Text copied!
Bibles in Telugu

లేవీ 14:11-47 in Telugu

Help us?

లేవీ 14:11-47 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 శుద్ధీకరణ చేసే యాజకుడు శుద్ధీకరణ కోసం వచ్చిన వ్యక్తినీ ఈ సామగ్రినీ ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గరఉంచాలి.
12 యాజకుడు వాటిలో ఒక మగ గొర్రెపిల్లనూ, నూనెనూ తీసుకుని వాటిని అపరాధం కోసం చేసే బలిగా అర్పిస్తాడు. వాటిని యెహోవా సమక్షంలో కదలించే అర్పణగా పైకెత్తి కదిలిస్తాడు.
13 పాపం కోసం బలి పశువునూ, దహనబలి పశువునూ వధించే పరిశుద్ధ స్థలం లోనే ఈ మగ గొర్రెపిల్లని వధించాలి. పాపం కోసం చేసే అర్పణలాగే అపరాధం కోసం చేసే అర్పణ కూడా యాజకుడికే చెందుతుంది. ఎందుకంటే అది అతి పరిశుద్ధం.
14 తరువాత యాజకుడు అపరాధం కోసం బలిగా వధించిన పశువు రక్తాన్ని కొంచెం తీసుకుని శుద్ధీకరణ కోసం వచ్చిన వ్యక్తి కుడిచెవి తమ్మె పైనా, కుడిచేతి బొటన వేలిపైనా, కుడి కాలి బొటన వేలిపైనా పూయాలి.
15 తరువాత యాజకుడు అరలీటరు నూనె లో కొంచం తన ఎడమ అరచేతిలో పోసుకోవాలి.
16 ఎడమ చేతిలో ఉన్న నూనెలో తన కుడి చేతి వేలుని ముంచి యెహోవా సమక్షంలో ఏడు సార్లు చిలకరించాలి.
17 తరువాత యాజకుడు తన అరచేతిలో మిగిలిన నూనెలో కొంచెం తీసుకుని శుద్ధీకరణ కోసం వచ్చిన వ్యక్తి కుడిచెవి తమ్మె పైన, కుడిచేతి బొటన వేలిపైన, కుడి కాలి బొటన వేలిపైన ఉన్న అపరాధ బలిగా వధించిన పశువు రక్తంపై పూయాలి.
18 మిగిలిన నూనెని శుద్ధీకరణ కోసం వచ్చిన వ్యక్తి తలపైన రాయాలి. ఆ విధంగా యాజకుడు యెహోవా సమక్షంలో ఆ వ్యక్తి కోసం పరిహారం చేయాలి.
19 అప్పుడు యాజకుడు శుద్ధీకరణ కోసం వచ్చిన వ్యక్తి పాపం కోసం బలిని అర్పించి పరిహారం చేయాలి. ఆ తరువాత యాజకుడు దహనబలి పశువును వధించాలి.
20 యాజకుడు దహనబలినీ, నైవేద్యాన్నీ బలిపీఠం పైన అర్పించాలి. ఆవిధంగా యాజకుడు ఆ వ్యక్తి కోసం పరిహారం చేయాలి. అప్పుడు అతడు శుద్ధుడవుతాడు.
21 అయితే ఆ వ్యక్తి పేదవాడై ఈ అర్పణలన్నీ చెల్లించే స్తోమత అతనికి లేకపోతే తన పరిహారం కోసం అతడు యెహోవా ఎదుట కదలిక అర్పణగా ఒక మగ గొర్రె పిల్లనూ, నూనెతో కలిపిన కిలో గోదుమ పిండినీ, అర లీటరు నూనెనూ తీసుకుని రావాలి.
22 వీటితో పాటు తన స్తోమతుకు తగినట్టు రెండు గువ్వలను గానీ రెండు తెల్ల పావురాలను గానీ తీసుకు రావాలి. వాటిలో ఒకటి పాపం కోసం బలి అర్పణగా మరొకటి దహనబలి అర్పణగా తీసుకురావాలి.
23 ఎనిమిదో రోజు అతడు తన శుద్ధీకరణ కోసం వాటిని ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర యెహోవా సమక్షంలో యాజకుడి దగ్గరికి తీసుకురావాలి.
24 అప్పుడు యాజకుడు అపరాధం కోసం బలి అర్పణకై తెచ్చిన గొర్రెపిల్లనూ నూనెనూ తీసుకుని కదలిక అర్పణగా యెహోవా సమక్షంలో వాటిని కదిలించాలి.
25 తరువాత అతడు అపరాధం కోసం బలి అర్పణగా తెచ్చిన గొర్రెపిల్లని వధించాలి. అపరాధం కోసం బలిగా వధించిన పశువు రక్తాన్ని కొంచెం తీసుకుని శుద్ధీకరణ కోసం వచ్చిన వ్యక్తి కుడిచెవి తమ్మెపైన, కుడిచేతి బొటన వేలిపైన, కుడి కాలి బొటన వేలిపైన పూయాలి.
26 తరువాత యాజకుడు అరలీటరు నూనెలో కొంచం తన ఎడమ అరచేతిలో పోసుకోవాలి.
