Text copied!
Bibles in Telugu

సంఖ్యా 16:3-36 in Telugu

Help us?

సంఖ్యా 16:3-36 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 మోషే అహరోనులకు విరోధంగా సమకూడారు. “మీరు చాలా ఎక్కువ అధికారం చలాయిస్తున్నారు. ఈ సమాజంలో ఉన్న వారిందరూ పవిత్రులే. అందరూ యెహోవా కోసం ప్రత్యేకించిన వారే. యెహోవా వారి మధ్య ఉన్నాడు. యెహోవా సమాజం మీద మిమ్మల్ని మీరు ఎందుకు గొప్ప చేసుకుంటున్నారు?” అన్నారు.
4 మోషే ఆ మాట విన్నప్పుడు, సాగిలపడ్డాడు. ఆ తరువాత అతడు కోరహుతో, అతని గుంపుతో,
5 “ఆయన వారు ఎవరో యెహోవా కోసం ప్రత్యేకించిన వారెవరో రేపు యెహోవా తెలియజేసి అతన్ని తన సన్నిధికి రానిస్తాడు. ఆయన తాను ఏర్పరచుకున్నవాణ్ణి తన దగ్గరికి చేర్చుకుంటాడు.
6 కోరహు, నువ్వూ నీ గుంపూ ఇలా చెయ్యండి, మీరు ధూపార్తులు తీసుకుని వాటిలో నిప్పు ఉంచి రేపు యెహోవా సన్నిధిలో వాటి మీద ధూపసాంబ్రాణి వెయ్యండి.
7 అప్పుడు యెహోవా ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో అతనే పవిత్రుడు. లేవీ కొడుకులారా, మీరు చాలా దూరం వెళ్ళారు” అన్నాడు.
8 ఇంకా మోషే కోరహుతో “లేవీ కొడుకులారా వినండి,
9 తన మందిరసేవ చెయ్యడానికి యెహోవా మిమ్మల్ని తన దగ్గరికి చేర్చుకోవడం చిన్న విషయమా? మీరు సమాజం ఎదుట నిలబడి వారు చెయ్యవలసిన సేవ చేసేలా ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజంలోనుంచి మిమ్మల్ని ప్రత్యేక పరచుకోవడం మీకు తక్కువగా కనిపిస్తున్నదా?
10 ఆయన నిన్నూ, నీతో లేవీయులైన నీ గోత్రం వారిందర్నీ చేర్చుకున్నాడు గదా. ఇప్పుడు మీరు యాజకత్వం కూడా కోరుతున్నారు.
11 దీని కోసం నువ్వూ, నీ గుంపూ యెహోవాకు విరోధంగా పోగయ్యారు. మీరు అహరోనును ఎందుకు విమర్శిస్తున్నారు? అతడు కేవలం యెహోవాకు లోబడినవాడు” అన్నాడు.
12 మోషే అప్పుడు ఏలీయాబు కొడుకులు దాతాను అబీరాములను పిలిపించాడు.
13 కాని వారు “మేము రాము, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపాలని పాలు తేనెలు ప్రవహించే దేశంలో నుంచి మమ్మల్ని తీసుకు రావడం చాలదనట్టు, మామీద ప్రభుత్వం చెయ్యడానికి నీకు అధికారం కావాలా?
14 అంతేకాదు, నువ్వు పాలు తేనెలు ప్రవహించే దేశం లోకి మమ్మల్ని తీసుకు రాలేదు. పొలాలు, ద్రాక్షతోటలు ఉన్న స్వాస్థ్యం మాకివ్వలేదు. మమ్మల్ని శుష్క ప్రియాలతో గుడ్డివారుగా చేస్తావా? మేము రాము” అన్నారు.
15 అందుకు మోషే పట్టరాని కోపంతో, యెహోవాకు చెప్తూ “నువ్వు వారి నైవేద్యాన్ని గుర్తించ వద్దు. ఒక్క గాడిదనైనా నేను వారి దగ్గర తీసుకోలేదు. వారిలో ఎవరికీ నేను హాని చెయ్యలేదు” అన్నాడు.
16 అప్పుడు మోషే కోరహుతో “నువ్వూ, నీ గుంపూ, అంటే నువ్వూ, నీ వారూ, అహరోను, రేపు యెహోవా సన్నిధిలో నిలబడాలి.
17 మీలో ప్రతివాడూ తన ధూపార్తిని తీసుకుని వాటి మీద ధూప సాంబ్రాణి వేసి, ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకుని 250 ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవాలి. నువ్వూ, అహరోను ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవాలి” అని చెప్పాడు.
