Text copied!
Bibles in Telugu

1 రాజులు 8:28-47 in Telugu

Help us?

1 రాజులు 8:28-47 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

28 అయినప్పటికీ, యెహోవా, నా దేవా, నీ దాసుడినైన నా ప్రార్థననూ మనవినీ అంగీకరించి, ఈ రోజు నీ దాసుడినైన నేను చేసే ప్రార్థననూ నా మొర్రనూ ఆలకించు.
29 నీ దాసుడినైన నేను చేసే ప్రార్థనను దయతో అంగీకరించేలా ‘నా నామం అక్కడ ఉంటుంది’ అని ఏ స్థలం గురించి నీవు చెప్పావో ఆ ఈ మందిరం వైపు నీ కళ్ళు రాత్రీ, పగలూ తెరచుకుని ఉంటాయి గాక.
30 నీ దాసుడినైన నేనూ నీ ప్రజలైన ఇశ్రాయేలీయులూ ఈ స్థలం వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడెల్లా, నీ నివాసమైన ఆకాశం నుండి విని మా విన్నపాన్ని ఆలకించు. ఆలకించినప్పుడెల్లా మమ్మల్ని క్షమించు.
31 ఎవరైనా తన పొరుగువాడికి అన్యాయం చేసినప్పుడు అతని చేత ప్రమాణం చేయించాల్సి వస్తే అతడు ఈ మందిరంలోని నీ బలిపీఠం ఎదుట ఆ ప్రమాణం చేసినప్పుడు,
32 నీవు ఆకాశం నుండి విని, నీ దాసులకు న్యాయం తీర్చి, హాని చేసినవాడి తల మీదికి శిక్ష రప్పించి, నీతిపరుని నీతిచొప్పున అతనికిచ్చి అతని నీతిని నిర్ధారించు.
33 నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు నీకు వ్యతిరేకంగా పాపం చేయడం వలన తమ శత్రువుల చేతిలో ఓడిపోయినప్పుడు, వారు నీ వైపు తిరిగి నీ పేరును ఒప్పుకుని ఈ మందిరంలో నీకు ప్రార్థనా విజ్ఞాపనలు చేసినప్పుడు
34 నీవు ఆకాశం నుండి విని, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు చేసిన పాపాన్ని క్షమించి, వారి పూర్వీకులకు నీవిచ్చిన దేశంలోకి వారిని తిరిగి రప్పించు.
35 వారు నీకు వ్యతిరేకంగా పాపం చేయడం వలన ఆకాశం మూసుకుపోయి వర్షం కురవకపోతే, వారి ఇబ్బంది వలన వారు నీ నామాన్ని ఒప్పుకుని తమ పాపాలను విడిచి ఈ స్థలం వైపు తిరిగి ప్రార్థన చేస్తే,
36 నీవు ఆకాశం నుండి విని, నీ దాసులు, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు చేసిన పాపాన్ని క్షమించి, వారు నడుచుకోవలసిన మార్గాన్ని వారికి చూపించి, వారికి నీవు స్వాస్థ్యంగా ఇచ్చిన భూమి మీద వర్షం కురిపించు.
37 దేశంలో కరువు గాని, తెగులు గాని, వడ గాడ్పు దెబ్బ గాని, బూజు పట్టడం గాని, పంటలకు మిడతలు గాని, చీడపురుగు గాని సోకినా, వారి శత్రువు వారి పట్టణాలను ముట్టడి వేసినా, ఏ తెగులు గాని వ్యాధి గాని సోకినా,
38 నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల్లో ప్రతి ఒక్కరూ తన హృదయంలో ఉన్న తెగులును గ్రహిస్తాడు గనక ఒక్కడు గానీ ప్రజలందరూ గానీ ఈ మందిరం వైపు తమ చేతులు చాపి ప్రార్థనా విన్నపాలు చేస్తే
39 ప్రతి మనిషి హృదయమూ నీకు తెలుసు కాబట్టి నీవు నీ నివాస స్థలమైన ఆకాశం నుండి విని, క్షమించి, దయచేసి ఎవరు చేసిన దాన్ని బట్టి వారికి ప్రతిఫలమిచ్చి
40 మా పూర్వీకులకు నీవు దయ చేసిన దేశంలో ప్రజలు జీవించినంత కాలం, వారు ఈ విధంగా నీవంటే భయభక్తులు కలిగి ఉండేలా చెయ్యి. మానవులందరి హృదయాలూ నీకు మాత్రమే తెలుసు.
41 నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల సంబంధులు కాని పరదేశులు నీ పేరును బట్టి దూర దేశం నుండి వచ్చి
42 నీ గొప్ప పేరును గురించి, నీ బాహుబలం గురించి, నీవు ఎత్తిన నీ చేతి శక్తిని గురించి వింటారు. వారు వచ్చి ఈ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తే
43 నీ నివాసమైన ఆకాశం నుండి నీవు విని, పరదేశులు నిన్ను వేడుకొన్న విధంగా సమస్తం అనుగ్రహించు. అప్పుడు లోకంలోని ప్రజలంతా నీ పేరును తెలుసుకుని, నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల్లాగానే నీలో భయభక్తులు కలిగి, నేను కట్టించిన ఈ మందిరానికి నీ పేరు పెట్టామని తెలుసుకుంటారు.
44 నీ ప్రజలు తమ శత్రువులతో యుద్ధం చేయడానికి నీవు పంపించే ఏ స్థలానికైనా బయలు దేరినప్పుడు, నీవు కోరుకొన్న పట్టణం వైపుకూ నీ నామ ఘనత కోసం నేను కట్టించిన ఈ మందిరం వైపుకూ తిరిగి యెహోవావైన నీకు ప్రార్థన చేస్తే,
45 ఆకాశం నుండి నీవు వారి ప్రార్థన విన్నపాలను విని, వారికి సహాయం చెయ్యి.
46 పాపం చేయనివాడు ఒక్కడూ లేడు, వారు నీకు విరోధంగా పాపం చేసినపుడు, నీవు వారి మీద కోపగించుకుని వారిని శత్రువుల చేతికి అప్పగించినప్పుడు, వారు వీరిని దూరమైనా, దగ్గరైనా ఆ శత్రువుల దేశానికి చెరగా తీసుకుపోయినప్పుడు,
47 వారు చెరగా వెళ్ళిన దేశంలో తాము చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకుని, ‘మేము దుర్మార్గంగా ప్రవర్తించి పాపం చేశాము’ అని చింతించి, పశ్చాత్తాపపడి నీకు విన్నపం చేస్తే,
1 రాజులు 8 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019