Text copied!
Bibles in Telugu

లేవీ 13:27-37 in Telugu

Help us?

లేవీ 13:27-37 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

27 ఏడో రోజు యాజకుడు అతణ్ణి పరీక్షించినప్పుడు ఆ వ్యాధి చర్మం అంతా వ్యాపిస్తే అతణ్ణి అశుద్ధుడని నిర్థారించాలి. అది అంటువ్యాధి.
28 అయితే నిగనిగలాడే మచ్చ చర్మం అంతా వ్యాపించకుండా అలాగే ఉండి మానినట్టు కన్పిస్తే అది కాలిన గాయం వల్ల కలిగిన వాపు. యాజకుడు అతణ్ణి శుద్ధుడుగా నిర్థారించాలి. అది కేవలం కాలడం మూలాన కలిగిన మచ్చ మాత్రమే.
29 మగవాళ్ళకైనా, ఆడవాళ్లకైనా తలలో గానీ, గడ్డంలో గానీ ఏదన్నా అంటువ్యాధి వస్తే యాజకుడు దాన్ని పరీక్షించాలి.
30 అది చర్మంలో లోతుగా ఉన్నట్టు కన్పించినా, లేదా దానిపై వెంట్రుకలు పసుపు పచ్చగా మారినా ఆ వ్యక్తిని యాజకుడు అశుద్ధుడనీ, అశుద్ధురాలనీ నిర్థారించాలి. తలలో లేదా గడ్డంలో అది దురద పుట్టించే ఒక అంటువ్యాది.
31 ఏదైనా మచ్చ దురద పుట్టేదిగా ఉన్నప్పుడు యాజకుడు ఆ మచ్చని పరీక్షించాలి. ఆ మచ్చ చర్మంలో లోతుగా లేకపోయినా, దానిపై నల్ల వెంట్రుకలు లేకపోయినా యాజకుడు ఆ దురద మచ్చ వ్యాధి ఉన్న వ్యక్తిని ఏడు రోజుల పాటు ఒంటరిగా, వేరుగా ఉంచాలి.
32 ఏడో రోజు యాజకుడు ఆ మచ్చ వ్యాపించిందేమో చూడాలి. వ్యాధి మచ్చ ఉన్న ప్రాంతంలో పసుపు పచ్చ వెంట్రుకలు లేకపోయినా, ఆ మచ్చ కేవలం చర్మం పైన మాత్రమే కన్పిస్తున్నా అతనికి జుట్టు కత్తిరించాలి.
33 వ్యాధి మచ్చ ఉన్నచోట మాత్రం జుట్టు కత్తిరించకూడదు. యాజకుడు ఆ మచ్చ ఉన్న వ్యక్తిని మరో ఏడు రోజులు ఒంటరిగా, వేరుగా ఉంచాలి.
34 ఏడో రోజు యాజకుడు ఆ మచ్చ వ్యాపించిందేమో చూడాలి. ఆ మచ్చ కేవలం చర్మం పైన మాత్రమే కనిపిస్తూ ఉంటే యాజకుడు అతణ్ణి శుద్ధుడిగా నిర్థారించాలి. ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి. తరువాత అతడు శుద్ధుడు అవుతాడు.
35 ఒకవేళ అతడు శుద్ధుడని నిర్ధారించిన తరువాత ఆ వ్యాధి మచ్చ ఎక్కువగా వ్యాపిస్తే యాజకుడు తిరిగి అతణ్ణి పరీక్షించాలి.
36 ఒకవేళ ఆ వ్యాధి చర్మంపైన వ్యాపిస్తే యాజకుడు పసుపుపచ్చ వెంట్రుకల కోసం వెదకాల్సిన పని లేదు. అతడు అశుద్ధుడే.
37 అయితే ఆ దురద వ్యాధి వ్యాప్తి నిలిచిపోయిందనీ, ఆ వ్యాధి మచ్చలో నల్ల వెంట్రుకలు మొలుస్తున్నాయనీ యాజకుడికి అన్పిస్తే ఆ వ్యాధి నయం అయినట్టే. అతడు శుద్ధుడే. యాజకుడు అతడు శుద్ధుడని నిర్థారించాలి.
లేవీ 13 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019