18 కాబట్టి వారిల్లో ప్రతివాడూ తన ధూపార్తిని తీసుకుని వాటిలో నిప్పు ఉంచి వాటి మీద ధూప సాంబ్రాణి వేసినప్పుడు, వారూ, మోషే అహరోనులూ సన్నిధి గుడారం ద్వారం దగ్గర నిలబడ్డారు.
19 కోరహు సన్నిధి గుడారం ద్వారం దగ్గరికి తన సమాజాన్ని వాళ్లకు విరోధంగా పోగు చేసినప్పుడు, యెహోవా మహిమ సమాజమంతటికీ కనిపించింది.
20 అప్పుడు యెహోవా “మీరు ఈ సమాజంలోనుంచి అవతలికి వెళ్ళండి.
21 తక్షణమే నేను వారిని కాల్చేస్తాను” అని మోషే అహరోనులతో చెప్పినప్పుడు,
22 వారు సాగిలపడి “దేవా, సమస్త మానవాళి ఆత్మలకు దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందుకు ఈ సమాజం అంతటి మీద నువ్వు కోపం చూపిస్తావా?” అని యెహోవాను వేడుకున్నారు.
23 అప్పుడు యెహోవా మోషేకు జవాబిస్తూ,
24 “సమాజమంతటితో చెప్పు, కోరహు, దాతాను, అబీరాముల గుడారాల చుట్టుపట్ల నుంచి వెళ్ళి పొండి” అన్నాడు.
25 అప్పుడు మోషే లేచి, దాతాను అబీరాముల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్ళారు.
26 అతడు “ఈ దుష్టుల గుడారాల దగ్గర నుంచి వెళ్ళి పొండి. మీరు వారి పాపాలన్నిట్లో పాలివారై నాశనం కాకుండా ఉండేలా వాళ్లకు కలిగినది ఏదీ ముట్టుకోకండి” అని ఆ సమాజంతో అన్నాడు.
27 కాబట్టి వారు కోరహు, దాతాను, అబీరాముల గుడారాల దగ్గర నుంచి ఇటు అటు లేచి వెళ్ళిపోయారు. దాతాను, అబీరాము, వారి భార్యలు, వారి కొడుకులు, వారి పసిపిల్లలు తమ గుడారాల ద్వారం దగ్గర నిలబడ్డారు.
28 అప్పుడు మోషే “ఈ కార్యాలన్నీ చెయ్యడానికి యెహోవా నన్ను పంపాడనీ, నా అంతట నేనే వాటిని చెయ్యలేదనీ దీనివల్ల మీరు తెలుసుకుంటారు.
29 మనుషులందరికీ వచ్చే చావు లాంటి చావు వీళ్ళకు వస్తే ప్రతి మనిషికీ కలిగేదే వీళ్ళకూ కలిగితే, యెహోవా నన్ను పంపలేదు.
30 కాని, యెహోవా ఒక అద్భుతం చేసి, వారు ప్రాణాలతోనే పాతాళంలోకి కుంగిపోయేలా భూమి తన నోరు తెరచి వారిని, వాళ్లకు కలిగిన సమస్తాన్నీ మింగేస్తే, వారు యెహోవాను అలక్ష్యం చేశారని మీకు తెలుస్తుంది” అన్నాడు.
31 మోషే ఆ మాటలన్నీ చెప్పిన వెంటనే వారి కింద ఉన్న నేల తెరుచుకుంది.
32 భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబాలను, కోరహు సంబంధులందర్నీ, వాళ్లకు చెందిన వాటన్నిటినీ మింగేసింది.
33 వారూ, వారి సంబంధులందరూ ప్రాణాలతో పాతాళంలోకి కుంగిపోయారు. భూమి వారిని మింగేసింది. వారు సమాజంలో ఉండకుండాా నాశనం అయ్యారు.
34 వారి చుట్టూ ఉన్న ఇశ్రాయేలీయులందరూ వారి కేకలు విని “భూమి మనలను కూడా మింగేస్తుందేమో” అనుకుంటూ పారిపోయారు.
35 అప్పుడు యెహోవా దగ్గర నుంచి అగ్ని బయలుదేరి, ధూపార్పణ తెచ్చిన ఆ 250 మందిని కాల్చేసింది.
36 అప్పుడు యెహోవా మోషేతో “నువ్వు యాజకుడైన అహరోను కొడుకు ఎలియాజరుతో చెప్పు, ఆ అగ్ని మధ్యలోనుంచి ఆ ధూపార్తులను ఎత్తు, అవి ప్రతిష్ఠితమైనవి.
సంఖ్యా 16 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019