2 జ్ఞానం, ఉపదేశం నేర్చుకోవడానికీ, వివేకం, జ్ఞానవాక్కులు బోధించడానికీ,
3 నీతి, న్యాయం, యథార్థతల ప్రకారం నడుచుకుంటూ దిద్దుబాటు చేసుకోవడానికి,
4 ఉపదేశం పొందని వారికి వివేకం ఇవ్వడానికి, యువతకు తెలివి, విచక్షణ కలిగేలా చేయడానికి ఉపకరిస్తాయి.
5 తెలివి గలవాడు ఈ సామెతలు విని తన జ్ఞానం వృద్ధి చేసుకుంటాడు. వివేకం గలవాడు విని నీతి సూత్రాలు అలవర్చుకుంటాడు.
6 వీటి మూలంగా సామెతలు, ఉపమానాలు, జ్ఞానుల మాటలు, వారు చెప్పిన నిగూఢ సత్యాలు ప్రజలు గ్రహిస్తారు.
7 యెహోవాపట్ల భయభక్తులు కలిగి ఉండడం తెలివికి మూలకారణం. మూర్ఖప్రజలు జ్ఞానాన్ని, నీతి వాక్యాలను వ్యతిరేకిస్తారు.
8 కుమారా, నీ తండ్రి చెప్పే సద్బోధ విను. నీ తల్లి చెప్పే మాటలు నిర్ల్యక్ష్యం చెయ్యకు.
9 అవి నీ తలపై అందమైన పుష్ప కిరీటంలా ఉంటాయి. నీ మెడలో హారాలుగా నిలబడతాయి.
10 కుమారా, దుష్టులు నిన్ను ప్రేరేపిస్తే అంగీకరించవద్దు.
11 దుష్టులు నీతో “మాతో చేతులు కలుపు. ఎవరినైనా చంపడానికి కాపు కాద్దాం. అమాయకుడైన ఒకణ్ణి పట్టుకుందాం.
12 ఆరోగ్య వంతుణ్ణి పాతాళం అకస్మాత్తుగా తీసేసుకున్నట్టు వారిని సజీవంగా మింగేద్దాం. సమాధిలోకి దిగే వారిలా వారిని చేసేద్దాం.
13 దోచుకున్న సొమ్ముతో మన ఇల్లు నింపుకుందాం, రకరకాల విలువైన వస్తువులు మనకు దొరుకుతాయి.
14 నువ్వు మాతో కలసి ఉండు, మనమంతా ఒకే చోట సొమ్ము దాచుకుందాం” అని నీతో చెబితే వాళ్ళ మాటలు లక్ష్యపెట్టవద్దు.
15 కుమారా, నువ్వు వాళ్ళు నడిచే దారిలో వెళ్ళ వద్దు. వాళ్ళ ఆలోచన ప్రకారం చేయకుండేలా నీ పాదాలు అదుపులో ఉంచుకో.
16 మనుషులను చంపడానికి వాళ్ళు తొందరపడుతూ ఉంటారు. హాని కలిగించడానికి ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు.
17 ఒక పక్షి చూస్తూ ఉండగా దానికి వల వేయడం అనవసరం.