Text copied!
Bibles in Telugu

1 రాజులు 8:37-58 in Telugu

Help us?

1 రాజులు 8:37-58 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

37 దేశంలో కరువు గాని, తెగులు గాని, వడ గాడ్పు దెబ్బ గాని, బూజు పట్టడం గాని, పంటలకు మిడతలు గాని, చీడపురుగు గాని సోకినా, వారి శత్రువు వారి పట్టణాలను ముట్టడి వేసినా, ఏ తెగులు గాని వ్యాధి గాని సోకినా,
38 నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల్లో ప్రతి ఒక్కరూ తన హృదయంలో ఉన్న తెగులును గ్రహిస్తాడు గనక ఒక్కడు గానీ ప్రజలందరూ గానీ ఈ మందిరం వైపు తమ చేతులు చాపి ప్రార్థనా విన్నపాలు చేస్తే
39 ప్రతి మనిషి హృదయమూ నీకు తెలుసు కాబట్టి నీవు నీ నివాస స్థలమైన ఆకాశం నుండి విని, క్షమించి, దయచేసి ఎవరు చేసిన దాన్ని బట్టి వారికి ప్రతిఫలమిచ్చి
40 మా పూర్వీకులకు నీవు దయ చేసిన దేశంలో ప్రజలు జీవించినంత కాలం, వారు ఈ విధంగా నీవంటే భయభక్తులు కలిగి ఉండేలా చెయ్యి. మానవులందరి హృదయాలూ నీకు మాత్రమే తెలుసు.
41 నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల సంబంధులు కాని పరదేశులు నీ పేరును బట్టి దూర దేశం నుండి వచ్చి
42 నీ గొప్ప పేరును గురించి, నీ బాహుబలం గురించి, నీవు ఎత్తిన నీ చేతి శక్తిని గురించి వింటారు. వారు వచ్చి ఈ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తే
43 నీ నివాసమైన ఆకాశం నుండి నీవు విని, పరదేశులు నిన్ను వేడుకొన్న విధంగా సమస్తం అనుగ్రహించు. అప్పుడు లోకంలోని ప్రజలంతా నీ పేరును తెలుసుకుని, నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల్లాగానే నీలో భయభక్తులు కలిగి, నేను కట్టించిన ఈ మందిరానికి నీ పేరు పెట్టామని తెలుసుకుంటారు.
44 నీ ప్రజలు తమ శత్రువులతో యుద్ధం చేయడానికి నీవు పంపించే ఏ స్థలానికైనా బయలు దేరినప్పుడు, నీవు కోరుకొన్న పట్టణం వైపుకూ నీ నామ ఘనత కోసం నేను కట్టించిన ఈ మందిరం వైపుకూ తిరిగి యెహోవావైన నీకు ప్రార్థన చేస్తే,
45 ఆకాశం నుండి నీవు వారి ప్రార్థన విన్నపాలను విని, వారికి సహాయం చెయ్యి.
46 పాపం చేయనివాడు ఒక్కడూ లేడు, వారు నీకు విరోధంగా పాపం చేసినపుడు, నీవు వారి మీద కోపగించుకుని వారిని శత్రువుల చేతికి అప్పగించినప్పుడు, వారు వీరిని దూరమైనా, దగ్గరైనా ఆ శత్రువుల దేశానికి చెరగా తీసుకుపోయినప్పుడు,
47 వారు చెరగా వెళ్ళిన దేశంలో తాము చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకుని, ‘మేము దుర్మార్గంగా ప్రవర్తించి పాపం చేశాము’ అని చింతించి, పశ్చాత్తాపపడి నీకు విన్నపం చేస్తే,
48 వారు చెరలో ఉన్న దేశం నుండి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో నీ వైపు తిరిగి, నీవు వారి పూర్వీకులకు దయచేసిన దేశం వైపూ, నీవు కోరుకున్న పట్టణం వైపూ నీ నామఘనత కోసం నేను కట్టించిన ఈ మందిరం వైపూ తిరిగి నీకు ప్రార్థన చేస్తే,
49 నీ నివాసమైన ఆకాశం నుండి నీవు వారి ప్రార్థన విన్నపాలు విని వారి పని జరిగించు.
50 నీకు వ్యతిరేకంగా పాపం చేసిన నీ ప్రజలు ఏ తప్పుల విషయంలో దోషులయ్యారో ఆ తప్పులు క్షమించి, నీ ప్రజలను చెరగొనిపోయిన వారికి వారి పట్ల కనికరం పుట్టించు.
51 వారు నీవెన్నుకున్న నీ ప్రజలు. ఇనుప కొలిమి నుండి తప్పించినట్టుగా నీవు ఐగుప్తు దేశంలోనుండి తప్పించిన నీ ప్రజలు.
52 కాబట్టి నీ దాసుడినైన నేనూ, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులూ చేసే విన్నపం మీద దృష్టి ఉంచి, వారు ఏ విషయాల్లో నిన్ను వేడుకుంటారో వాటిని ఆలకించు.
53 ప్రభూ, యెహోవా, నీవు మా పూర్వీకులను ఐగుప్తులో నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసుడైన మోషే ద్వారా ప్రమాణం చేసినట్టు లోకంలోని ప్రజలందరిలో నుండి వారిని నీ స్వాస్థ్యంగా ప్రత్యేకించుకున్నావు కదా.”
54 సొలొమోను ఈ విధంగా ప్రార్థించడం, విన్నపాలు చేయడం ముగించి ఆకాశం వైపు తన చేతులు చాపి, యెహోవా బలిపీఠం ఎదుట మోకాళ్ళపై నుండి లేచి నిలబడ్డాడు.
55 అప్పుడు అతడు పెద్ద స్వరంతో ఇశ్రాయేలీయుల సమాజాన్ని ఈ విధంగా దీవించాడు,
56 “తాను చేసిన వాగ్దానాలన్నిటినీ నెరవేర్చి తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తుతి కలుగు గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానాల్లో ఒక్క మాటైనా విఫలం కాలేదు.
57 కాబట్టి మన దేవుడు యెహోవా మనలను విడిచి పెట్టకుండా మన పూర్వీకులకు తోడుగా ఉన్నట్టు మనకు కూడా తోడుగా ఉండి
58 తన మార్గాలన్నిటినీ అనుసరించి నడుచుకొనేలా, తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను, కట్టడలను, విధులను పాటించేలా, మన హృదయాలను తన వైపు తిప్పుకుంటాడు గాక.
1 రాజులు 8 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019