Text copied!
Bibles in Telugu

సంఖ్యా 22:20-34 in Telugu

Help us?

సంఖ్యా 22:20-34 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

20 ఆ రాత్రి దేవుడు బిలాము దగ్గరికి వచ్చి “ఆ మనుషులు నిన్ను పిలిపించారు గనక నువ్వు లేచి వారితో వెళ్ళు. కాని కేవలం నేను నీతో చెప్పినట్టే నువ్వు చెయ్యాలి” అని చెప్పాడు.
21 ఉదయాన బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు నాయకులతోపాటు వెళ్ళాడు.
22 అతడు వెళ్తూ ఉన్నప్పుడు, దేవుని కోపం రగులుకుంది. యెహోవా దూత అతనికి విరోధంగా దారిలో అడ్డంగా నిలిచి ఉన్నాడు. అతడు తన గాడిద ఎక్కి వెళ్తూ ఉన్నప్పుడు, అతని పనివారు ఇద్దరు అతనితోపాటు ఉన్నారు.
23 యెహోవా దూత కత్తి దూసి, దారిలో నిలిచి ఉండడం ఆ గాడిద చూసింది గనక అది దారి మళ్ళి పొలంలోకి వెళ్ళింది. బిలాము గాడిదను దారిలోకి మళ్ళించాలని దాన్ని కొట్టాడు.
24 యెహోవా దూత అటూ ఇటూ గోడలున్న ద్రాక్షతోటల సందులో నిలిచాడు.
25 గాడిద యెహోవా దూతను చూసి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమింది గనక అతడు మళ్ళీ దాన్ని కొట్టాడు.
26 యెహోవా దూత ముందుకు వెళ్లి, కుడికైనా ఎడమకైనా తిరగడానికి దారిలేని ఇరుకు ప్రాంతంలో నిలిచినప్పుడు,
27 ఆ గాడిద యెహోవా దూతను చూసి బిలాముతోబాటు కింద పడిపోయింది గనక బిలాము మండిపడ్డాడు. తన చేతి కర్రతో గాడిదను కొట్టాడు.
28 అప్పుడు యెహోవా ఆ గాడిద నోరు తెరిచాడు. అది “నువ్వు నన్ను మూడుసార్లు కొట్టావు. నేను ఏమి చేశాను?” అని బిలాముతో అంది.
29 బిలాము “నువ్వు నన్ను ఒక వెర్రివాణ్ణి చేశావు. నా చేతిలో కత్తి ఉంటే నిన్ను చంపేసే వాణ్ణి” అన్నాడు.
30 ఆ గాడిద “ఈ రోజు వరకూ నీ జీవితమంతా నువ్వు స్వారీ చేసిన నేను నీదాన్ని కాదా? నేనెప్పుడైనా నీ పట్ల ఈవిధంగా చేశానా?” అని బిలాముతో అంది. బిలాము “లేదు” అన్నాడు.
31 అప్పుడు యెహోవా బిలాము కళ్ళు తెరిచాడు గనక దూసిన కత్తి చేత్తో పట్టుకుని దారిలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూసి తల వంచి సాష్టాంగ నమస్కారం చేశాడు.
32 యెహోవా దూత “నీ గాడిదను మూడుసార్లు ఎందుకు కొట్టావు? చూడు, నా దృష్టిలో నువ్వు దుర్మార్గమైన పనులు చేశావు గనక నేను నీకు విరోధిగా వచ్చాను.
33 ఆ గాడిద నన్ను చూసి ఈ మూడుసార్లు నా ఎదుట నుంచి పక్కకు వెళ్ళింది. అది నా ఎదుట నుంచి పక్కకు వెళ్ళకపోతే కచ్చితంగా అప్పుడే నేను నిన్ను చంపి దాని ప్రాణం రక్షించి ఉండేవాణ్ణి” అని అతనితో అన్నాడు.
34 అందుకు బిలాము “నేను పాపం చేశాను. నువ్వు నాకు ఎదురుగా దారిలో నిలుచుని ఉన్నావని నాకు తెలియలేదు. కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను ఎక్కడనుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతాను” అని యెహోవా దూతతో చెప్పాడు.
సంఖ్యా 22 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019