Text copied!
Bibles in Telugu

సంఖ్యా 11:9-23 in Telugu

Help us?

సంఖ్యా 11:9-23 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 రాత్రి వేళల్లో శిబిరం పైన మంచు కురిసినప్పుడు దాంతో పాటే మన్నా కూడా ఆ మంచు పైన పడేది.
10 ప్రజలు వారి కుటుంబాలతో కలసి ఎవరి గుమ్మం ఎదుట వారు కూర్చుని ఏడుస్తుండగా మోషే విన్నాడు. యెహోవా భీకర కోపం రగిలి పోయింది. వారు ఏడవడం, ఫిర్యాదు చేయడం మోషే దృష్టిలో తప్పుగా ఉంది.
11 అప్పుడు మోషే యెహోవాతో ఇలా అన్నాడు. “నేను నీ సేవకుణ్ణి. నాపై ఇంత నిర్దయగా వ్యవహరించావెందుకు? నాపై ఇంత కోపంగా ఉన్నావెందుకు? ఈ ప్రజల భారాన్ని నాపై మోపావు.
12 ఈ జనాన్నంతా నేను కన్నానా? ‘తండ్రి తన బిడ్డని గుండెకి హత్తుకున్నట్టుగా వీరిని హత్తుకో’ అని నువ్వు నాతో చెప్పడానికి నేనేమన్నా వారిని నా గర్భంలో మోసానా? వారి పూర్వీకులకి నువ్వు ఇస్తానని ప్రమాణం చేసిన దేశానికి నేను వారిని మోసుకు వెళ్ళాలా?
13 ఇంతమంది ప్రజలకి మాంసం నేను ఎక్కడ నుండి తేవాలి? వారు నన్ను చూసి ఏడుస్తున్నారు. ‘మేము తినడానికి మాంసం ఇవ్వు’ అంటున్నారు.
14 ఈ ప్రజలందరి భారం మోయడం నా ఒక్కడి వల్ల కాదు. వీళ్ళ భారం నా శక్తికి మించింది.
15 నువ్వు నాతో ఇలా వ్యవహరించదలిస్తే నన్ను ఇప్పుడే చంపెయ్యి. నా మీద నీకు దయ కలిగితే నన్ను చంపి నా బాధ తీసెయ్యి.”
16 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు. “ఇశ్రాయేలు ప్రజల్లో పెద్దలు 70 మందిని నాదగ్గరికి తీసుకురా. వారు ప్రజల్లో పెద్దలనీ అధిపతులనీ స్పష్టంగా గుర్తించి తీసుకురా. వారిని సన్నిధి గుడారం దగ్గరికి తీసుకుని రా. వారిని నీతో కూడా నిలబెట్టు.
17 అక్కడ నేను దిగి నీతో మాట్లాడతాను. తరువాత నీ మీద ఉన్న ఆత్మలో కొంత వారి పైన ఉంచుతాను. వారు నీతో కలసి ప్రజల భారాన్ని మోస్తారు. నువ్వు ఒంటరిగా ఈ భారం మోయాల్సిన అవసరం లేదు.
18 నువ్వు ప్రజలకుఇలా చెప్పు. రేపటికి మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి. యెహోవా రాకకై సిద్ధపడండి. యెహోవా వింటుండగా మీరు ఏడ్చారు కాబట్టి మీరు కచ్చితంగా మాంసం తింటారు. ‘మాకు మాంసం ఎవరు పెడతారు? మాకు ఐగుప్తులోనే బాగుంది’ అన్నారు గదా. అందుకని యెహోవా మీకు మాంసం ఇస్తాడు. మీరు దాన్ని తింటారు.
19 ఒక్క రోజు కాదు, రెండు రోజులు కాదు, ఐదు రోజులు కాదు, పది రోజులు కాదు, ఇరవై రోజులు కాదు.
20 ఒక నెల రోజులు మీరు మాంసం తింటారు. అది మీ ముక్కు పుటాల్లోంచి బయటకు వచ్చి మీకు అసహ్యం పుట్టే వరకూ తింటారు. మీరు మీ మధ్య ఉన్న యెహోవాను తిరస్కరించారు కాబట్టి అది మీకు వెగటు పుట్టిస్తుంది. ఆయన ముందు మీరు ఏడ్చారు. ‘ఐగుప్తు నుండి ఎందుకు వచ్చాం?’ అన్నారు.”
21 దానికి మోషే “నేను ఆరు లక్షలమంది జనంతో ఉన్నాను. నువ్వేమో ‘ఒక నెల అంతా వాళ్లకి మాంసం ఇస్తాను’ అంటున్నావు.
22 ఇప్పుడు వారిని తృప్తి పరచడానికి గొర్రెలను, పశువులను చంపాలా? సముద్రంలో ఉన్న చేపలన్నిటినీ వారి కోసం పట్టాలా?” అన్నాడు.
23 అప్పుడు యెహోవా మోషేతో “నా బాహుబలానికి శక్తి తగ్గిందా? నా మాట నిజమో కాదో నువ్వు ఇప్పుడే చూస్తావు” అన్నాడు.
సంఖ్యా 11 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019