5 యెహోవాపట్ల భయభక్తులు కలిగి ఉండడం ఎలా ఉంటుందో నువ్వు గ్రహిస్తావు. దేవుణ్ణి గూర్చిన విజ్ఞానం నీకు దొరుకుతుంది.
6 యెహోవా మాత్రమే జ్ఞానం అనుగ్రహిస్తాడు. తెలివి, వివేచన ఆయన మాటల్లో నిండి ఉంటాయి.
7 యథార్థవంతులను ఆయన వర్ధిల్లజేస్తాడు. సరియైన మార్గం నుండి తప్పిపోకుండా నడుచుకునే వాళ్ళకు ఆయన రక్షణ కలుగజేస్తాడు.
8 న్యాయ ప్రవర్తన నుండి తొలగిపోకుండా ఆయన కనిపెట్టుకుని ఉంటాడు. తన భక్తులు మంచి ప్రవర్తనలో కొనసాగేలా ఆయన కావలి కాస్తాడు.
9 అప్పుడు నీతి, న్యాయం, యథార్థత అనే మంచి మార్గాలు నువ్వు తెలుసుకుంటావు.
10 జ్ఞానం నీ హృదయంలోకి చొచ్చుకుపోతుంది. తెలివి కలిగి ఉండడం నీకు ఇష్టంగా ఉంటుంది.
11 తెలివితేటలు నిన్ను కాపాడతాయి. వివేకం నీకు కాపలా కాస్తుంది.
12 అది దుష్టులు నడిచే మార్గాల నుండి, మూర్ఖపు మాటలు మాట్లాడే వారి బారి నుండి నిన్ను కాపాడుతుంది.
13 దుష్టులు చీకటి మార్గాల్లో నడవడం కోసం యథార్థమైన మార్గాలను విడిచిపెడతారు.
14 కీడు చేసేవాళ్ళు తమ పనుల వల్ల సంతోషిస్తారు. తీవ్రమైన మూర్ఖత్వంతో ప్రవర్తించే వాళ్ళను చూసి ఆనందిస్తారు.
15 తమ దుష్ట మార్గాలగుండా పయనిస్తారు. వాళ్ళు కపటంతో ఉంటారు.