Text copied!
Bibles in Telugu

సామెత 13:5-21 in Telugu

Help us?

సామెత 13:5-21 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 నీతిమంతులకు అబద్దాలంటే అసహ్యం. దుష్టుడు నిందలు మోపుతూ, అవమానపరుస్తూ ఉంటాడు.
6 నిజాయితీపరులకు వారి యథార్థ ప్రవర్తన కాపుదలగా ఉంటుంది. పాపులు తమ భక్తిహీనత వల్ల నాశనమౌతారు.
7 తాము ధనవంతులమని చెప్పుకునే పేదలు ఉన్నారు. దరిద్రులమని చెప్పుకునే ధనవంతులు కూడా ఉన్నారు.
8 ఒకడి సంపద అతని ప్రాణాన్ని విడిపిస్తుంది. దరిద్రుడు హెచ్చరిక మాటలు లక్ష్యపెట్టడు.
9 నీతిమంతుల వెలుగు ప్రకాశిస్తుంది. భక్తిహీనుల దీపం ఆరిపోతుంది.
10 గర్వాంధుడు కలహాలు రేపుతాడు. మంచి మాటలు ఆలకించే వారికి జ్ఞానం చేకూరుతుంది.
11 మోసం చేసి సంపాదించిన సొత్తు తరిగి పోతుంది. కష్టపడి ధనం సంపాదించిన వాడు దాన్ని వృద్ధి పరుచుకుంటాడు.
12 కోరుకున్నది జరగకపోతే హృదయం క్షీణిస్తుంది. తీరిన కోరిక జీవవృక్షం వంటిది.
13 హితబోధను తిరస్కరించేవాడు దాన్ని బట్టి శిక్షకు పాత్రుడౌతాడు. ఆజ్ఞల పట్ల భయభక్తులు చూపి వాటిని ఆచరించేవాడు తగిన ఫలం పొందుతాడు.
14 జ్ఞానుల ఉపదేశం జీవం కలిగించే ఊట. మనుషులు దాని మూలంగా మరణ బంధకాల నుండి తప్పించుకుంటారు.
15 మంచి బుద్ధి కలిగి ఉంటే దయాగుణం అలవడుతుంది. నమ్మకద్రోహుల మార్గం కష్టాల కడలి.
16 వివేకం గలవారు తెలివిగా తమ పనులు జరిగిస్తారు. బుద్ధిహీనులు తమ మూర్ఖత్వాన్ని బయటపెట్టుకుంటారు.
17 దుర్మార్గుడైన ప్రతినిధి కష్టాల పాలవుతాడు. సమర్ధుడైన రాయబారి తన వారికి క్షేమం కలిగిస్తాడు.
18 క్రమశిక్షణను లక్ష్యపెట్టని వాడికి అవమానం, దరిద్రం దాపురిస్తాయి. మందలింపును శిరసావహించేవాడు గౌరవం పొందుతాడు.
19 కోరిక నెరవేరితే ప్రాణానికి ఊరట కలుగుతుంది. చెడుతనాన్ని విడిచి పెట్టడం మూర్ఖులకు ఏవగింపు.
20 జ్ఞానులతో స్నేహం చేసే వారు జ్ఞానం సంపాదించుకుంటారు. మూర్ఖులతో స్నేహం చేసేవాడు నాశనమైపోతాడు.
21 కీడు పాపులను వెంటాడుతుంది. నీతిమంతులకు ప్రతిఫలంగా మేలు కలుగుతుంది.
సామెత 13 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019