీయాకు చెప్పిన మాట నెరవేర్చాడు.
18 ఆ తరువాత యెహూ ప్రజలందర్నీ సమకూర్చాడు. వారితో “అహాబు బయలు దేవుతకి స్వల్పంగానే సేవ చేసాడు. కాని యెహూ ఎంతో గొప్ప సేవ చేయబోతున్నాడు.
19 కాబట్టి బయలు దేవుడి ప్రవక్తలందర్నీ, ఆరాధకులందర్నీ, పూజారులందర్నీ నా దగ్గరికి పిలుచుకు రండి. బయలు దేవుడికి ఒక మహా బలి చేయబోతున్నాను. కాబట్టి ఎవరూ రాకుండా ఉండిపోకూడదు. అలా రాని వాణ్ణి నేను బతకనివ్వను” అన్నాడు. బయలు ఆరాధకులందర్నీ చంపాలనే ఉద్దేశ్యంతో యెహూ ఈ మోసపూరితమైన ప్రకటన చేశాడు.
2 రాజులు 10 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019