27 ఎడమ చేతిలో ఉన్న నూనెలో తన కుడి చేతి వేలుని ముంచి యెహోవా సమక్షంలో ఏడు సార్లు చిలకరించాలి.
28 తరువాత యాజకుడు తన అరచేతిలో మిగిలిన నూనెలో కొంచెం తీసుకుని శుద్ధీకరణ కోసం వచ్చిన వ్యక్తి కుడిచెవి తమ్మెపైన, కుడిచేతి బొటన వేలిపైన, కుడి కాలి బొటన వేలిపైన అపరాధ బలిగా వధించిన పశువు రక్తంపై పూయాలి.
29 మిగిలిన నూనెని శుద్ధీకరణ కోసం వచ్చిన వ్యక్తి తలపైన యెహోవా సమక్షంలో రాయాలి.
30 తరువాత అతడు తన స్తోమత కొద్దీ తెచ్చిన రెండు గువ్వల్లో, లేదా రెండు తెల్లని పావురం పిల్లల్లో ఒక దాన్ని పాపం కోసం బలిగా మరో దాన్ని దహనబలిగా అర్పించాలి.
31 తానర్పించే నైవేద్యంతో పాటుగా వీటిని అర్పించాలి. తరువాత శుద్ధీకరణ కోసం వచ్చిన వ్యక్తి కోసం యాజకుడు యెహోవా సమక్షంలో పరిహారం చేయాలి. ఆ విధంగా యాజకుడు అతని పాపాలు కప్పివేస్తాడు.
32 చర్మంలో వచ్చిన అంటువ్యాధి శుద్ధీకరణ కోసం నిర్ధారించిన బలులు సమర్పించుకోలేని వ్యక్తి విషయంలో విధించిన చట్టం ఇది.”
33 తరువాత యెహోవా, మోషే అహరోనులతో ఇలా చెప్పాడు.
34 “నేను మీకు వారసత్వంగా ఇచ్చే కనాను దేశంలో మీరు ప్రవేశించిన తరువాత ఏదైనా ఇంట్లో నేను బూజునూ, తెగులునూ కలిగిస్తే,
35 ఆ యింటి యజమాని యాజకుడి దగ్గరికి వచ్చి, ‘నా ఇంట్లో బూజు వంటిదేదో ఉన్నట్టు నాకన్పిస్తుంది’ అని చెప్పాలి.
36 అప్పుడు ఆ ఇంట్లో ఉన్నదంతా అశుద్ధం కాకుండా ఉండటానికి యాజకుడు వెళ్ళి ఆ ఇంటిని చూడాలి. దానికి ఎదుట యాజకుడు వాళ్ళని ఆ ఇల్లు ఖాళీ చేయమని ఆదేశించాలి. ఆ తరువాత యాజకుడు ఆ ఇంటిని చూడటానికి వెళ్ళాలి.
37 అతడు ఆ బూజుని చూడాలి. అది ఇంటి గోడల పైన పాకిందేమో చూడాలి. అది ఇంటి గోడలపైన ఎర్ర గీతలా గానీ, పచ్చ గీతలా గానీ ఉండి గోడ పగుళ్ళలో ఉంటే
38 యాజకుడు ఆ ఇంట్లో నుండి బయటకు వెళ్ళి ఆ ఇంటిని ఏడు రోజులపాటు మూసి ఉంచాలి.
39 ఏడో రోజు యాజకుడు తిరిగి వచ్చి మళ్ళీ పరీక్షించాలి. గోడపైన బూజు వ్యాపించిందేమో పరిశీలించాలి.
40 ఒకవేళ అది వ్యాపిస్తే, ఆ బూజు పట్టిన రాళ్ళను గోడలోంచి తీసి పట్టణం బయట ఉన్న ఒక అశుద్ధమైన ప్రాంతంలో పారవేయమని యాజకుడు ఆదేశించాలి.
41 ఆ తరువాత ఆ యింటి లోపల చుట్టూ గోడలను గీకించాలి. అలా గీకించిన తరువాత మాలిన్యం అంటిన పెళ్లలను పట్టణం బయట ఉన్న ఒక అశుద్ధమైన ప్రాంతంలో పారవేయాలి.
42 వేరే రాళ్ళను తెచ్చి తీసివేసిన రాళ్ళ స్థానంలో చేర్చాలి. అలాగే కొత్త అడుసు తెచ్చి ఆ ఇంటి గోడలకు పూయాలి.
43 అతడు ఆ రాళ్లను ఊడదీసి, ఆ ఇల్లు గీకించి, కొత్త అడుసు పూసిన తరువాత మళ్ళీ బూజు కన్పిస్తే యాజకుడు వచ్చి చూడాలి.
44 ఆ ఇల్లంతా బూజు వ్యాపించిందేమో యాజకుడు పరీక్షించాలి. ఒకవేళ బూజు కన్పిస్తే అది హానికరం. ఆ ఇల్లు అశుద్ధం.
45 కాబట్టి ఆ ఇంటిని కూల్చి వేయాలి. ఆ ఇంటి రాళ్ళనూ, కలపనూ, అడుసునూ తీసి పట్టణం బయట ఉన్న అశుద్ధమైన ప్రాంతంలోకి మోసుకు వెళ్ళి పారవేయాలి.
46 దీనికి తోడు ఆ ఇల్లు మూసి ఉన్న సమయంలో ఎవరైనా దానిలో ప్రవేశిస్తే వాళ్ళు సాయంత్రం వరకూ అశుద్ధంగా ఉంటారు.
47 ఆ ఇంట్లో నిద్రించేవాడు తన బట్టలు ఉతుక్కోవాలి. అలాగే ఆ ఇంట్లో భోజనం చేసేవాడు కూడా తన బట్టలు ఉతుక్కోవాలి.
లేవీ 14 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019