Text copied!
Bibles in Telugu

లేవీ 8:18-32 in Telugu

Help us?

లేవీ 8:18-32 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

18 ఆ తరువాత మోషే దహనబలిగా ఒక పొట్టేలును తీసుకు వచ్చాడు. అహరోనూ, అతని కొడుకులూ ఆ పొట్టేలు తలపైన తమ చేతులుంచారు.
19 అప్పుడు మోషే దాన్ని వధించిన తరువాత దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూ చల్లాడు.
20 అతడు ఆ పొట్టేలును ముక్కలుగా చేసాడు. దాని తలనూ, ఆ ముక్కలనూ, కొవ్వునూ దహించాడు.
21 అతడు దాని లోపలి భాగాలనూ, కాళ్ళనూ నీళ్ళతో కడిగి ఆ మొత్తం పొట్టేలును బలిపీఠంపై దహించాడు. అది దహనబలి. కమ్మటి సువాసనను అది కలగజేసింది. అది యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్టు అగ్నితో యెహోవాకు చేసిన బలి.
22 ఆ తరువాత మోషే రెండో పొట్టేలుని తీసుకు వచ్చాడు. ఇది అహరోనుని సేవకై ప్రతిష్టించడం కోసం. ప్రతిష్ట కోసమైన ఈ పొట్టేలు తల పైన అహరోనూ, అతని కొడుకులూ తమ చేతులుంచారు.
23 మోషే దాన్ని వధించి దాని రక్తంలో కొంత తీసి, అహరోను కుడి చెవి తమ్మె పైనా, కుడిచేతి బొటన వేలి పైనా, కుడికాలి బొటన వేలి పైనా పూశాడు.
24 మోషే అహరోను కొడుకులను కూడా తీసుకు వచ్చి కొంత రక్తాన్ని వారి కుడి చెవి తమ్మెల పైనా, కుడి చేతుల బొటనవేళ్ళ పైనా, కుడి కాళ్ళ బొటన వేళ్ళ పైనా పూసాడు. తరువాత మిగిలిన రక్తాన్ని బలిపీఠంకి అన్ని వైపులా చిమ్మాడు.
25 తరువాత మోషే దాని కొవ్వునూ, కొవ్వు పట్టిన దాని తోకనూ, దాని అంతర్భాగాల పైని కొవ్వునూ, కాలేయం పైని కొవ్వునూ, రెండు మూత్ర పిండాలనూ, వాటి పైని కొవ్వునూ, కుడి తొడ భాగాన్నీ వేరు చేశాడు.
26 యెహోవా సమక్షంలో పొంగజేసే పదార్ధం లేకుండా చేసిన రొట్టెలతో ఉన్న బుట్టలో నుండి ఒక రొట్టెనూ, నూనె రాసి చేసిన ఒక రొట్టెనూ, ఒక అప్పడాన్నీ తీసి వాటిని కొవ్వు పైనా, కుడి తొడ భాగం పైనా పెట్టాడు.
27 వాటిని అహరోను చేతుల్లోనూ, అతని కొడుకుల చేతుల్లోనూ ఉంచి వాటిని యెహోవా సన్నిధిలో అర్పణగా పైకి ఎత్తి అటూఇటూ కదిలించి చూపాడు.
28 తరువాత మోషే వాటిని వాళ్ళ చేతుల నుంచి తీసుకుని దహనబలిగా బలిపీఠం పైన దహించాడు. అవి ప్రతిష్టార్పణలు. అవి కమ్మటి సువాసన కలుగజేసాయి. అది యెహోవాకు అర్పించిన దహనబలి.
29 తరువాత మోషే దాని రొమ్ము భాగాన్ని తీసుకుని దాన్ని కదలిక అర్పణగా యెహోవా సమక్షంలో పైకెత్తి కదిలించాడు. యాజకుణ్ణి ప్రతిష్టించే పనిలో యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు పొట్టేలులో అది మోషే వంతు.
30 తరువాత మోషే అభిషేకానికి ఉపయోగించే నూనెలో కొంత, బలిపీఠం పైని రక్తంలో కొంత తీసుకుని వాటిని అహరోను పైనా అతని బట్టల పైనా, అతని కొడుకుల పైనా, వాళ్ళ బట్టల పైనా చిలకరించాడు. ఆ విధంగా మోషే అహరోనునూ, అతని బట్టలనూ, అతని కొడుకులనూ, వాళ్ళ బట్టలనూ అభిషేకించాడు.
31 ఆ తరువాత మోషే అహరోనుతోనూ, అతని కొడుకులతోనూ ఇలా చెప్పాడు. “ప్రత్యక్ష గుడారం ప్రవేశ ద్వారం దగ్గర ఆ మాంసాన్ని వండండి. దాన్నీ, బుట్టలో సేవా ప్రతిష్ట కోసం ఉంచిన రొట్టెనూ మీరు తినాలి. అహరోనూ, అతని కొడుకులూ దాన్ని తినాలి అని నేను ఆజ్ఞాపించినట్టు మీరు వాటిని తినాలి.
32 మీరు తినగా మిగిలిన మాంసాన్నీ, రొట్టెనూ కాల్చివేయాలి.
లేవీ 8 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019