Text copied!
Bibles in Telugu

లేవీ 19:22-37 in Telugu

Help us?

లేవీ 19:22-37 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

22 అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపాన్నిబట్టి పాప పరిహార బలిగా ఆ పొట్టేలు మూలంగా యెహోవా సన్నిధిలో అతని కోసం ప్రాయశ్చిత్తం చేయాలి. ఈ విధంగా అతడు చేసిన పాపం విషయమై అతనికి క్షమాపణ కలుగుతుంది.
23 మీరు ఆ దేశానికి వచ్చి తినడానికి రకరకాల చెట్లు నాటినప్పుడు వాటి పండ్లను నిషేధంగా ఎంచాలి. మూడు సంవత్సరాల పాటు అవి మీకు అపవిత్రంగా ఉండాలి. వాటిని తినకూడదు.
24 నాలుగో సంవత్సరంలో వాటి పండ్లన్నీ యెహోవాకు ప్రతిష్ఠితమైన స్తుతి అర్పణలుగా ఉంటాయి. ఐదో సంవత్సరంలో వాటి పండ్లను తినొచ్చు.
25 నేను మీ దేవుడైన యెహోవాను.
26 రక్తం కలిసి ఉన్న మాంసం తినకూడదు. శకునాలు చూడకూడదు. మంత్ర ప్రయోగం ద్వారా ఇతరులను వశపరచుకోడానికి చూడకూడదు.
27 విగ్రహ పూజలు చేసే ఇతర జనాల్లాగా మీ తల పక్క భాగాలు గానీ నీ గడ్డం అంచులు గానీ గుండ్రంగా గొరిగించుకోకూడదు.
28 చచ్చిన వారి కోసం మీ దేహాన్ని గాయపరచుకోకూడదు. ఒంటిపై పచ్చబొట్లు పొడిపించుకోకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను.
29 నీ కూతురిని వేశ్యగా చేసి ఆమెను హీనపరచకూడదు. అలా చేస్తే మీ దేశం వ్యభిచారంలో పడిపోతుంది. మీ ప్రాంతం కాముకత్వంతో నిండిపోతుంది.
30 నేను నియమించిన విశ్రాంతి దినాలను మీరు ఆచరించాలి. నా పరిశుద్ధ మందిరాన్ని గౌరవించాలి. నేను యెహోవాను.
31 చచ్చిన ఆత్మలతో మాట్లాడుతామని చెప్పే వారి దగ్గరికి సోదె చెప్పేవారి దగ్గరికి పోకూడదు. అలా చేస్తే వారివలన మీరు అపవిత్రులౌతారు. నేను మీ దేవుడైన యెహోవాను.
32 తల నెరసిన ముసలివాడి ఎదుట లేచి నిలబడి అతని ముఖాన్ని గౌరవించాలి. నీ దేవునికి భయపడాలి. నేను యెహోవాను.
33 మీ దేశంలో పరదేశి ఎవరైనా మీ మధ్య నివసించేటప్పుడు అతణ్ణి బాధ పెట్టకూడదు,
34 మీ మధ్య నివసించే పరదేశిని మీలో పుట్టినవాడి లాగానే ఎంచాలి. నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే అతణ్ణి ప్రేమించాలి. ఐగుప్తులో మీరు పరదేశులుగా ఉన్నారు గదా. నేను మీ దేవుడైన యెహోవాను.
35 కొలతలోగాని తూనికలోగాని పరిమాణంలో గాని మీరు అన్యాయం చేయకూడదు.
36 న్యాయమైన త్రాసులు న్యాయమైన బరువులు, న్యాయమైన కొల పాత్రలు న్యాయమైన పడి మీకుండాలి. నేను ఐగుప్తులోనుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను.
37 మీరు నా శాసనాలన్నిటిని నా విధులన్నిటిని పాటించాలి. నేను యెహోవాను.”
లేవీ 19 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019