Text copied!
Bibles in Telugu

సంఖ్యా 10:1-24 in Telugu

Help us?

సంఖ్యా 10:1-24 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు.
2 “రెండు వెండి బాకాలు చేయించు. వెండిని సాగగొట్టి వాటిని చేయించాలి. సమాజాన్ని సమావేశం కోసం పిలవడానికీ, సేనలను తరలించడానికీ ఆ బాకాలను ఉపయోగించాలి.
3 సన్నిధి గుడారం ఎదుట నీ దగ్గరికి సమాజమంతా సమావేశం కావడానికి యాజకులు ఆ బాకాలు ఊదాలి.
4 యాజకులు ఒకే బాకా ఊదితే ఇశ్రాయేలు సమాజంలో నాయకులూ, తెగల పెద్దలు నీ దగ్గరకి రావాలి.
5 మీరు పెద్ద శబ్దంతో వాటిని ఊదితే అది సంకేతంగా భావించి తూర్పు వైపున ఉన్న సేనలు ప్రయాణం ప్రారంభించాలి.
6 మీరు రెండో సారి పెద్ద శబ్దంతో వాటిని ఊదితే అది సంకేతంగా భావించి దక్షిణం వైపున సైన్యాలు ప్రయాణం మొదలు పెట్టాలి. వారి ప్రయాణం ప్రారంభించినప్పుడు పెద్ద శబ్దంతో ఊదాలి.
7 సమాజం సమావేశంగా కూడినప్పుడు బాకాలు ఊదాలి గానీ పెద్ద శబ్దం చేయకూడదు.
8 యాజకులైన అహరోను కొడుకులు ఆ బాకాలు ఊదాలి. మీ తరతరాల్లో మీ సంతానానికి అది నిత్యమైన నియమంగా ఉండాలి.
9 మిమ్మల్ని బాధించే శత్రువుకి వ్యతిరేకంగా మీ దేశంలో యుద్ధానికి బయలు దేరే సమయంలో ఆ బాకాలు పదేపదే పెద్ద శబ్దంతో ఊదాలి. అప్పుడు మీ దేవుడైన యెహోవా అనే నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని శత్రువుల నుండి మిమ్మల్ని రక్షిస్తాను.
10 మీ పండగల సమయంలోనూ, నెల ప్రారంభంలోనూ మీరు వేడుకలు చేసుకునేటప్పుడు మీరు అర్పించే దహన బలుల గౌరవార్ధం, మీ శాంతి బలుల గౌరవార్ధం మీరు బాకాలు ఊదాలి. ఇవి మీకు మీ దేవుడినైన నన్ను జ్ఞాపకం చేస్తాయి. నేనే యెహోవాను. మీ దేవుణ్ణి.”
11 రెండో సంవత్సరం రెండో నెల ఇరవయ్యో రోజున శాసనాల గుడారం పైనుండి మేఘం వెళ్లి పోయింది.
12 కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు సీనాయి అరణ్యంలో తమ ప్రయాణం సాగించారు. మేఘం తిరిగి పారాను అరణ్యంలో నిలిచింది.
13 యెహోవా మోషేకి ఇచ్చిన ఆదేశాలను బట్టి వారు తమ మొదటి ప్రయాణం చేశారు.
14 యూదా గోత్రం వారి ధ్వజం కింద ఉన్న సైన్యం మొదట శిబిరం బయటికి కదిలింది. అమ్మీనాదాబు కొడుకు నయస్సోను ఆ సైన్యానికి నాయకుడు.
15 ఇశ్శాఖారు గోత్రం సైన్యాన్ని సూయారు కొడుకు నెతనేలు నడిపించాడు.
16 జెబూలూను గోత్రం సైన్యానికి హేలోను కొడుకు ఏలీయాబు నాయకుడు.
17 గెర్షోను, మెరారి తెగలవారు తమ బాధ్యత ప్రకారం మందిరాన్ని విప్పి దాన్ని మోస్తూ ముందుకు సాగారు.
18 తరువాత రూబేను గోత్రం ధ్వజం కింద ఉన్న సైన్యం ముందుకు కదిలింది. ఆ సైన్యానికి నాయకుడు షెదేయూరు కొడుకు ఏలీసూరు.
19 షిమ్యోను గోత్రం సైన్యానికి సూరీషదాయి కొడుకు షెలుమీయేలు నాయకుడు.
20 గాదు గోత్రం సైన్యానికి దెయూవేలు కొడుకు ఎలీయాసాపు నాయకుడు.
21 కహాతు తెగవారు ప్రయాణమయ్యారు. వారు పరిశుద్ధ స్థలంలోని పరిశుద్ధ పరికరాలను మోస్తూ వెళ్ళారు. తరువాతి శిబిరంలో కహాతు తెగవారు వచ్చేలోగా ఇతరులు మందిరాన్ని నిలబెడుతూ ఉన్నారు.
22 ఎఫ్రాయీము గోత్రం వారి ధ్వజం కింద వారి సేనలు కదిలాయి. ఈ సైన్యానికి అమీహూదు కొడుకు ఎలీషామా నాయకుడు.
23 మనష్శే గోత్రం సైన్యానికి పెదాసూరు కొడుకు గమలీయేలు నాయకుడు.
24 బెన్యామీను గోత్రం సైన్యానికి గిద్యోనీ కొడుకు అబీదాను నాయకుడు.
సంఖ్యా 10 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019